నేను ట్రెండ్ ఫాలో కాను.. సెట్ చేస్తా.. ట్రెండ్ సెట్టర్.. ఇలాంటి డైలాగ్‌లు తరచూ సినిమాల్లో వింటుంటాం. హీరో పాత్ర పోషించే నటులు ఇలాంటి డైలాగ్‌లు చెబుతుంటారు. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా వస్తుంది. సినిమా.. థియేటర్ వరకే. అలాంటి డైలాగ్‌లు ప్రజాజీవితంలో నేతలు ఆచరణలో పెట్టడం, అదీ ప్రజలకు ఉపయోగపడేలా పని చేయడమనేది అతి కొద్ది మందికే సాధ్యం. ప్రజా సంక్షేమం కోసం వారు వేసిన బాటను.. తర్వాత తరాలు వారు కూడా పాటించేలా ఉంటుంది. తెలుగు రాజకీయాల్లో ఈ తరం వారికి కూడా గుర్తుండిపోయేలా పాలన సాగించిన నేతలు అతి కొద్దిమందే ఉన్నారు. వారు ప్రవేశపెట్టిన పథకాలు, తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు ఇప్పటికీ అమలులో ఉండడం విశేషం.
పండగ పూట వరి అన్నం తినే రోజుల్లో.. జనాభాలో దాదాపు 95 శాతం ఉన్న పేద ప్రజలకు రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. దాదాపు నాలుగు దశాబ్దాలు గడుస్తున్నా.. ఆ పథకం కొనసాగుతూనే ఉంది. ఎన్టీ రామారావు తర్వాత పలు పార్టీల, పలువురు ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చినా.. ఆ పథకాన్ని కొనసాగించేలా ఆ పథకానికి ఎన్టీఆర్ బాటలు వేశారు.
ఎన్టీఆర్ తర్వాత.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేక పథకాలకు, విధానపరమైన నిర్ణయాలకు రాచబాట వేశారు. ఆయన తర్వాత కూడా వివిధ పార్టీల ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు వాటిని కొనసాగించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పేద, మధ్యతరగతి పిల్లలకు ఉన్నత చదువులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్, పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పథకాలు, 108.. ఆయా పథకాల పేర్లు మారినా.. నేటికి కొనసాగుతూనే ఉన్నాయి.
Also Read : ఏపీ రైతులకు ఆ సమస్యలేదు.. భారీగా సాగు లక్ష్యం
ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల తర్వాత.. మళ్లీ ఓ ముఖ్యమంత్రి ఓ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. గత ప్రభుత్వాలలో.. సంక్షేమ పథకాల అమలు అంటే.. అదో పెద్ద లోపభూయిష్టం. పైగా తమ పార్టీ వారికే పథకాలు అనే మాదిరిగా వాటిని అమలు చేసేవారు. అర్హత అనే మాటే వినిపించదు. ఎలాంటి సాకు చూపి పథకం వర్తించకుండా చేద్దామా..? అనే ఆలోచనలు కొన్ని ప్రభుత్వాలు చేశాయి. ఈ పరిస్థితిని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమూలంగా మార్చివేస్తున్నారు. అర్హతే ఆధారంగా పథకాలు ఇస్తున్నారు. అర్హత ఉండీ.. తగిన పత్రాలు సరైన సమయంలో సిద్ధం చేసుకోలేకపోయినా, ఇతర సాంకేతిక కారణాల వల్ల లబ్ధి పొందలేకపోయినా.. అలాంటి వారికి మళ్లీ అవకాశం ఇస్తున్నారు. పథకం ప్రారంభమైన తర్వాత కూడా నెల రోజుల పాటు సమయం ఇస్తూ.. దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
ఇలా ప్రతి ఒక్క పథకానికి అవకాశం ఇస్తున్నారు. ఏడాదిలో రెండు సార్లు.. జూన్, డిసెంబర్లలో ఆయా పథకాలకు అర్హత ఉండి లబ్ధిపొందలేని వారికి మళ్లీ ఆ లబ్ధిని అందజేస్తున్నారు. అలాంటి వారికి ఈ రోజు వివిధ సంక్షేమ పథకాల ద్వారా 703 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. నగదు బదిలీ పథకాలే కాదు రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. భవిష్యత్ ప్రభుత్వాలు కూడా ఈ తరహాలో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేలా ఓ ట్రెండ్‌ను జగన్ సెట్ చేస్తున్నారు. ప్రజల మేలు కోసం జగన్ వేస్తున్న బాటను.. భవిష్యత్ ప్రభుత్వాలు కూడా తప్పక ఆచరించాల్సిన పరిస్థితి.
Also Read : అర్హులకు నేడు సంక్షేమ లబ్ధి.. నేరుగా రూ. 703 కోట్లు జమ