iDreamPost

సెలవు విషయం లీకైంది.. సీబీఐ విచారణ జరపండి..

సెలవు విషయం లీకైంది.. సీబీఐ విచారణ జరపండి..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఏపీ ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్‌తో జరిపిన సంప్రదింపులు లీకవుతున్నాయని, తన సెలవు విషయం కూడా లీకైందని, ఈ లీకులపై సీబీఐ విచారణ జరపాలంటూ నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో గవర్నర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యానారాయణలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

మరో పది రోజుల్లో అంటే ఈ నెలాఖరున నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఉద్యోగ విరమణ చేయబోతున్నారు. ఇలాంటి సమయంలో గవర్నర్‌తో సంప్రదింపులు లీకవుతున్నాయంటూ హైకోర్టును ఆశ్రయిచండం ఆసక్తికరం. రాష్ట్రంలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికులు పూర్తయ్యాయి. పరిషత్‌ ఎన్నికలు నిర్వహించే ఆలోచనతో నిమ్మగడ్డ లేరు. పంచాయతీ ఎన్నికలు ప్రారంభానికి ముందు ఆయన పలుమార్లు గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఎన్నికలు, కోర్టు వ్యవహారాలపై చర్చించారు. నెల రోజుల కిందట ఈ భేటీలు జరిగాయి. నాడు జరిగిన భేటీల తాలుకూ అంశాలు లీకవుతున్నాయంటూ నేడు ఆయన కోర్టును ఆశ్రయించడం వెనుక అసలు కారణం వేరే ఉంది.

ఎన్నికల సమయంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలపై ఆంక్షలు విధించడం, అగౌరవ పరిచే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఏపీ శాసన సభ ప్రివిలేజ్‌ కమిటీ నిమ్మగడ్డకు నోటీ సులు జారీ చేసింది. విచారణకు హాజరుకావాలని, అందుబాటులో ఉండాలని పేర్కొంది. సదరు నోటీసులపై నిమ్మగడ్డ కూడా స్పందించారు. ప్రివిలేజ్‌ కమిటీ విచారణను ఎదుర్కొంటే శిక్ష తప్పదనే భయంతో నిమ్మగడ్డ ఉన్నారు. ఈ విషయం నోటీసులకు ఆయన ఇచ్చిన సమాధానంతో అర్థమవుతోంది.

ఈ నేపథ్యంలో మంత్రులను బెదిరించేలా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం గమనార్హం. నాపై విచారణ చేస్తే.. మీపై విచారణ చేయిస్తానేలా నిమ్మగడ్డ వ్యవహార శైలి ఉంది. గవర్నర్‌తో జరిపిన సంప్రదింపులు లీకయ్యాయని గవర్నర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటెరీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులగా చేర్చడంలో అర్థముంది. అయితే మంత్రులు బొత్స, పెద్దిరెడ్డిలను కూడా ప్రతివాదులగా చేర్చుతూ సీబీఐ విచారణ కోరడంతోనే నిమ్మగడ్డ ఉద్దేశం అర్థమవుతోంది.

నిమ్మగడ్డ తీరు… 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చోటు చేసుకున్న ఓటుకు నోటు కేసును గుర్తు చేస్తోంది. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థికి వ్యతిరేకంగా.. ఓటు వేసేందుకు టీడీపీ ఐదు కోట్ల రూపాయల లంచం ఆఫర్‌ చేయడం.. అడ్వాన్స్‌గా 50 లక్షలు ఇవ్వడం ఆడియో, వీడియో ఆధారాలతో వెల్లడైంది. ఈ ఘటనలో నాటి సీఎం చంద్రబాబుదే ప్రధాన పాత్ర. ఏసీబీ కేసు నమోదు చేసి చంద్రబాబును విచారించేందుకు సిద్ధమైంది. ఈ సమయంలోనే చంద్రబాబు.. తన ఫోన్‌కాల్స్‌ను ట్యాప్‌ చేస్తున్నారంటూ, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఏపీలో తెలంగాణ ప్రభుత్వంపై కేసు నమోదు చేయించారు. ఓటుకు నోటు కేసులో తనను విచారిస్తే.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను విచారిస్తామనేలా చంద్రబాబు వ్యవహరించారు.

ఇప్పుడు నిమ్మగడ్డ కూడా.. సభాహక్కుల ఉల్లంఘన కింద మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స ఫిర్యాదులపై తనను విచారిస్తే.. ఆ ఇద్దరి మంత్రులు గవర్నర్‌తో తన సంభాషణను లీక్‌ చేశారని, వారిపై సీబీఐతో విచారణ చేయిస్తాననేలా వ్యవహరిస్తున్నారు. నిమ్మగడ్డ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది వేచి చూడాలి.

Also Read : ఆధారాలు చూపమంటూనే, అధికారం లేదంటున్న నిమ్మగడ్డ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి