iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ చేయూత పథకం సత్ఫలితాలిస్తోంది. మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇల్లు బాగుంటేనే ఇల్లాలు బాగుంటుంది. అలా ప్రతి ఇల్లు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనేది ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయం. అందుకు అనుగుణంగా ఈ పథకానికి రూపకల్పన చేశారు.
ఎవరు అర్హులు..
45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23,14,342 మంది లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. వీరి ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. వీరికి ఏటా రూ.4,339.39 కోట్ల చొప్పున నాలుగేళ్లకు దాదాపు
రూ.19,000 కోట్లు సాయం ప్రభుత్వం అందించనుంది. ఇప్పటికే ప్రతినెలా సామాజిక పించన్ అందుకుంటున్న 45 నుంచి 60 ఏళ్ల వయస్సు గల 6 లక్షలకు పైగా అర్హులైన వితంతువులు, దివ్యాంగ, ఒంటరి మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడడానికి, పింఛన్ కు అదనంగా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది.
ఏటా రూ.18,750 చొప్పున అందజేత..
ఈ పథకం కింద లబ్ధిదారులకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్ల పాటు మొత్తం రూ.75,000 అందజేస్తారు. ఈ విధంగా ఇప్పటికి రెండేళ్లు ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేసింది. అక్కచెల్లెమ్మల భవితకు భద్రత కల్పించడానికి కరోనా ఇబ్బందుల్లో కూడా ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించింది. ఏటా ఈ సాయం చేయడం వల్ల మహిళల సామాజిక, ఆర్థిక పరిస్థితిలో మార్పు తీసుకురావాలి అనేది సర్కారు సంకల్పం. ఈ చేయూత సాయమే కాక అడిగిన అక్కచెల్లెమ్మలకు కిరాణా షాపులు నిర్వహించుకొనేందుకు, ఆవులు, గేదెలు, మేకలు కొనుగోలు చేసేందుకు బ్యాంకులతో టై అప్ చేసి ఉపాధి మార్గాలు చూపుతోంది. వారి జీవనోపాధి మెరుగు పడడానికి అమూల్, హల్, రిలయన్స్, పీ అండ్ జీ, ఐటీసీ వంటి దిగ్గజ కంపెనీలతో కూడా టై అప్ చేయిస్తోంది. దీనివల్ల రిస్క్ లేకుండా వారు వ్యాపారాలు చేసుకొనేలా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది. ఆ విధంగా నెలకు రూ. 7,000 నుంచి రూ.10,000 అదనపు ఆదాయం పొందేలా మహిళలకు తోడుగా ప్రభుత్వం నిలుస్తోంది. అమూల్ కంపెనీతో భాగస్వామ్యం ద్వారా ఇప్పుడు మార్కెట్లో ఇస్తున్న రేటు కన్నా లీటరు పాలపై రూ.5 నుంచి రూ.10 వరకు అదనపు ఆదాయం అందేలా ప్రభుత్వం కుదిర్చింది.
Also Read : Ap Government – అప్పులు- అభివృద్ధి- అసలు నిజాలు
ఆదాయం పెంచుకున్న మహిళలు..
ఇప్పటి వరకు 78,000 మంది మహిళలు కిరాణా దుకాణాలు, 1,90,517 మంది ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల పెంపకం ద్వారా కుటుంబ ఆదాయాన్ని పెంచుకున్నారు. లబ్ధిదారులను కార్పొరేటు కంపెనీలు, బ్యాంకులతో అనుసంధానం చేసేందుకు వైఎస్సార్ చేయూత కాల్ సెంటర్ 0866-2468899, 9392917899 నంబర్లతో ఏర్పాటు చేశారు. నిరంతరం పర్యవేక్షించి అవసరమైన సహాయం, శిక్షణ అందించేందుకు కమాండ్ కంట్రోల్ సెల్ కూడా ఏర్పాటు చేశారు.
లబ్ధిదారులకు స్వేచ్ఛ..
వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అందిస్తున్న డబ్బును ఉపయోగించుకోవడానికి మహిళలకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఆ సొమ్మును చిన్న, మధ్య తరహా వ్యాపారాలను నడుపుకోవడానికి, మరే ఇతర అవసరాలకు లేదా జీవనోపాధి కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చు. ఆ విషయంలో పూర్తిగా వారికే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చింది.
ప్రభుత్వానికి ధన్యవాదాలు..
తాము ఆర్థికంగా నిలదోక్కుకోవడానికి ఇటువంటి పథకాన్ని రూపొందించి ,పక్కగా అమలు చేస్తున్న ప్రభుత్వానికి మహిళలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. దీనికితోడు తమ కుటుంబ ఉపాధి అవకాశాలు మెరుగు పరచడానికి అడుగడుగునా తోడుగా నిలుస్తున్న వైఎస్సార్ సీపీ సర్కారు చిత్తశుద్ధిని మెచ్చుకుంటున్నారు.
Also Read : Southern Council Amit Sha -దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం, జగన్ ఎజెండా ఇదే