iDreamPost
android-app
ios-app

వైసీపీ ఎమ్మెల్యే మనవడికి కరోనా పాజిటివ్‌

వైసీపీ ఎమ్మెల్యే మనవడికి కరోనా పాజిటివ్‌

సామాన్యులు, సెలబ్రిటీలు, ప్రజాప్రతినిథులు అనే తేడా లేకుండా కరోనా వైరస్‌ అందరికీ సోకుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, వారి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురు ఎమ్మెల్యేలకు కరోనా వైరస్‌ సోకింది. ఏపీలో విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే శ్రీనివాసులకు కరోనా పాజిటివ్‌ అని ఇటీవల తేలింది. తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మనవడకు కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. ఏడేళ్ల వయస్సున్న అన్నా మనవడు అన్నా గౌతంకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు నిర్థారించారు. అన్నా మనవడితోపాటు ఆయన కారు డ్రైవర్, అటెండర్‌కు కూడా కరోనా సోకి నట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, అతని కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు.

కాగా, ఇటీవల అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గన్‌మెన్‌ కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ సోకిన విషయం ఆయన బయటకు చెప్పకపోవడంతో ప్రాణ నష్టం జరిగింది. విధులు కూడా నిర్వహించడంతో ఆయన సహచరులు నలుగురికి కరోనా సోకినట్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రకటించారు. తాను రెండు సార్లు పరీక్షలు చేయించుకున్నా నెగిటివ్‌ వచ్చిందని తెలిపారు. కరోనా సోకిన తెలంగాణలోని జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కలవడంతో గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ నెల 19వ తేదీన జరిగిన రాజ్యసభ ఎన్నికల్లోనూ ఆయన ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు.