కేంద్ర బడ్జెట్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి కేటాయింపులు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశాల ప్రస్తావనే లేదన్నారు. తాము ప్రతిపాదించిన ఏ అంశానికి బడ్జెట్‌లో చోటు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం నిధుల ప్రస్తావనే లేదని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఏపీకి తీవ్ర అన్యాయం చేశారని వాపోయారు. ఈ బడ్జెట్‌లోనే కాదు గతంలోనూ ఇదే తీరున ఏపీ పట్ల వ్యవహరించారని గుర్తు చేశారు.
ప్రజలను ఆకర్షించేందుకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్‌ను రూపాందించినట్లుగా ఉందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఎగ్గొట్టే వారి నుంచి రుణాలు ఆశించిన స్థాయిలో చేయడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పుల్లో కేవలం 25 శాతం కూడా రికవరీ చేయలేదన్నారు. నల్లధనం వెలికితీతపై కూడా కేంద్ర చర్యలు సంతృప్తికరంగా లేవన్నారు. పారిశ్రామిక ఎగుమతులతోపాటు వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తుల ఎగుమతులపై కూడా దృష్టి పెట్టాలన్నారు.