తాజాగా వెలువడిన ఆంధ్ర ప్రదేశ్ పరిషత్ ఎన్నికల ఫలితాలతో ప్రతిపక్ష టీడీపీ ఫలితాలు దారుణంగా మారాయి. 2019 అసెంబ్లీ, మొన్నటి మున్సిపల్ ఎన్నికల కంటే దారుణమైన పరాజయాన్ని ఈ సారి చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 13 జిల్లా పరిషత్‌ల్లో ఒక్కటి కూడా ఆ పార్టీ గెలుచుకోలేక పోయింది, మరీ దారుణం ఏమిటంటే దాదాపు ఏడు జిల్లాలో టిడిపి అభ్యర్థులు కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేక లేకపోవడం.
నిన్న ఉదయం ఎనిమిది గంటల సమయంలో మొదలైన ఎన్నికల లెక్కింపు ప్రక్రియ అర్ధరాత్రి దాటాక పూర్తయింది. రాత్రి రెండు గంటల సమయంలో అధికారులు ఎన్నికల ఫలితాలును ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 7,219 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరగ్గా 5,998 స్థానాలను అధికార వైసీపీ గెలుచుకుంది. 826 స్థానాల్లో టీడీపీ, జనసేన 177, బీజేపీ 28, సీపీఎం 15, సీపీఐ 8, స్వతంత్రులు 157 స్థానాల్లో విజయం సాధించారు. అలాగే, 515 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా వైస్సార్సీపీ 502, టీడీపీ 7, జనసేన 2, సీపీఎం ఒక చోట, స్వతంత్ర అభ్యర్ధి మరో చోట విజయం సాధించారు. 482 జెడ్పీటీసీలకు పోటీ చేసినా కేవలం ఏడు చోట్ల మాత్రమే గెలిచింది.
7 జిల్లాల్లో జిల్లా పరిషత్‌ల్లో టీడీపీకి ప్రాతినిథ్యమే లేకుండా పోగా శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలవ లేకపోయింది. మిగిలిన విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలు, కడప, అనంతపురం జిల్లాలకు గాను ఒక్కో స్థానాన్ని, కృష్ణా జిల్లాలో రెండు జెడ్పీటీసీ స్థానాలను అతికష్టం మీద సాధించింది. అయితే అది కూడా లోకల్ లో ఉన్న అభ్యర్ధుల చొరవే కానీ పార్టీ వల్ల ఉపయోగం లేదు అని అంటున్నారు. మరీ దారుణమైన విషయం ఏమిటంటే టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు స్వగ్రామం ఉన్న చిత్తూరు జిల్లాలో, రాష్ట్ర అధ్యక్షుడు అచెన్న స్వగ్రామం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో అసలు ఖతానే తెరవక పోవడం గమనార్హం.
Also Read : అభ్యర్థులకు ఉన్న ధైర్యం అధినేతకు లేదా…?
టీడీపీకి మిగిలిన 19 మంది ఎమ్మెల్యేల్లో ఎవరూ సరైన స్థానాలు దక్కించుకోలేక పోయారు. ఎమ్మెల్యేల పరిస్థితే ఇలా ఉంటే కీలక నేతలుగా భావించే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అయితే అసలు ఉన్నారా? లేరా? అనే పరిస్థితి. అయితే కవర్ చేసుకునేందుకు తాము ఎన్నికలను బహిష్కరించమనే సాకుతో వారంతా సిద్ధంగానే ఉన్నారు. నిజానికి పంచాయతీ ఎన్నికల్లో పార్టీల గుర్తు లేకపోవడంతో మేమే గెలిచామని ప్రెస్ మీట్లో హడావుడి చేసిన బాబు ఇప్పుడు మాత్రం కిక్కురుమనలేని పరిస్థితి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాకాలోనే కాదు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్వగ్రామంలో కూడా దారుణ ఫలితాలు ఎదురయ్యాయి.
ఎన్టీఆర్ స్వగ్రామం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం నిమ్మకూరు ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. ఈ గ్రామాన్ని చంద్రబాబు తనయుడు లోకేష్ దత్తత తీసుకున్నా అక్కడి ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు. ఎన్టీఆర్ భార్య బసవతారకం స్వగ్రామాన్ని అంటే కొమరోలును బాబు సతీమణి భువనశ్వరి దత్తత తీసుకోగా అక్కడ కూడా టీడీపీకి పరాజయం తప్పలేదు. ఇక అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో ఒక్క జెడ్పీటీసీ, మండల పరిషత్‌ను కూడా టీడీపీ సాధించలేకపోగా అక్కడ టీడీపీకి కోటలు అని భావించిన పలు గ్రామాల్లో సైతం వైసీపీ అభ్యర్థులు సునాయాసంగా గెలిచారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం టెక్కలిలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. టెక్కలి జెడ్పీటీసీ స్థానం నుంచి వైసీపీ నేత దువ్వాడ శ్రీను భార్య వాణి విజయం సాధించగా అచ్చెన్న సొంత మండలం కోటబొమ్మాళిలో కూడా వైసీపీనే గెలిచింది. మాజీ మంత్రులు పరిటాల సునీత, జేసీ దివాకర్‌రెడ్డి వారి సొంత నియోజకవర్గాలైన రాప్తాడు, తాడిపత్రిలో మారు మాట్లాడలేని పరిస్థితి.
మాజీ మంత్రి దేవినేని ఉమా సొంత నియోజకవర్గంలో కూడా సేమ్ సీన్. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే విజయనగరం జిల్లాలో సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి పోటీ చేసిన జెడ్పీటీసీ స్థానాన్ని సైతం వైసీపీ సొంతం చేసుకుంది. అలా కీలక నేతల సొంత నియోజకవర్గాలలో కూడా సత్తా చాటలేని పరిస్థితి ఏర్పడితే ఇంకా జిల్లాల మాట ప్రస్తావించడం అనవసరం. టీడీపీ చరిత్రలో ఇంతటి ఘోర పరాభావన్ని మునుపెన్నడూ ఎదుర్కొన్న దాఖలాలు లేవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే టీడీపీ కీలక నేతలు అని భావిస్తున్న వారు సైతం ఏమాత్రం సత్తా చూపలేక పోవడంతో వారిని ఇక కీలక నేతలు అని కూడా సంబోధించడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.
Also Read : మా గెలుపును వారు జీర్ణించుకోలేకపోతున్నారు – సీఎం జగన్