మీ పిల్లాడిని కిడ్నాప్ చేసాం, మూడు లక్షలు ఇవ్వకుంటే మీ బాబు మీకు దక్కడు అన్న వార్నింగ్ ఫోన్ లో వినగానే కుప్పకూలి పోయాడు ఆ పిల్లవాడి తండ్రి. పోలీసులకు చెప్తే తన బాబుని కిడ్నాపర్లు ఏం చేస్తారో అని తండ్రి హృదయం తల్లడిల్లి పోయింది. కానీ ఆ కిడ్నాపర్ మళ్ళీ ఫోన్ చేసి, 2 లక్షల డబ్బు క్యాష్ గా మిగిలిన ‘లక్షా’ చెక్ గా ఇస్తే మీ బాబుని వదిలేస్తాను అని గంభీరంగా చెప్పాడు. ఆ కిడ్నాపర్ తో బేరసారాలు సాగిస్తూనే, పోలీసులకు పిర్యాదు చేసాడు ఆ తండ్రి. ఫోన్ కాల్స్ సిగ్నల్స్ ని బట్టి కిడ్నాపర్ ఎక్కడ ఉన్నాడో గుర్తించారు పోలీసులు. ఆ ప్రదేశానికి పోలీసులను పంపి కిడ్నాపర్ చెర నుండి ఏడేళ్ల బాబుని విడిపించారు పోలీసులు. కానీ అక్కడ కిడ్నాపర్ ని చూసి పోలీసులు ఆశ్చర్య పోయారు. ఎందుకంటే ఆ కిడ్నాప్ చేసింది 10 వ తరగతి చదివే 14 ఏళ్ళ బాలుడు. ఇంత చిన్నవయసులో కిడ్నాప్ చేసి డబ్బులు అడగడం పోలీసులకే కాదు సామాన్య ప్రజలకు కూడా ఆశ్చర్యం కలిగించే విషయమే. యూట్యూబ్ మరియు సినిమాల ప్రభావంతో ఆ కిడ్నాప్ ప్లాన్ చేసానని ఆ బాలుడు చెప్పుకొచ్చాడు. నిజానికి పిల్లల్లో పెరుగుతున్న నేరాలకు, నేర స్వభావానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే.
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ యువశక్తి ఉన్న దేశం భారతదేశం. ప్రపంచంలో అన్ని సర్వేల్లో తెలిసిన నిజం ఇది. కానీ యువ శక్తి కానీ యువత కానీ దేశ ప్రగతిలో పాలు పంచుకుంటున్నారా అని విశ్లేషిస్తే లేదనే సమాధానం వస్తుంది. విదేశాల్లో ఎక్కువగా టీనేజ్ దాటిన తర్వాత సొంతంగా సంపాదించడం మొదలు పెడతారు. కానీ భారతదేశంలో ఎక్కువ శాతం యువత పూర్తిగా తల్లిదండ్రులపై ఆధారపడుతూ ఏ పనీ చేయకుండా జల్సాలకు అలవాటు పడుతూ ఆ జల్సాల కోసం నేరాల బాట పడుతున్నారు. దేశ భవిష్యత్తు అయిన యువతరం మత్తులో జోగుతుంది. మద్యపానం,ధూమపానం, డ్రగ్స్, రేసింగ్ పబ్ లో మునిగితేలుతూ యువతరం చిత్తవవుతుంది. మత్తులో విచక్షణ కోల్పోయి నేరాలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు.
హైదరాబాద్ శివార్లో జరిగిన దిశ హత్యాచారం కేసులో ఉన్న నలుగురు నిందితుల్లో ముగ్గురి వయసు 20 ఏళ్ల లోపే ఉండటం యువకుల్లో పెరుగుతున్న నేర స్వభాన్ని ఎత్తి చూపిస్తుంది. మద్యం మత్తులో సోయ లేకుండా ఉన్నామని ఆ సమయంలో ఏం చేస్తున్నామో తెలియదని దిశ హత్యాచార నిందితులు చెప్పడం గమనిస్తే మత్తు వల్ల జరిగే అనర్ధాలు ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. అత్యంత పాశవికంగా జరిగిన నిర్భయ అత్యాచార ఘటనలో కూడా మైనర్ ఉండటం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. చిరుప్రాయంలోనే హృదయాలను కలుషితం చేసుకున్న ఎందరో చిన్నారులు నేరాల్లో పాలుపంచుకుని జువైనల్ హోమ్ కి వెళ్తున్నారు.
చిన్నపిల్లల్లో నేరాలను పెంపొందించే పరిస్థితులను వారి చుట్టూ ఉన్న సమాజమే పెంచుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పిల్లల్లో నేరాలు చేసే గుణం దేశంలో పెరిగింది. ఇంతకుముందు తల్లిదండ్రుల మధ్య ఉన్న గొడవల వల్ల నిర్లక్ష్యం చేయబడిన పిల్లలు, అంగవైకల్యం వల్ల తోటివారితో గేలిచేయబడిన పిల్లలు, తల్లిదండ్రులు లేక అనాధలుగా మిగిలిన పిల్లల్లో నేరం చేసే స్వభావం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ మరియు సినిమాల పుణ్యమా అని పిల్లల్లో నేర స్వభావం అమాంతం పెరిగింది. తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడపలేనంతగా బిజీగా ఉండి పిల్లలకోసం సమయం ఇవ్వకుండా వారికి మొబైల్స్ ఇవ్వడం వల్ల కూడా పిల్లల మనస్తత్వం నేరాల బాట వైపు అడుగులు వేసేందుకు నాంది పలుకుతుంది. పిల్లలు మొబైల్స్ లో ఏం చూస్తున్నారో, ఏం చేస్తున్నారో తెలుసుకోలేనంటు బిజీగా తల్లిదండ్రులు ఉండటం వల్ల కూడా పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతుంది.
ఈనాటి సినిమాలు మితిమీరిన హింస మరియు శృంగారాన్ని చూపిస్తుంటే వాటిని చుసిన చిన్న పిల్లలు కూడా ప్రభావితం అవుతున్నారు. దీనికి ఉదాహరణగా 1997 నుండి డీడీ 1లో ప్రసారమయిన “శక్తిమాన్” అనే టీవీ షో గురించి చెప్పుకోవచ్చు. ఆ షో ప్రభావంతో ఎత్తైన ప్రదేశాల నుండి దూకితే శక్తిమాన్ వచ్చి తమని కాపాడతాడు అని బిల్డింగ్ పైనుండి దూకి చనిపోయిన పిల్లల్ని చెప్పుకోవచ్చు. టీవిలో వచ్చే ప్రకటనలు నిజమనుకునే పిల్లలు ఎంతోమంది ఉంటారు. మొబైల్ గేమ్స్ కూడా మితిమీరిన హింసను చూపిస్తూ పిల్లల్లో ఉండే సున్నితత్త్వాన్ని తగ్గిస్తున్నాయి. ముఖ్యంగా గేమ్ లో ఎదుటి వ్యక్తుల్ని చంపడం కోసమే ఆడే “పబ్జి”, “మోడర్న్ కంబాట్”లాంటి ఆటలైతే పిల్లల్లో మరింత ప్రభావాన్ని చూపిస్తాయి అనడంలో సందేహం లేదు. మొబైల్ ద్వారా పిల్లలు దారి తప్పుతున్నారనేది అందరు అంగీకరించాల్సిన నిజం. పబ్జి ఆట కోసం తండ్రికి తెలియకుండా డబ్బులు డ్రా చేసిన వైనం, తల్లి నగ్న వీడియోలు తీసి పోర్న్ సైట్స్ లో పెట్టిన ఉదంతాలు మొబైల్స్ ద్వారా పిల్లల మనసులు ఎంతగా చెడిపోతున్నాయో తెలియజేస్తాయి.
2014 వరకు ఉన్న గణాంకాలు పరిశీలిస్తే 2005 లో 18,939 మంది బాల నేరస్తులు ఉండగా, 2014 లో 33,526 మందికి పెరిగారు. వీరిలో ప్రాథమిక మరియు సెకండరీ విద్య పూర్తి చేసిన వారి సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. అల్పాదాయ కుటుంబాలనుండి బాల నేరస్తుల సంఖ్య చాలా ఎక్కువుగా ఉండటం గమనించవచ్చు. వీరిలో నిరక్ష్యరాసుల సంఖ్యా 21.8%గా ఉంటె ప్రాథమిక విద్య పూర్తి చేసిన బాల నేరస్తుల సంఖ్య 31.1% ఉంది. సెకండరీ విద్యను పూర్తి చేసిన బాల నేరస్తులు అత్యంత ఎక్కువగా 36.6% ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ గణాంకాల ఆధారంగా టీనేజ్ పిల్లలలో నేర స్వభావం పెరిగిందని అంచనా వేయొచ్చు. తొలిసారి నేరాన్ని చేసిన వారే కాకుండా మళ్ళీ మళ్ళీ నేరాలు చేస్తున్న బాలలు కూడా ఉండటం బాధాకరమైన విషయం. నిరక్షరాస్యత, తల్లిదండ్రులు సరిగా పట్టించుకోక పోవడం,మోరల్ ఎథిక్స్ పిల్లలకి నేర్పకపోవడం,చుట్టూ ఉన్న సమాజ పరిస్థితుల వల్ల వారి హృదయాలు కఠినంగా మారుతున్నాయి.
ఇంకా లోతుగా విశ్లేషణ చేస్తే నిర్భయ ఉదంతంలో పాల్గొన్న మైనర్ కి 18 సంవత్సరాలకంటే మూడు నెలలు తక్కువగా ఉన్నాయని, మనకు ఉన్న చట్టం ప్రకారం అతనికి మూడేళ్ళ కంటే ఎక్కువ శిక్ష వేయలేమని కోర్ట్ అభిప్రాయపడింది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. అందులో భాగంగా హేయమైన నేరాలకు పాల్పడే మైనర్ల వయసు 16 సంవత్సరాలు ఉంటె వారికీ కఠిన శిక్షలు విధించవచ్చు అని జువెనైల్ 2015 ఆక్ట్ ద్వారా కొత్త చట్టం చేసారు. అలా కఠిన చట్టం చేసినా కూడా తర్వాత కూడా నేరాలు చేసే బాలలు ఇంకా పెరుగుతూనే వచ్చారు. మరీ ముఖ్యంగా పిల్లల్లో ఆర్ధిక నేరాలతో పాటుగా లైంగిక నేరాలు మరింత ఎక్కువగా పెరగడం ఆలోచించాల్సిన విషయం.ఆర్ధిక నేరాల మాటేమో కానీ లైంగిక నేరాల వల్ల కొందరి జీవితాలు ప్రమాదంలో పడతాయి. ఈ నేరాలను అరికట్టాల్సిన బాధ్యత పోలీసులకు మాత్రమే కాదు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పైన కూడా ఉంది.
తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడపడానికి వారితో మనసు విప్పి మాట్లాడటానికి కొంత కేటాయించాలి. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ & సినిమాల ప్రభావం తమ పిల్లలపై పడకుండా జాగ్రత్త పడాలి. వయసులో వచ్చే హార్మోన్ల మార్పుల గురించి పిల్లలతో చెప్పాలి. ముఖ్యంగా సమాజంలో నెలకొని ఉన్న పరిస్థితులను పిల్లలకు వివరించాలి. ఏది మంచి ఏది చెడు అనేది చిన్న వయసునుండే పిల్లల మనసులో ముద్ర పడేలా పెంచాలి. తమతో అన్ని విషయాలు మనసు విప్పి చెప్పేంత చనువు పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వాలి. దానిద్వారా పిల్లల్లో ట్రిగ్గర్ అవ్వబోయె నేర స్వభావాన్ని ఆపే అవకాశం కొంతైనా ఉంది. ప్రభుత్వాలు కూడా అనాధ పిల్లలకు, వీధి బాలలకు వృత్తి విద్యల్లో శిక్షణ ఇప్పించి వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలి. మనిషిలో నేర స్వభావాన్ని ప్రేరేపించేది ఆకలి మరియు జల్సాలు మాత్రమే. కాబట్టి యువతకు క్రమశిక్షణ మోరల్ ఎథిక్స్ గురించిన క్లాసులను ప్రభుత్వాలు తరగతి గదుల్లో నిర్వహించాలి.యువతని సరైన దిశలో నడిపితే వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తే దేశాన్ని అభివృద్ధి పథంలో యువతే నడుపుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.