iDreamPost
android-app
ios-app

గొప్ప మానవతా వాది డాక్టర్ వైఎస్సార్

  • Published Jul 08, 2021 | 7:28 AM Updated Updated Jul 08, 2021 | 7:28 AM
గొప్ప మానవతా వాది డాక్టర్ వైఎస్సార్

రాజకీయం అంటేనే ఎత్తులు, పైఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు. అధికారం కోసం ఎలాంటి వ్యూహాలు అయినా రచించాల్సిందే. ఎలాంటి ఎత్తుగడలు అయినా అమలు చేయాల్సిందే. ఓ తల అందలం ఎక్కడం కోసం ఎన్ని తలలు తెగిపడినా పర్లేదు. అదే రాజనీతి.

అయితే ఇలాంటి రాజనీతికి కొందరు భిన్నంగా ఉంటారు. కొందరు ఇతరులను మెట్లుగా చేసుకుని పైపైకి ఎక్కితే, ఇంకొందరు అలా ఎక్కేవారి అండ చూసుకొని పైకి చేరుకుంటారు. ఇక మూడో రకం ఉంటారు. వారు తాము పైకి చేరుతూ, కింద ఉన్నవారిని పైకి చేరుస్తూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఉంటారు. ఈ మూడో రకం వారినే జనం ఆదరిస్తారు. వారికోసమే అభిమానులు ప్రాణాలు ఇస్తారు. ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు.

ఈ కోవకు చెందిన నేతే డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి. తాను ఎక్కిన ప్రతి మెట్టులోనూ తనను నమ్ముకున్న వారిని, తనకు అండగా నిలిచిన వారిని నిలబెట్టిన గొప్ప వ్యక్తిత్వం డాక్టర్ వైఎస్సార్ ది. అందుకే ఆయన చనిపోయి పుష్కర కాలం కావొస్తున్నా ఇంకా ఆయన ప్రజల గుండెల్లో గూడుకట్టుకొని ఉన్నారు. ఇంకో రెండు మూడు పుష్కరాలు అయినా ఆయన స్థానం చెక్కుచెదరదు.

ఆయన ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పధకం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని లక్షల ఇళ్లల్లో దీపాలు ఆరిపోకుండా నిలబెట్టింది. ఆరోగ్యశ్రీలో జరిగిన ఆపరేషన్లు కొన్ని లక్షల మంది ప్రాణాలు నిలబెట్టి పునర్జన్మ ఇచ్చాయి. కార్పొరేట్ ఆస్పత్రి గుమ్మం కూడా ఎక్కలేని లక్షల మంది వేతన జీవులకు మెరుగైన చికిత్స అందించి మళ్ళీ ప్రాణం పోసింది. అందుకే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కోట్లాది మందికి దేవుడయ్యాడు. చాలా ఇళ్ళల్లో ఆయన ఫోటో దేవుడి ఫోటో పక్కనే ఉండి పూజలు అందుకుంటోంది.

Also Read : తిట్టిన నోరే పొగుడుతోంది..!

ఇక డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన రెండో పధకం ఫీజు రీయింబర్సుమెంట్. సాంప్రదాయ డిగ్రీలకు, సాంప్రదాయ కళాశాలలకు డిమాండ్ తగ్గి ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యకు డిమాండ్ పెరిగిన రోజుల్లో, వేలాదిమంది పేద కుటుంబాల విద్యార్థులు ఎటుపోవాలో తెలియని అయోమయ స్థితిలో నాలుగురోడ్ల కూడలిలో కూర్చున్నప్పుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి వారి మార్గం సుగమం చేశారు. అటు డిమాండ్ లేని సాంప్రదాయ డిగ్రీ కళాశాలలకు వెళ్ళలేక, ఇటు డిమాండ్ ఉన్న కార్పొరేట్ కళాశాలల గేటు కూడా దాటలేక ఉన్న స్థితిని ఫీజు రీయింబర్సుమెంట్ పథకంతో అధిగమింపజేశారు. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థల గేట్లు పేద విద్యార్థులకోసం ఒక్కసారిగా బార్లా తెరుచుకున్నాయి.

వేలు, లక్షల మంది రోజుకూలీ కుటుంబాల విద్యార్థులు కార్పొరేట్ సంస్థల్లో అడుగుపెట్టి ఇంజనీరింగ్ పట్టాలు పొందారు. ఏదో ఓ పరిశ్రమలో ఉపాధి పొందుతున్నారు. చాలామంది కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్ వేర్ కంపినీల్లో ఉద్యోగాలు సాధించారు. కొన్ని వేల కుటుంబాల్లో పొయ్యి వెలుగుతోంది. అదంతా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఔదార్యమే. అందుకే అలా లక్షలాది కుటుంబాల్లో వైఎస్సార్ ఆరాధ్యదైవం అయ్యారు.

ఇలాంటి పధకాలు ప్రవేశపెట్టి అమలు చేయడానికి అధికారం ఒక్కటే సరిపోదు. అందుకు విశాలమైన హృదయం ఉండాలి. అది డాక్టర్ రాజశేఖర్ రెడ్డికి పుష్కలంగా ఉంది. అధికారంలో ఉండి వెళ్ళిపోయినవారు చాలామంది ఉన్నారు. అయినా జనం కొందరిని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. గుండెల్లో దాచుకుంటారు. ఆరాధిస్తారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంట్ పధకాలు రెండూ రాజశేఖర్ రెడ్డిని ఆరాధ్యదైవం చేస్తే, ఆయన విశాల హృదయం లెక్కలేనంతమంది అభిమానుల్ని తెచ్చిపెట్టింది.
ఆయనను ఆరాధించే వారు, అభిమానించేవారు ఆయన గుర్తుల్ని చెరిగిపోనివ్వరు. ఆయన స్మృతుల్ని మర్చిపోనివ్వరు. అందుకే నిలువెత్తు రూపంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి నిండుగా నవ్వుతూ పదికాలాలపాటు ప్రజల మనస్సులో నిలిచే ఉంటారు.

Also Read : ఆ గుర్తింపు… వైఎస్ కుటుంబానికే ద‌క్కింది..!