iDreamPost
iDreamPost
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించిన దివంగంత నేత వైయస్ రాజశేఖర రెడ్డి పాలనా హయాంలో ప్రవేశ పెట్టిన పేదలకు ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకం తెలుగురాష్ట్రాల ప్రజలకు వరప్రదాయనిగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కోట్లాది మంది ప్రజల ప్రణాలను కాపాడిన ఈ పథకం దేశంలోనే ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలించిందని జాతీయ శాంపిల్స్ సర్వేలో తేలింది.
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో తప్పించి దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో కూడా ఉచిత బీమా పథకం ద్వారా లబ్దిపొందిన వారి సంఖ్య అత్యంత స్వల్పం అని తేలింది. దేశంలో 85.9 శాతం మంది గ్రామీణులకు ఎలాంటి బీమా వర్తించడంలేదని కానీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణులలో మాత్రం 76.1 శాతం అలాగే తెలంగాణ ప్రాంత గ్రామీణులలో 70.3 శాతం మందికి ఈ బీమా ద్వారా లబ్ది పొందుతున్నారని, ఇక పట్టణ ప్రాంతంలో చూసుకున్నా దేశంలో 80.9 శాతం మందికి ఉచిత బీమా పథకం లేదని , కానీ ఆంధ్రప్రదేశ్ లో పట్టణ ప్రాంత ప్రజలు 55.9 శాతం మంది, తెలంగాణ పట్టణ ప్రాంత ప్రజలు 37.3 శాతం మంది ఈ భీమా ద్వారా లబ్ది పొందుతున్నారని ఈ సర్వేలో వెల్లడైంది.
దివంగత నేత వైయస్సార్ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రజలు ఉపయోగించుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంత ప్రజల వైద్యం కోసం ఖర్చుపెట్టే వ్యక్తిగత ఖర్చు గణనీయంగా తగ్గిందని ప్రభుత్వాలే ఉచితంగా బీమా కల్పించి వైద్యం అందించడం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా నిలబడగలిగాయని దేశంలోని ఇతర రాష్ట్ర ప్రజలు వైద్యానికి అధికశాతంలో సొంత ఖర్చులు పెట్టడం వలన ఆర్ధికంగా చితికిపొయాయని తెలుగురాష్ట్రాల్లో మాత్రం ఆరోగ్యశ్రీ ఉండటం మూలానా పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయని తేల్చి చెప్పింది.
ఇదిలా ఉంటే ఈ సర్వే నిర్వహించిన నాటి తదనంతరం ఆరోగ్యశ్రీ పథకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరిపిన మార్పుల వలన రాష్ట్రంలో లబ్ది దారుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. గతంలో ప్రభుత్వం కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తించేలా చేసిన.. జగన్ ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుతో సంబంధం లేకుండా 5లక్షల లోపు వార్షిక ఆదాయం లేని ప్రతి ఒక్కరికి ఈ పథకం కింద లబ్దిదారులుగా ఎంపిక చేయడం, అలాగే జబ్బుల సంఖ్య 1059 నుండి 2వేలకు పెంచడం, బిల్లు వేయి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేలా చేయడంతో రాష్ట్రంలో 95% మంది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చారు. దీంతో సర్వే అనంతరం జరిగిన ఈ మార్పులతో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరగనున్నట్టు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దివంగత నేత వైయస్సార్ ప్రవేశ పెట్టిన ఈ పథకం దేశంలో అమలవుతున్న ఇతర పథకాలను వెనక్కు నెట్టి దేశానికే రోల్ మోడల్ గా నిలవడం వైయస్ దార్శనికతకు నిదర్శనంగా చెప్పవచ్చు .