iDreamPost

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ గారు ఇది విన్నారా..?

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ గారు ఇది విన్నారా..?

రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారి చేతిలో ప్రజా శ్రేయస్సు ఉంటుంది. వారు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఏపీలో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను బట్టి చెప్పవచ్చు. కరోనా వైరస్‌ను కారణంగా చూపుతూ ఏపీలో యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న స్థానిక సంస్థ ఎన్నికల ప్రక్రియను అప్పటికప్పుడు అర్థంతరంగా వాయిదా వేశారు ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో గానీ, ప్రభుత్వంతో గాని సమాలోచనలు జరపకుండా ఏక పక్షంగా ఎన్నికల వాయిదా వేయడం వల్ల ఎంత నష్ట జరుగుతుందో ఏపీ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు.

ప్రస్తుత వర్షాకాలంలో మురుగు కాలువలో పేరుకుపోయిన పూడిక తీసేందుకు, పొలాల్లోకి వెళ్లే రహదారుల వెంట ఏపుగా పెరిగిన ముళ్లచెట్లు, మట్టి రోడ్లపై గుంతలు పూడ్చివేత, వెలగని విద్యుత్‌ దీపాలు.. ఇలా ప్రతి సమస్య గ్రామీణ ప్రజలను బాధిస్తోంది. వీటి పరిష్కారం కోసం గ్రామస్తులు మండల కేంద్రాల్లో ఉండే ప్రత్యేక అధికారుల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ఆయా అధికారులు తమ పరిధి మేరకు పని చేయాల్సి రావడంతో సమస్యల పరిష్కారం వారాలు, నెలల తరబడి కూడా కావడం లేదు. అదే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి ఉంటే.. పాలక మండలి ఏర్పడేది. సమస్య ఏదైనా సరే ఉదయం అనుకుంటే సాయంత్రానికి పరిష్కారం అయ్యేది. కానీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహరించిన తీరుతో పాలక మండళ్లు లేక ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారమే పెద్ద సమస్యగా మారింది.

కరోనా వల్ల ఇతర ఎన్నికల వాయిదా పడ్డాయా..? అంటే లేదాయో. తాజాగా బిహార్‌ శాసన సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మూడు దశల్లో ఎన్నికలు పూర్తి చేసి నంబర్‌ 10వ తేదీన లెక్కింపు చేపడతామని పేర్కొంది. మరి ఈ విషయం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ విన్నారో లేదో గానీ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని సమయంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ తాను తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో తెలిసేది.

దేశంలో కరోనా వైరస్‌ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. బిహార్‌ ఇందుకు మినహాయిపు ఏమీ లేదు. ఇప్పటి వరకూ బిహార్‌లో 1.76 లక్షల మందికి వైరస్‌ సోకింది. ఏపీ కన్నా బిహార్‌ జనాభా, ఓటర్లు ఎక్కువ, బిహర్‌లో 7.29 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో దాదాపు సగం మంది ఓటర్లే ఏపీలో ఉన్నారు. కరోనా కేసులు నమోదవుతున్న సమయంలోనే ఏపీ కన్నా రెట్టింపు ఓటర్లు ఉన్న బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమవడం.. ఏపీలో స్థానిక సంస్థలను ఏకపక్షంగా వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు చెంపదెబ్బ వంటిదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

తాను తీసుకున్న నిర్ణయం సరైనది కాదని రమేష్‌కుమార్‌ ఇప్పుడు రియలైజ్‌ అయినా.. జరిగిన నష్టాన్ని మాత్రం భర్తీ చేయలేరు. వచ్చే జనవరి వరకూ ప్రత్యేక అధికారుల పాలనలోనే ఏపీలోని స్థానిక సంస్థలు కొనసాగాల్సిందే.

Read Also : టిడిపి సంస్థాగత ఎన్నికల్లో విజేతలెవరు..?!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి