Idream media
Idream media
పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఎవరి సత్తా ఏంటో మరోసారి స్పష్టం చేశాయి. ముఖ్యంగా రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఏంటో, వైసీపీ హవా ఎలా ఉందో తెలియజేశాయి. రాష్ట్ర మొత్తం ఎలాగున్నా ప్రత్యేకించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్షనాయకుడు చంద్రబాబునాయుడి సొంత నియోజకవర్గాల ఫలితాలపై అంతటా ఉత్కంఠ ఏర్పడింది. కుప్పంలో చంద్రబాబు సైతం ఓడిపోతారని వైసీపీ నేతలు ఎప్పటి నుంచో ప్రకటనలిస్తున్నారు. జగన్ పాలనపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, అందుకే ఎన్నికలకు భయపడుతున్నారని టీడీపీ నేతలు ఆరో్పణలు చేస్తూ వచ్చారు.
పంచాయతీ ఎన్నికల సమరం ముగిసింది. ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో ఎవరి సత్తా ఏంటో తేలిపోయింది. అందరూ ఆసక్తి కనబరిచిన చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం, సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలోని ఫలితాలను పరిశీలిస్తే బాబు పరిస్థితి దయనీంగా మారిందని స్పష్టం అవుతోంది. జగన్ అపూర్వ ఆదరణ పొందుతున్నారనేది రుజువైంది. కుప్పంలో 89 పంచాయితీలకు గాను టీడీపీ మద్దతుదారులు కేవలం 14 స్థానాల్లో మాత్రమే గెలవగలిగారు. పులివెందులలో 108కి 108 కూడా వైసీపీ మద్దతుదారులే విజయకేతనం ఎగురవేసి రికార్డు సృష్టించారు. పులివెందుల పులిబిడ్డ జగన్ కు తిరుగులేదని చాటి చెప్పారు.
కుప్పంలో కూడా వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయభేరి మోగిండంతో టీడీపీకి భారీ షాక్ తగిలింది. 89 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. 75 చోట్ల వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయం సాధించడం చంద్రబాబు సహా మొత్తం పార్టీ ఖంగుతింది. కులమతాలు, పార్టీలకతీతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలన ప్రభావం కుప్పంలోనూ పడింది. ‘కుప్పం పేరు చెబితే టీడీపీ’ అన్న మాటకు బ్రేక్‌పడింది. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు అత్యధిక మెజార్టీతో విజయం సాధించి చరిత్ర తిరగరాశారు. చాలా పంచాయతీల్లో టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. కుప్పంలో టీడీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలు తార్కాణంగా నిలిచాయి. 1985 నుంచి టీడీపీ ఎమ్మెల్యేలే ఇక్కడినుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 1989లో చంద్రబాబు తొలిసారి టీడీపీ ఎమ్మెల్యేగా కుప్పం నుంచి ఎన్నికయ్యారు. తర్వాత వరుసగా ఏడు పర్యాయాలు ఇక్కడ గెలిచారు. మూడుసార్లు సీఎంగా పదవి చేపట్టారు. కుప్పంలో తనకు తిరుగులేదని ఇంతకాలం నిరూపించుకున్నారు. కానీ పంచాయతీ ఎన్నికల్లో చరిత్ర తిరగబడింది.
నియోజకవర్గంలోని గుడిపల్లె, అడవిబూదగూరు, ఊర్లోఓబనపల్లె లాంటి మేజర్ పంచాయితీలు సైతం వైఎస్సార్‌సీపీ ఖాతాలో చేరిపోయాయి. గుండ్లసాగరంలో టీడీపీ మద్దతుదారు 140 ఓట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. దాసిమానుపల్లెలో కేవలం 98 ఓట్లే టీడీపీ మద్దతుదారుడికి దక్కాయి. 978 ఓట్లు వైఎస్సార్‌సీపీ మద్దతుదారుకు లభించాయి. రామకుప్పం మండలం కెంచనబల్లలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు సుబ్రమణ్యం 2003 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. టీడీపీ మద్దతుదారునికి కేవలం 285 ఓట్లు వచ్చాయి. తన హయాంలో ప్రజలను మభ్యపెట్టడం తప్ప నియోజకవర్గాన్ని నిర్దిష్టంగా అభివృద్ధి చేయడంలో చంద్రబాబు విఫలమవడం ఫలితంగానే ఈ దుస్థితి తలెత్తిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, ముఖ్యమంత్రి అయినా తన సొంత నియోజకవర్గం పులివెందులకు జగన్ ఎప్పుడూ దూరంగా లేరు. ఎన్ని పనులతో బిజీగా ఉన్నా, తన నియోజకవర్గానికి సమయం కేటాయిస్తూ స్థానికుల అభిమానం చెక్కుచెదిరిపోకుండా కాపాడుకున్నారు. దానికి నిదర్శనమే పంచాయతీ ఎన్నికల ఫలితాలు. పులివెందుల నియోజకవర్గంలో మొత్తం 108 నియోజకవర్గాలు ఉండగా, 90 పంచాయతీలు ఏకగ్రీవం కావడం అక్కడ వైసీపీ సత్తా ఏంటో తెలియజేశాయి. ఎన్నికలు నిర్వహించిన 18 స్థానాలలో కూడా వైసీపీ మద్దతుదారులే విజయం సాధించారు. అంటే 108 పంచాయతీలలోనూ వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో 75 చోట్ల వైసీపీ విజయకేతనం ఎగురవేస్తే జగన్ నియోజకవర్గం పులివెందులలో 90 చోట్ల నామినేషన్లు వేయడానికి టీడీపీ నుంచి ఎవరూ ముందుకు రాలేదు. ఆయా నియోజకవర్గాలలో ఎవరి పట్టు ఎలా ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది.