Idream media
Idream media
తెలుగుదేశం పార్టీకి మున్సిపోల్స్ కూడా పల్స్ లేకుండా చేశాయి. కార్పొరేషన్లలో 11కు 11 వైసీపీ జెండానే ఎగురగా, 75 మున్సిపాలిటీల్లో కేవలం రెండు మున్సిపాలిటీలకే టీడీపీ పరిమితం అయ్యింది. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సహా సీనియర్ నేతల ఇలాకాలో కూడా తెలుగుదేశానికి ఘోర ఓటమి తప్పలేదు. ఆయా జిల్లాల్లో ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జిల్లా శ్రీకాకుళం, సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు ఉండే విజయనగరం, తునిలో యనమల రామకృష్ణుడికి, పెద్దాపురంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు, హిందూపురంలో బాలకృష్ణకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. సానుకూల దృక్పథంతో, సంక్షేమ పథకాలతో తమ హృదయాలను గెలుచుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే మరోసారి ప్రజలు పట్టం కట్టడంతో వైఎస్సార్ సీపీ సరికొత్త రికార్డు సృష్టించింది.
చిత్తూరు, తిరుపతి, కడప, ఒంగోలు, కర్నూలు, గుంటూరు తదితర 6 కార్పొరేషన్లను కైవసం చేసుకున్న వైఎస్సార్‌సీపీ… విశాఖపట్నం, మచిలీపట్నం, విజయవాడ కార్పొరేషన్లలోనూ ఆధిక్యం కనబరిచింది. కనబరుస్తోంది. మిగతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ ముందంజలో ఉంది. దీంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీ కంచుకోటలు బద్దలు కొడుతూ.. చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్స్ విజయ ఢంకా మోగించింది. అదే విధంగా మదనపల్లి, పలమనేరు, పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో జయకేతనం ఎగురవేసింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో మాజీ హోం మంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కు గట్టి దెబ్బే తగిలింది. రెండో సారి కూడా ఎమ్మెల్యేగా గెలిచినా పెద్దాపురం మున్సిపాల్టీలో తెలుగుదేశం కనీస స్థాయిలో సీట్లను గెలుచుకోలేకపోయింది. మొత్తం 29 వార్డులకు గాను అధికార వైసీపీ పార్టీ ఏకంగా 26 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. తెలుగుదేశం కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మరో స్థానంలో జనసేన అభ్యర్థి గెలుపొందారు.
శ్రీకాకుళం జిల్లాలోనూ వైసీపీ హవా కొనసాగించింది. జిల్లాలో పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాలిటీలతో పాటు పాలకొండ నగర పంచాయతీలో సైతం అత్యధిక వార్డులను కైవసం చేసుకుంది. మూడుచోట్లా చైర్మన్ పీఠాలను దక్కించుకుంది. ఈ మూడు చోట్లా మొత్తం 74 వార్డులకు ఈ నెల 10న ఎన్నికలు నిర్వహించారు. భారీ భద్రత నడుమ ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. 74 వార్డులకు గానూ వైసీపీ మొత్తం 55 స్థానాల్లో ఆధిక్యం సాధించింది. ఇందులో నాలుగు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. టీడీపీ 17 స్థానాలను కైవసం చేసుకోగా, రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. కాశీబుగ్గలో ఒక్క 16వ వార్డు మినహా అన్ని స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. పలాసలో మొత్తం 31 వార్డులు కాగా, వైసీపీకి రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
మిగిలిన 29 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా.. వైసీపీ 21 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 8 స్థానాలను దక్కించుకుంది. మొత్తంగా 23 స్థానాలను సాధించిన వైసీపీ.. మునిసిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. టీడీపీ కేవలం 8 సీట్లకు పరిమితమైంది. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది.
ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో మొత్తం 23 వార్డులకు గానూ 15 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. టీడీపీకి ఆరు వార్డులు దక్కగా.. 15, 23వ వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. కొన్నివార్డుల్లో స్వల్ప ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థులు ఓటమి చెందారు. 8వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థికి 366 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థికి 365 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి రీ కౌంటింగ్ చేయాలని అధికారులను కోరారు. మళ్లీ కౌంటింగ్ చేయగా.. అదే ఫలితం రావడంతో ఒక్క ఓటు తేడాతో వైసీపీ అభ్యర్థి గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. 9వ వార్డులో 55 ఓట్లు, 19 వార్డులో 6 ఓట్లు, 20 వార్డులో 89 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థులు ఓటమి చెందారు. పాలకొండ నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులకు రెండు స్థానాలు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 18 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా 15 స్థానాలను అధికార పార్టీ దక్కించుకుంది.
ఎన్నికల సమరంలో స్వయంగా రంగంలోకి దిగిన చంద్రబాబు ప్రజలను ఆకట్టుకోలేకపోయారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే అమరావతి వచ్చిన టీడీపీ అధినేత… నేతలు, కార్యకర్తల మధ్య సరైన సమన్వయం చేయడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇక కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు వైసీపీలో చేరారు. ఆ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ నేతలను నియమించకపోవడం కూడా కార్యకర్తల్లో పరాజయానికి కారణంగా కనిపిస్తోంది. ఇప్పటికే గన్నవరం, చీరాల, రేపల్లె, విశాఖ తూర్పు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు తెలిపారు. కొంతమంది మాజీ మంత్రులు కూడా వైసీపీ, బీజేపీల్లో చేరారు. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికీ కొత్త నేతలను పార్టీ నియమించలేదు. ఈ అంశం కూడా కార్యకర్తల్లో కొంత అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. కీలక నేతల అరెస్టులు, ప్రచారంలో వైఫల్యం, అమలు సాధ్యం కానీ హామీలే టీడీపీ ఓటమికి కారణమని అంతా భావిస్తున్నారు. పార్టీ మారిన నేతల స్థానంలో కొత్త అభ్యర్థులను నియమించక పోవడం కూడా ఆయా ప్రాంతాల్లో పార్టీ ఓటమికి కారణంగా కనిపిస్తోంది.