iDreamPost
android-app
ios-app

యంగ్ టాలెంట్ అటు వెళ్తోంది

  • Published Dec 22, 2020 | 9:55 AM Updated Updated Dec 22, 2020 | 9:55 AM
యంగ్ టాలెంట్ అటు వెళ్తోంది

తాము చెప్పిన కథలు ఇక్కడ త్వరగా ఓకే చేయరనే కారణమో లేక అక్కడ భారీ పారితోషికాలతో కూడిన ప్యాకేజీలు ఆఫర్లుగా రావడమో తెలియదు కానీ టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్లు ఎక్కువగా బాలీవుడ్ వైపు చూడటం కొత్త పరిణామం. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా రన్వీర్ కపూర్ తో ఓ సినిమా చేయొచ్చనే టాక్ బలంగా ఉండగా తాజాగా సాహో ఫేమ్ సుజిత్ కూడా ఇలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నట్టు లేటెస్ట్ అప్ డేట్. విక్కీ కౌశల్ హీరోగా ఇటీవలే ఒక లైన్ వినిపించగా అతను సానుకూలంగా స్పందించాడట. ఏదైనా పెద్ద ప్రొడక్షన్ హౌస్ దొరికితే త్వరలోనే స్టార్ట్ చేయొచ్చని తెలుస్తోంది. లూసిఫర్ రీమేక్ చేజారాక సుజిత్ తీసుకున్న నిర్ణయం కాబోలు.

గత ఏడాది నానికి జెర్సితో ఎమోషనల్ హిట్ ఇచ్చిన గౌతమ్ తిన్ననూరి దాని రీమేక్ షాహిద్ కపూర్ తో ఇటీవలే పూర్తి చేశాడు. రామ్ చరణ్ తో ఓ ప్రాజెక్ట్ గట్టిగానే ట్రై చేసినప్పటికీ అది వర్క్ అవుట్ కాకపోవడంతో ఇలా వెళ్లినట్టు వినికిడి. ఇది నిర్మించింది దిల్ రాజు, అల్లు అరవింద్ లే అయినప్పటికీ గౌతమ్ నే లాక్ చేసుకోవడం గమనార్హం. ఇప్పుడు ఇతను తెలుగులో తర్వాత చేయబోయే స్ట్రెయిట్ మూవీ ఏదో క్లారిటీ లేదు. హిట్ దర్శకుడు శైలేష్ కొలను దాని హిందీ వెర్షన్ ని రాజ్ కుమార్ రావు లేదా ఆయుష్మాన్ ఖురానాతో తీసే ప్లానింగ్ లో ఉన్నట్టు ఇప్పటికే న్యూస్ వచ్చింది. త్వరలో అఫీషియల్ అయినా ఆశ్చర్యం లేదు. ఇతను హిట్ సీక్వెల్ పనుల్లో కూడా ఉన్నాడు.

ఇలా మన దగ్గర ఋజువు చేసుకున్న కొత్త టాలెంట్ అంతా అక్కడికి వెళ్ళిపోతే ఎలా అని ఫీలవుతున్న మూవీస్ లవర్స్ లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా కొత్త ట్రెండ్ లో వెళ్తోంది. వినూత్న ఆలోచనలతో కమర్షియల్ సూత్రాలకు కట్టుబడకుండా ప్రయోగాలతో మెప్పిస్తున్నారు. వీలైనంత వేగంగా వీళ్ళు సినిమాలు తీస్తూ ఉంటే పరిశ్రమకు కూడా మంచిది. ఎలాగూ సీనియర్లు ఇప్పటి జెనెరేషన్ టేస్ట్ కి అప్ డేట్ కాలేకపోతున్నారు. ఈ యువరక్తమేమో గుర్తింపు కోసం ముంబైకు వెళ్తోంది. ఇక్కడే అవకాశాలను సృష్టించుకుని రాబోయే దర్శకులకు దారి చూపించాల్సిన బాధ్యత వీళ్ళ మీదే ఉంది మరి.