iDreamPost
iDreamPost
‘భవిష్యత్ అంతా కాపులదే.. ఎన్నికల్లో ఇతర సామాజికవర్గాల వారు పోటీ చేస్తే కాపులను గెలిపించండి. ఇద్దరు కాపులు పోటీ చేస్తే కాపులను కాసేవారికి ఓటెయ్యండి’ అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. విశాఖపట్నం జిల్లా పాయకారావుపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వంగ వీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ సభలో ఎమ్మెల్సీ తోట ప్రసంగం చూసినవారికి కాపులలో పట్టు సాధించే దిశగా సాగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సభలో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు భవిష్యత్ లో కాపులదే అధికారం అన్నట్టుగా మాట్లాడారు. ఈ విషయంలో తాను కూడా తగ్గేదేలే అన్నట్టుగా తోట ప్రసంగం సాగింది. ఇటీవల కాలంలో కాపు ఉద్యమానికి మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం దూరంగా ఉంటున్నారు. దీనితో కాపులను నడిపించే నాయకుడు లేకుండా పోయాడు. ఈ శూన్యాన్ని భర్తీ చేసేలా తోట ప్రసంగం సాగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తూర్పు రాజకీయాల్లో తోట త్రిమూర్తులు తన ముద్ర వేశారు. రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1994 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలవడమే ఒక సంచలనం. రాష్ట్రమంతా టీడీపీ హవా నడవగా, ఇక్కడ త్రిమూర్తులు స్వతంత్రంగా పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆయన టీడీపీలో చేరారు. 1999 ఎన్నికల్లో మరోసారి టీడీపీ తరపున గెలిచారు. 2004 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఇక్కడ స్వతంత్రునిగా పోటీ చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2009లో ప్రజారాజ్యంలో చేరిన ఆయన ఆ పార్టీ తరపున పోటీ చేసి ఆయన మరోసారి బోస్ చేతిలో ఓడిపోయారు.
మంత్రిగా ఉన్న బోస్ కాంగ్రెస్ పార్టీని వీడి ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి వెంట వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ కారణంగా రామచంద్రాపురానికి 2012 ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన తోట మూడవసారి ఇక్కడ నుంచి గెలిచారు. 2014 ఎన్నికల నాటికి టీడీపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి నాల్గవ సారి ఇక్కడ నుంచి గెలిచారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ప్రస్తుత రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేతుల్లో టీడీపీ తరపున పోటీ చేసి తోట ఓటమి చవిచూశారు. ఎన్నికల అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరిన ఆయన మండపేట నియోజకవర్గం కో ఆర్డినేటర్‌గాను, అమలాపురం పార్లమెంట్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. అనంతరం శాసనమండలికి ఎన్నికయ్యారు. మండపేట మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించడం ద్వారా ఆయన పట్టు నిరూపించుకున్నారు.
Also Read : గంటా ‘కాపు’ వ్యాఖ్యలు ఎందుకు చేశారు..?
తోట త్రిమూర్తులకు సొంత నియోజకవర్గం రామచంద్రపురంలోనే కాకుండా కో ఆర్డినేటర్‌గా ఉన్న మండపేటతో పాటు ముమ్మిడివరం, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కాపుల్లో పట్టు ఉంది. ఆయనకు ఆయా నియోజకవర్గాల్లో బంధువర్గంతోపాటు ముఖ్య అనుచరులు ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో బలమైన సామాజికవర్గంగా ఉన్న కాపులకు ముద్రగడ పద్మనాభం తరువాత పెద్ద దిక్కుగా ఉన్న నాయకులు లేరు. ఈ స్థానాన్ని భర్తీ చేయాలని తోట చూస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కారణంగా తోట కాపులను గెలిపించాలని, ఇరువైపులా కాపులు పోటీ చేస్తే కాపు కాసేవారిని గెలిపించాలంటూ సొంత సామాజికవర్గంలో తనపట్ల సానుకూలత పెరిగేలా వ్యాఖ్యలు చేశారని విశ్లేషకుల భావన.