ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ యేడాది డిసెంబర్ నెలనుండి రాష్ట్రంలో పర్యటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాను బాధ్యతలు చేపట్టిన రెండున్నర్ర సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి రాష్ట్ర పర్యటనకు సిద్ధం అయ్యారు.
2019 జూన్ 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికి ఓ అరడజను సార్లు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో పర్యటనలు చేశారు. అయితే 2020 మార్చి నుండి కోవిడ్ దెబ్బకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ముఖ్యమంత్రి కూడా తాడేపల్లి లోని తన క్యాంపు కార్యాలయానికే పరిమితం అయ్యారు. కోవిడ్ ప్రభావం కొంతమేర తగ్గిన తర్వాత లాక్ డౌన్ తొలగించిన తర్వాత గుంటూరు, కృష్ణా, కర్నూల్, కడప, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం తదితర జిల్లాల్లో పరిమిత పర్యటనలు చేశారు.
రాష్ట్రంలో కోవిడ్ టీకాలు అధిక సంఖ్యలో వేసిన ప్రస్తుత తరుణంలో డిసెంబర్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు జగన్మోహన్ రెడ్డి సంసిద్ధం అయ్యారు. డిసెంబర్ నుండి గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీ పేరుతో జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఉండబోతున్నాయి.
ఈమేరకు ఆయనే బుధవారంనాడు జిల్లా కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారు. అయితే తాను సందర్శించే ముందే సదరు సచివాలయాలను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు సందర్శించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే అక్టోబర్ నుండి రాష్ట్రంలోని శాసనసభ్యులు కూడా సచివాలయాలను సందర్శించాలని, సచివాలయంలో సిబ్బంది పనితీరు మెరుగుపర్చాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తన పర్యటనలోపే సచివాలయ వ్యవస్థ పటిష్టంగా పనిచేయడం మొదలుపెట్టాలని జగన్మోహన్ రెడ్డి కోరారు.
Also Read : కొడాలి మీదికి వంగవీటి అస్త్రం – బాబు మార్క్ వాడకం:
ఎక్కడా అవినీతిని, పక్షపాతాన్ని తాను సహించబోనని, ప్రభుత్వం అమలుచేసే ప్రతి పథకం అర్హులైన లబ్దిదారులకు అందాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. “సచివాలయాలు అవినీతిరహిత, పక్షపాతరహిత కేంద్రాలు”గా పనిచేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ క్రమంలో అవసరమైతే సంబంధిత అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా తాను వెనుకాడబోమని ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేశారు.
పరిపాలనలో సచివాలయ వ్యవస్థ ఒక విప్లవాత్మక నిర్ణయం అని అంగీకరించక తప్పదు. జిల్లా, మండల స్థాయి పరిపాలన ఇప్పుడు సచివాలయ వ్యవస్థ కారణంగా గ్రామాల్లోకి వచ్చింది. ప్రజలు తమకు అవసరమైన ఏ పనికోసం అల్లంత దూరాన ఉండే మండల కేంద్రానికో, జిల్లా కేంద్రానికో వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ అధికారుల ప్రాపకం కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. తమ గ్రామంలోనే సచివాలయంలో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సేవలూ అందుబాటులోకి వచ్చాయి.
పెన్షన్, ఇళ్ళ స్థలాలు, వివిధ రకాల సర్టిఫికెట్లు, భూములు, పంటలకు సంబంధించిన వ్యవహారాలు అన్ని గ్రామంలోని సచివాలయంలోనే అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ సేవలు అందించడంలో అధికారులు, సిబ్బంది ఎలాంటి అవకతవకలకు పాల్పడినా, అవినీతికి పాల్పడినా, పక్షపాతం చూపించినా గట్టి చర్యలు తీసుకోనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామం.
Also Read : వయసైపోతోంది నాయకా..!
సచివాలయ వ్యవస్థ ఫలాలను ప్రజలు ఇప్పటికే అనుభవిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు, పధకాలు ఈ సచివాలయాల ద్వారా అందుతున్నాయనడంలో సందేహం లేదు. ప్రతి వ్యక్తి తనకు కావలసిన సేవలు, పథకాలకోసం సచివాలయంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సదరు దరఖాస్తును అధికారులు నిర్ణీత కాలంలో పరిశీలించి దరఖాస్తుదారునికి సమాచారం అందించాల్సి ఉంది. ఈ సేవలు కాస్త అటూ ఇటుగా జరుగుతూనే ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి ఈ సేవలను మరింత పటిష్టంగా జరిపేందుకు చర్యలు తీసుకోవడం అందుకోసం తానే స్వయంగా సచివాలయాలను సందర్శించాలని నిర్ణయించడం స్వాగతించాల్సిన అంశం.
ముఖ్యమంత్రి గ్రామాల సందర్శన కార్యక్రమం ఓ మంచి పరిణామం. ఇలాంటి పర్యటనల్లో ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో మాట్లాడే అవకాశం వస్తుంది. అధికారులో, పార్టీ ప్రతినిధులో చెప్పే విషయాలు, ఇచ్చే ఫీడ్ బ్యాక్ పై ఆధారపడకుండా క్షేత్ర స్థాయిలో ముఖ్యమంత్రి పర్యటించి నేరుగా ప్రజలనుండి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం మంచిపరిణామమే. గతంలో దివంగత రాజశేఖర్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలే నిర్వహించారు. రచ్చబండ పేరుతో ఆయన గ్రామాలు సందర్శించేవారు. అక్కడ నేరుగా ప్రజలతో మాట్లాడేవారు. ఫిర్యాదులు స్వీకరించే వారు. అలాగే సమస్యలు ఏవైనా ఉంటే అక్కడే పరిష్కారం చేసేవారు. తన పాలన పట్ల, అధికారులు, ప్రజాప్రతినిధుల పనితీరుపట్ల నేరుగా ప్రజలనుండి అభిప్రాయాలు తీసుకునేవారు.
ఇలాంటి కార్యక్రమమే జన్మభూమి పేరుతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్వహించినా అక్కడ జన్మభూమి కమిటీ సభ్యులే సర్వం తామే అయి ప్రజాభిప్రాయం ప్రతిబింభించకుండా జాగ్రత్తలు పడేవారు. అందువల్లే అధికారులు కాగితాలపై కాకిలెక్కలు వేసి ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో 98 శాతం సంతృప్తి, 99 శాతం సంతృప్తి అంటూ ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చేవారు. రెండున్నరేళ్ళ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తున్న పర్యటన ఇలా కాకిలెక్కలతో కాకుండా వాస్తవాలు తెలుసుకునేందుకు ఉపయోగ పడుతుందని, తద్వారా పాలన మెరుగవుతుందని ఆశిద్దాం.
Also Read : ఇక జనాల్లోకి జగన్.. ఏం జరగనుందో వేచి చూడాల్సిందే..!