అధికార పార్టీ హవా కనిపిస్తోంది. తొలి విడత పంచాయితీ ఎన్నికలను మించి రెండో దశలో వైఎస్సార్సీపీ మద్ధతుదారులు విజయాలు సాధించారు. కీలక పంచాయితీలను కైవసం చేసుకున్నారు. ఏకపక్షంగా విజయాలు సాధిస్తూ భారీ ఆధిక్యాలు నమోదు చేసుకున్నారు. దాంతో 80 శాతం పైబడిన పంచాయితీలు జగన్ కి జై కొట్టినట్టవుతోంది. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలతో ఆ పార్టీ తిరుగులేని ఆధిక్యం సాధిస్తున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా గ్రామీణ స్థాయిలో కూడా పట్టు నిలుపుకుంటూ, పార్టీ విస్తరణ దిశలో ఉన్నట్టు స్పష్టమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల విషయంలో చంద్రబాబు పట్టుదలకు పోయి తగిన పరిహారం చెల్లించుకుంటున్నారు. ఫలితాలు చూస్తుంటే టీడీపీ నేతలకు షాక్ తగులుతున్నట్టు కనిపిస్తోంది. గత ఎన్నికల తర్వాత జగన్ పట్ల తీవ్ర దుష్ప్రచారం చేసినా, వాస్తవాలను వక్రీకరించి విష ప్రచారం జరిపినా ఆపార్టీ కోలుకునే అవకాశాలు లేవని తెలుస్తోంది. వరుసగా రెండు విడతల్లో సగం పంచాయితీలకు ఎన్నికలకు పూర్తికాగా ఏకగ్రీవాల మాట అలా ఉంచి , పోలింగ్ జరిగిన చోట కూడా టీడీపీ మద్ధతుదారులు చేతులెత్తేస్తున్న తీరు ఆపార్టీ పునాదులకు బీటలు వారుతున్న స్థితిని చాటుతోంది.
గ్రామీణ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చేసేలా విన్నూత కార్యక్రమాలను తీసుకొచ్చిన జగన్ కి జనం జై కొడుతున్నారు. గ్రామ సచివాలయంతో పాలన అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వానికి పట్టం గడుతున్నారు. రెండో విడత ఎన్నికల్లో 167 మండలాల పరిధిలో 3,328 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా, 539 చోట్ల సర్పంచి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని ఒక్కో పంచాయితీకి నామినేషన్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అక్కడ ఎన్నికలు జరగలేదు. ఇక మిగిలిన 2,786 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఫలితాలు ప్రకటించారు. దాదాపుగా మొదటి విడత ఫలితాలను తలపించేలా 80 శాతం పంచాయితీల్లో వైఎస్సార్సీపీ మద్ధతుదారులు విజయం సాధించారు.
కొన్ని కీలక పంచాయితీల ఫలితాలు
విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు స్వగ్రామం చినమేరంగిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి అల్లు రవణమ్మ 122 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
అదే జిల్లాకి చెందిన ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి స్వగ్రామం కవిరిపల్లిలో వైఎస్సార్సీపీ అభిమాని 408 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు.
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి స్వగ్రామంలో వైఎస్సార్సీపీ అభిమాని విజయం సాధించారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఇన్చార్జి ఉమామహేశ్వరనాయుడు స్వగ్రామం అంకంపల్లిలో వైఎస్సార్సీపీ అభిమాని రుద్ర విజయం సాధించారు.
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి సొంత పంచాయతీ సంగాలలో వైఎస్సార్సీపీ అభిమాని విజయం సాధించారు.
పామర్రు నియోజకవర్గ పరిధిలోని మంత్రి కొడాలి నాని స్వగ్రామంలో టీడీపీ అభిమాని గెలిచారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వగ్రామం తూ గో జిల్లా కాతేరులో వైఎస్సార్సీపీ అభిమాని విజయం సాధించారు.
రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ఫలితాల్లో దాదాపు 2,800 స్థానాల్లో వైఎస్సార్సీపీ హవా సాగింది. సుమారు 550 పంచాయితీల్లో టీడీపీకి విజయం దక్కింది. ఇక బీజేపీ జనసేన కూటమి పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీలకు చెందిన వారు 25 చోట్ల గట్టెక్కారు. ఇతరులు సీపీఎం 4, సీపీఐ 2 గ్రామాల్లో గెలిచాయి. కొన్ని పంచాయితీల్లో హోరాహోరీ పోరు సాగినప్పటికీ అనేక చోట్ల వైఎస్సార్సీపీ రెబల్స్ కూడ ప్రభావం చూపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని చోట్లా ఒకే రీతిలో పాలకపక్షానికి పల్లె వాసులు పట్టం కట్టడం గమనార్హం. తమ పార్టీకి జననీరాజనాలు దక్కడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
చంద్రబాబు విన్యాసాలతో ఉపయోగమేమి..
ఓవైపు ఎస్ఈసీ వైపల్యం అంటారు. కేంద్రానికి లేఖ రాస్తారు. పంచాయితీ ఎన్నికలు సక్రమంగా జరగలేదని అంటారు. అధికార పార్టీ దౌర్జన్యాలని విమర్శిస్తారు. సరిగ్గా అదే సమయంలో తమ పార్టీ ఘన విజయం సాధించిందని చెప్పుకుంటారు. పైగా అక్కడక్కడా విజయాలు దక్కితే మొత్తంగా తామే గెలిచామన్నట్టుగా కలరింగ్ ఇస్తారు. చివరకు తమ పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకుంటారు. అంటే ఓవైపు ఎన్నికలు సజావుగా జరగలేదన్నది నిజమయితే టీడీపీ ఎలా గెలిచిందని సంబరాలు చేసుకుంటారు.. టీడీపీ నేతల తీరు విస్మయకరంగా మారింది. ఓవైపు లేఖలు రాస్తూ ఎన్నికల నిర్వహణపై అభ్యంతరాలు చెప్పడం ఏంటి, రెండోవైపు తామే గెలిచామని విజయోత్సవాలు ఏంటో టీడీపీ నేతలకయినా అర్థమవుతుందా అన్నది అంతుబట్టడం లేదు.