iDreamPost

బయటపడ్డ పంచముఖి నాగ విగ్రహం

బయటపడ్డ పంచముఖి నాగ విగ్రహం

అనంతపురం జిల్లాలో గొల్లపల్లి రిజర్వాయర్ నుండి రాప్తాడు నియోజకవర్గంలోని పేరూరు డ్యాముకు నీళ్లు తరలించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించటంతో రాప్తాడు శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న కాలువ పనులు ప్రారంభించారు.

ఇదే పెన్నానది తీరాన కర్ణాటక రాష్ట్ర పరిధిలోని తూముకూరు జిల్లా పావగడ తాలూకా నాగలమడక దేవస్థానం ఉంది (కన్నడలో నాగలమడికే అని పిలుస్తారు)… మడికే(మడక) దున్నుతూ ఉంటే దొరికిన విగ్రహం అని ఆ క్షేత్రానికి ఈ పేరు వచ్చిందంటారు.

కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్యస్వామి ఆది సుబ్రహ్మణ్యం అని , ఘాటీ క్షేత్రములో ఉన్న సుబ్రహ్మణ్యం స్వామి మధ్య సుభ్రమణ్యం అని, నాగలమడకలో ఉన్న సుభ్రమణ్యం స్వామి అంత్య సుభ్రమణ్యం అని పిలుస్తారు. ఇక్కడ నాగ దోషం ఉన్నవారు, చర్మ వ్యాధులు ఉన్నవారు వచ్చి పూజలు చేయించుకుంటారు. ఇక్కడ తెలుగు ప్రజలే ఎక్కువ. ఈ దేవస్థానం నిర్మించిన దాత కూడా పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని రొద్దం మండలానికి చెందిన బాలసుబ్బయ్య ఈ దేవస్థానం నిర్మించారు…

నాగలమడక వద్ద పెన్నానది మీద చిన్న ఆనకట్టను కర్ణాటక ప్రభుత్వం నిర్మించింది. పేరూరు డ్యాముకు వెళ్లే నీళ్లు ఈ ఆనకట్టను దాటుకొని పెన్నానది ద్వారా చేరాలి.

నాగలమడక దేవస్థానంలో ఒక సాంప్రదాయం ఉంది. ఏదైనా విగ్రహాన్నినూతనంగా ప్రతిష్టించాలన్నలేదా ఏదైనా విగ్రహం శిధిలం కావటం వలన కొత్త విగ్రహం ప్రతిష్టించాలన్నా. కొత్త విగ్రహాన్ని కొంత కాలం పెన్నానది తీరంలో భూగర్భంలో ఉంచుతారు. అనుకున్న ముహూర్తనికి ఆ విగ్రహాన్ని వెలుపలికి తీసి ప్రతిష్ట జరుపుతారు.

పేరూరు డ్యాం వద్ద కాలువ పనులు మొదలు కావటంతో ఆరు నెలల కిందట నది ఒడ్డున దాచిన పంచముఖి నాగ విగ్రహం బయటకు తీసి ప్రతిష్టించారు. కాలువ పనులు మొదలైన సమయంలోనే పెద్ద పంచ ముఖ నాగ విగ్రహం బయటపడటంతో సోషల్ మీడియాలో వైరల్అయ్యింది. అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్లు ఇది పురాతనమైనదో లేదా నదిలో మునిగిపోయిన గుడికి సంబంధించినదో కాదు. ఆ ఆలయ సాంప్రదాయం ప్రకారం ప్రతిష్టతకీ ముందు నదీగర్భంలో దాచిపెట్టబడ్డ విగ్రహం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి