Idream media
Idream media
ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలను ఇవ్వాలని రాష్ట్రాల హైకోర్టులు సుప్రిం కోర్టు కోరడంతో వైసీపీ నేతలకు, సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డిలకు భయం పట్టుకుందని విమర్శించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు వైసీపీ శ్రేణులకు లక్ష్యంగా మారారు. తనపై నమోదైన కేసులు 8 ఏళ్లుగా విచారణ జరుగుతున్నాయని, వాటిని సత్వరమే విచారించాలని సీఎం జగన్ సుప్రిం కోర్టుకు లేఖ రాయగలరా..? అంటూ కూడా కళా వెంకటరావు ప్రశ్నించి పలు ప్రశ్నలకు సమాధానం చెపాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్న సీఎం జగన్‌పై ఏ పరిస్థితిలో కేసులు పెట్టారో అందరికీ తెలుసని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో కళా వెంకటరావుకు గుర్తు చేస్తున్నారు. అక్రమంగా కేసులు పెట్టినా, నిబంధనలకు విరుద్ధంగా 16 నెలలు జైలులో పెట్టినా తమ నాయకుడు ఎవరికీ లొంగలేదని, న్యాయస్థానాల్లో పోరాటం సాగిస్తున్నారన్న విషయం కళా గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. తప్పు చేయనివాడే ఏ విచారణకైనా సిద్ధంగా ఉంటాడని, విచారణను ఎదుర్కొంటాడన్న వైసీపీ మద్ధతుదారులకు కళా వెంకటరావు సమాధానం చెపాల్సిన పరిస్థితి నెలకొంది.
గురివింద తన కింద ఉన్న నలుపు ఎరగదన్నట్లుగా కళా వెంకటరావు తీరు ఉందని కూడా వైసీపీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. రాజకీయ కక్షతో పెట్టిన కేసులను తమ నాయకుడు ఎదుర్కొంటున్నాడని కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాదిరిగా స్టేలు తెచ్చుకుని తప్పించుకోవడం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు తప్పు చేయకపోతే 19 స్టేలు ఎందుకు తెచ్చుకున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ చంద్రబాబుపై దాఖలైన కేసుల్లో స్టేలు కొనసాగుతున్నాయన్న విషయం కళా వెంకటరావుకు తెలియదా..? అని ప్రశ్నిస్తున్నారు. తనపై ఉన్న అన్ని స్టేలను ఎత్తివేసి విచారణ జరపాలని చంద్రబాబు చేత సుప్రిం కోర్టుకు లేఖ రాయించగలరా..? అని వైసీపీ శ్రేణులు కళా వెంకటరావుకు సవాల్ విసురుతున్నాయి. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూనే… విచారణ ఆపాలని హైకోర్టులో పిటిషన్లు ఎందుకు దాఖలు చేశారని నిలదీస్తున్నారు.
రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే సమయం ఆసన్నమైన నేపథ్యంలో కళా వెంకటరావు తమ అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై, ఆ పార్టీ నేతలపై విమర్శలు ఎక్కుపెట్టారనే అంచనాలున్నాయి. అయితే తానొకటి తలిస్తే.. దేవుడొకటి తలిచాడన్నట్లుగా కళా వెంకటరావు పరిస్థితి తయారైంది. చంద్రబాబు మెప్పు కోసం జగన్‌ను విమర్శిస్తే.. తిరిగి అవి చంద్రబాబుకే తగులుతుండడంతో కళా వెంకటరావుకు ఏం చేయాలో తోచడంలేదు. ఓ వైపు తన జిల్లాకే చెందిన అచ్చెం నాయుడుకు అధ్యక్ష పదవి కోసం కాచుకుని కూర్చున్నాడు.. మరోవైపు అధినేతను మెప్పిద్దామని చేస్తున్న ప్రయత్నాలన్నీ బూమరాంగ్ అవుతున్నాయనే నిర్వేదంలో కళా వెంకటరావు ఉన్నారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.