ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రాక్షసి మరో రాజకీయ నేతను బలితీసుకుంది. మాజీ ఎమ్మెల్యే,వైసీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ (59) మరణించారు.నెల రోజుల క్రితం ఆయనకు కరోనా సోకడంతో నగరంలోని ఓ ఆస్పత్రిలో చేరారు.చికిత్స అనంతరం కోవిడ్ నెగటివ్‌గా రావడంతో డిశ్చార్జ్ అయ్యారు. కానీ వైరస్ ఆయన ఊపిరితిత్తులపై ప్రభావం చూపడంతో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
ఉత్తరాంధ్ర దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ వారసుడుగా ద్రోణంరాజు శ్రీనివాస్ రాజకీయాలలోకి ఆరంగేట్రం చేశాడు.సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి 2004, 2009 అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ విప్‌గా పనిచేశారు.
కాగా 2014 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమిపాలైన గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీలో చేరారు.2019లో ఆయన విశాఖ దక్షిణ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అనంతరం సీఎం జగన్ ఆయనకు కీలకమైన విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎండీఆర్‌ఏ) చైర్మన్‌గా అవకాశం కల్పించారు.