iDreamPost
android-app
ios-app

వైఎస్సార్సీపీ వ్యూహాత్మక దాడి, తల్లడిల్లుతున్న టీడీపీ

  • Published Sep 18, 2020 | 7:09 AM Updated Updated Sep 18, 2020 | 7:09 AM
వైఎస్సార్సీపీ వ్యూహాత్మక దాడి, తల్లడిల్లుతున్న టీడీపీ

వైఎస్సార్సీపీ గేరు మార్చింది. ఏడాదిన్నరగా వేచి చూస్తూ ఇప్పుడు ఎదురుదాడికి పూనుకుంటోంది. న్యాయవ్యవస్థ నుంచి ఎన్ని రకాలుగా ఆటంకాలు ఎదురయినా భరించిన వైఎస్సార్సీపీ ఇప్పుడు పార్లమెంట్ లోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అనేక అంశాలలో విచారణ వద్దని, చివరకు ఎఫ్ ఐ ఆర్ లో వివరాలు కూడా వెల్లడించవద్దని మీడియాని నియంత్రించిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ ముందడుగు వేసింది. అటు లోక్ సభ, ఇటు రాజ్యసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తీర్పులను తప్పుబట్టింది. రాజ్యాంగంలోని అధికరణ 105 ప్రకారం ఉన్న ప్రివిలైజ్ ను ఉపయోగించుకుని తొలుత మిథున్ రెడ్డి, ఆతర్వాత విజయసాయిరెడ్డి వ్యవహరించారు. దానికి అనుగుణంగా సోషల్ మీడియాలో కూడా హైకోర్ట్ న్యాయమూర్తుల భూ పంపకాల వ్యవహారం వైరల్ అవుతోంది.

హైకోర్ట్ న్యాయమూర్తులకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో భూములు కేటాయించడం, వాటిని వెంటనే రిజిస్ట్రేషన్ చేయించిన ప్రక్రియను చంద్రబాబు కూడా అంగీకరించారు. అదే సమయంలో కేవలం న్యాయమూర్తులకు మాత్రమే కాదని, మీడియా ప్రతినిధులకు కూడా కొందరికి భూములు కేటాయించామని ఆయన వెల్లడించడంతో అమరావతి వ్యవహారం మరింత ముదురుతున్నట్టు కనిపిస్తోంది. ఓవైపు ఫైబర్ నెట్, మరోవైపు అమరావతి భూపందేరాలపై సీబీఐ విచారణ కోసం పార్లమెంట్ ఆవరణలో వైఎస్సార్సీపీ ఎంపీలు ధర్నాకు దిగడంతో వైఎస్సార్సీపీ వ్యూహం అర్థమవుతోంది. ఆపార్టీ ఉచ్చులో ఇరుక్కున్న టీడీపీ రాజ్యసభ సాక్షిగా విజయసాయిరెడ్డి ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం, చివరకు కోర్టు తీర్పులపై వ్యాఖ్యలకు సమాధానమివ్వడం గమనిస్తుంటే విపక్ష నేతలు ఉలికిపాటుకి గురయినట్టు అంతా భావిస్తున్నారు.

తాజా పరిణామాలతో ఏపీలో అమరావతి అంశం మరింత వివాదంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. అవినీతి అంశాలు తెరమీదకు రాకుండా మత సంబంధిత అంశాలను ముందుకు తీసుకురావాలన్న టీడీపీ యత్నాలు కూడా ఫలించలేదు. దాంతో ఈ వ్యవహారాలతో తల్లడిల్లిపోతోంది. టీడీపీ అధినేత తీరులో అది స్పష్టమవుతోంది. హైకోర్ట్ న్యాయమూర్తుల విమర్శలకు సమాధానమిస్తూ మీడియా విషయాన్ని వెల్లడించడం గమనిస్తే చంద్రబాబు చాలా ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి అంశంలో హైకోర్ట్ ఆదేశాలతో నిలిచిపోయిన విచారణను వైఎస్సార్సీపీ ప్రభుత్వం విడిచిపెట్టే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే డాక్టర్ రమేష్‌ కేసులో మాదిరిగానే రాజధాని భూముల అంశంలో కూడా విచారణ జరిపించేందుకు అనుగుణంగా ఆదేశాల కోసం సుప్రీంకోర్ట్ ని ఆశ్రయించడానికి సిద్ధపడింది.

చంద్రబాబు, నారా లోకేష్ ఇద్దరికీ నేరుగా చుట్టుకునే అంశాలను ప్రస్తావిస్తున్న తరుణంలో రాజకీయంగా కీలక పరిణామాల దిశగా పరిస్థితులు సాగుతున్నాయి. మరోవైపు సుప్రీంకోర్ట్ జస్టిస్ లు కొందరికీ కూడా అమరావతి అంశంలో భాగస్వామ్యం ఉందనే వ్యవహారం మరింత ముదరడం ఖాయంగా ఉంది. ఇవన్నీ కలిసి చంద్రబాబుని సతమతం చేస్తున్నాయి. టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారుతోంది. వైఎస్సార్సీపీ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో రాబోయే పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారడం అనివార్యం అని చెప్పవచ్చు.