iDreamPost

ప్రభుత్వ అఫిడవిట్ పై నిమ్మగడ్డ కౌంటర్ అఫిడవిట్ దాఖలు

ప్రభుత్వ అఫిడవిట్ పై నిమ్మగడ్డ కౌంటర్ అఫిడవిట్ దాఖలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగించడంపై హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. 17 పేజీల ప్రభుత్వ అఫిడవిట్ లో ఉన్న అంశాల వారీగా రమేష్ కుమార్ తన వివరణ ఇచ్చారు. ఎన్నికల సంస్కరణల పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నాయని నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఎన్నికల సంస్కరణలు ఫిబ్రవరిలోనే ప్రారంభించామని ప్రభుత్వం చెప్పడం లో వాస్తవం లేదన్నారు. ఎన్నికలకు సంబంధించి కమిషనర్ తన విచక్షణాధికారం మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని, దీనిపై ప్రభుత్వానికి ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని రమేష్ కుమార్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగలేదు అన్న విషయం ఎంపిటిసి, జెడ్పిటిసి స్థానాలు అత్యధికంగా ఏకగ్రీవం అవ్వడమే చెబుతున్నాయని పేర్కొన్నారు. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి 25% ఎంపిటిసి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఇక జెడ్పిటిసి స్థానం ఏకగ్రీవం కాగా ఈసారి 125 సీట్లు ఏకగ్రీవం అయ్యాయని పేర్కొన్నారు. సీఎం సొంత జిల్లాలో ఎంపిటిసి, జెడ్పిటిసి స్థానాలు అత్యధికంగా ఏకగ్రీవమయ్యాయని రమేష్ కుమార్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఎన్నికల సంస్కరణల పేరుతో పదవీకాలాన్ని కుదించినా అది ప్రస్తుతం పదవిలో ఉన్న వారికి వర్తించదని రమేష్ కుమార్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు.

ఎన్నికల సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దాని ప్రకారం ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించింది. దీంతో ఇప్పటికే నాలుగేళ్లు పదవీకాలం పూర్తిచేసుకున్న రమేష్ కుమార్ ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన స్థానంలో మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి కనగరాజు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తనను తొలగించడం రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక, తుది.. రూపంలో రెండు పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై రమేష్ కుమార్ తాజాగా ఈ రోజు రిప్లై పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై రేపు మంగళవారం రాష్ట్ర హైకోర్టులో విచారణ జరగనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి