మొదటి, రెండు దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షలకు కాస్త ఊపిరి తీసుకోవడానికి అవకాశం ఇచ్చిన అధికార పార్టీ మూడో దశలో ఆ అవకాశం కూడా లేకుండా విజయదుందుభి మోగించింది. గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో దశ లోను అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులు అన్ని చోట్ల భారీ విజయాలను నమోదు చేసుకున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ 90 శాతం పైగానే వైసీపీ మద్దతుదారులు గ్రామపంచాయతీ లో పాగా వేశారు. ఏకగ్రీవం అయిన పంచాయతీ లతో కలుపుకుంటే అధికార పార్టీ గత రెండు ఫేస్ ల కంటే ఈ ఫేస్ లో ఇంకా మెరుగైన స్థితిలో ఉన్నట్లు అర్ధం అవుతోంది.
భారీ మెజారిటీ లు
మూడో దశలో అధికార పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు ప్రత్యర్థులపై భారీ మెజారిటీ సాధించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గత రెండు దశల కంటే మూడో దశలో మెజారిటీలు శాతం పెరిగింది. ప్రతిపక్షాలు బలపరిచిన అభ్యర్థులు గెలుపొందిన చోట నమోదు అయిన మెజారిటీ కంటే వైసిపి మద్దతుదారులు గ్రామపంచాయతీ లో గెలుపొందిన చోట్ల వచ్చిన మెజారిటీ చాలా ఎక్కువగా కనిపిస్తోంది.
మొత్తంగా మూడో దశలో 3221 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా , వాటిలో 579 చోట్ల ఏకగ్రీవాలు అయ్యాయి . దింతో 2639 పంచాయతీల్లో ఎన్నికలు జరగాయి. విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు పంచాయతీలో కొన్ని కారణాల రీత్యా ఎన్నికలు వాయిదా పడ్డాయి. 19553 వార్డ్ మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దీనిలో అధికార వైసిపి ఏకగ్రీవాలతో కలిపి 2, 442 చోట్ల తమ మద్దతుదారులను సర్పంచులుగా గెలిపించుకుంటే, ప్రతిపక్ష టీడీపీ మాత్రం 501 చోట్ల, ఇతరులు 145 స్థానాల్లో గ్రామ మొదటి పౌరులుగా ఎన్నికయ్యారు. అయితే ఇంకా కొన్ని చోట్ల కౌంటింగ్ విషయంలో జాప్యం జరగడంతో 130 చోట్ల నుంచి పూర్తిస్థాయి ఫలితాలు అందలేదు. ఇవి కూడా పూర్తయి లెక్క బయటకు వస్తే వైసిపి కు మరింత బలం పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద 90 శాతం మేర స్పష్టంగా వైసిపి ఆధిపత్యం మూడు దశల కనిపించింది.
దాదాపు అన్ని జిల్లాల్లో…
రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ అధికార పార్టీ దూసుకెళ్లింది. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మంచి ఫలితాలు రావడం ప్రభుత్వానికి బూస్ట్ ఇచ్చినట్లే. సీఎం సొంత జిల్లా కడపలో వైసీపీ 159 చోట్ల, టిడిపి 23 చోట్ల గెలుపొందితే, గుంటూరు జిల్లాలో 130 పంచాయతీలను అధికార పార్టీ కైవసం చేసుకుంటే, కేవలం మూడు పంచాయతీల్లో మాత్రమే టిడిపి గెలవడం విశేషం. తెలుగుదేశం పార్టీ కు దగ్గరగా ఉంటారని పేరు ఉన్న సామాజిక వర్గం అధికంగా ఉన్న పంచాయతీలను వైసీపీ మద్దతు దారులు గెలుచుకో రావడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
రాయలసీమ జిల్లాలైన కర్నూలు అనంతపురం చిత్తూరు లోనూ వైఎస్ఆర్సిపి హవా స్పష్టంగా కనిపించింది. మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో నూ టీడీపీ జాడ కనిపించకపోవడం విశేషం. ఇక్కడ మొత్తం 89 పంచాయతీల్లో వైసీపీ 74 చోట్ల, టీడీపీ 14 చోట్ల, ఒక పంచాయితీ ను కాంగ్రెస్ మద్దతుదారుడు గెలుచుకోవడం చంద్రబాబు కోటరికి షాక్ తగిలినట్లు చేసింది. మొదటి, రెండో దశ ఫలితాలు కంటే మూడో దశలో వైసీపీ మరింత పుంజుకుని… కనీసం అవకాశం చిక్కకుండా ప్రభజనం నమోదు చేయడంతో అధికార పార్టీ నేతల్లో, కార్యాకర్తల్లో సంతోషాన్ని నింపుతుంది. ఇదే ఊపుతో మున్సిపల్ ఎన్నికలకు సైతం సమాయత్తం అయ్యేందుకు అప్పుడే పట్టణాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టిసారించారు.
సంక్షేమ పథకాల ఉత్సాహంతో ఓటేసి!
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నమోదవుతున్న ఓటింగ్ శాతం అద్భుతంగా ఉంది. దాదాపు ప్రతి జిల్లాలోనూ గ్రామీణులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా గతంలో ఎన్నడూ లేనంతగా అమలవడం తో పాటు, జగన్ పాలన మీద నమ్మకం గ్రామీణ ఓటర్లలో కనిపిస్తోంది. ఏ జిల్లాలోనూ 80శాతం కు తగ్గకుండా ఓటింగ్ నమోదవడం విశేషం. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 87 శాతం, విశాఖపట్నం జిల్లాలో అత్యల్పంగా 67 శాతం ఓటింగ్ నమోదైంది. మిగిలిన జిల్లాల్లో దాదాపు అన్ని చోట్ల మంచి ఓటింగ్ శాతం నమోదు కావడం, ఉత్సవానికి సానుకూలమైన ఫలితాలు రావడం ప్రభుత్వ విజయం గానే చెప్పుకోవాలి.