iDreamPost

నిమ్మగడ్డ వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు..!

నిమ్మగడ్డ వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తనను తప్పించడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యంపై ఈరోజు రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. నిమ్మగడ్డ తో పాటు మరో కొంత మంది ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటన్నిటినీ కలిపి హైకోర్టు ధర్మాసనం ఈ రోజు విచారణ చేసింది. ఈ అంశంపై అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు నిమ్మగడ్డ రమేష్ కుమార్, నూతన ఎన్నికల కమిషనర్ వి.కనగరాజ్ తమ వాదనలను వినిపిస్తూ అఫిడవిట్లు దాఖలు చేశారు. ఆయా అఫిడవిట్ల లో పేర్కొన్న అంశాలనే.. ఇరు పక్షాల తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టి కి తెచ్చారు. ఇరు పక్షాల వాదనలను విన్న ధర్మాసనం తదుపరి విచారణను రేపు బుధవారానికి వాయిదా వేసింది.

ఎవరి వాదన వారిది…

ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే ఆర్డినెన్స్ తీసుకువచ్చామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. తనను కావాలనే పదవి నుంచి తొలగించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆరోపిస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తాము తొలగించ లేదని ఎన్నికల సంవత్సరం లో భాగంగా పదవీకాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించడంతో ఆయన పదవి కోల్పోయారని ప్రభుత్వం పేర్కొంటోంది. ఎన్నికల సంస్కరణలు తెచ్చిన అవి ప్రస్తుతం పదవిలో ఉన్న వారికి వర్తించవని నిమ్మగడ్డ వాదిస్తున్నారు.

తమకు మాట మాత్రమైనా చెప్పకుండా స్థానిక సంస్థలను వాయిదా వేసి, పోలీసులు, రెవెన్యూ అధికారులపై నిమ్మగడ్డ ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వం పేర్కొనగా.. ఎన్నికల వాయిదా అంశం తన వివక్ష విచక్షణాధికారం మేరకు తీసుకున్నాను..ఈ విషయం ప్రభుత్వానికి గానీ మరెవరికీ చెప్పాల్సిన అవసరం లేదు అంటూ నిమ్మగడ్డ తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటున్నారు. దాంతో పాటు స్థానిక సంస్థల్లో నామినేషన్ ప్రక్రియ, ఏకగ్రీవాల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇటు ప్రభుత్వం అటు నిమ్మగడ్డ ఎవరికి వారు తమ వాదనను బలపరచు కుంటూ అఫిడవిట్లు దాఖలు చేశాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి