Idream media
Idream media
బీహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో రాజకీయ పార్టీ బిజెపి మాజీ నేత యశ్వంత్ సిన్హా నాయకత్వంలో పురుడుపోసుకుంది.వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆర్థిక,విదేశీ వ్యవహారాల శాఖలను నిర్వహించిన యశ్వంత్ సిన్హా తిరిగి రాజకీయాలలోకి వస్తున్నట్లు శనివారం ప్రకటించారు.ఈ ఏడాది చివరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చెయ్యడానికి ఓ రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని ఆయన తెలిపాడు.రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని తొలగించి “మెరుగైన బీహార్” ను రూపొందించడమే తమ పార్టీ లక్ష్యమని సిన్హా వెల్లడించాడు.
డిమానిటైజేషన్(నోట్ల రద్దు) తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలు,పనితీరుపై యశ్వంత్ సిన్హా తీవ్ర విమర్శలు గుప్పించారు.రెండేళ్ల క్రితం ఆయన,తన సహచర ఎంపీ శత్రుఘన్ సిన్హాతో కలిసి ‘రాష్ట్ర మంచ్’ (నేషనల్ ఫోరం) అనే రాజకీయ కార్యాచరణ సమూహాన్ని ప్రారంభించాడు.ఆ సందర్భంగా ప్రత్యక్ష రాజకీయాల నుండి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించడం రాజకీయ వర్గాలను విస్మయపరిచింది.అలాగే దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లను ప్రజలకు వివరించి,ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.ఈ క్రమంలో యశ్వంత్ బిజెపి పార్టీతో తన అనుబంధాన్ని తెంచుకున్నాడు.కాగా 2019 సాధారణ ఎన్నికల తర్వాత ఆయన రాజకీయంగా స్తబ్దుగా ఉండిపోయారు.
అయితే ఎన్నికలకు పట్టుమని నాలుగు మాసాలు కూడా లేని సమయంలో తన నాయకత్వంలో ఏర్పడే కొత్త పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తుందని సిన్హా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇదే సందర్భంలో బీహార్‌లోని ఆర్జేడీ,కాంగ్రెస్ ఆధ్వర్యంలోని గ్రాండ్ అలయన్స్‌తో ఎన్నికల పొత్తుకు ఆయన తలుపులు తెరిచారు.మాతో కలిసి వచ్చే ప్రతి ఒక్కరికి మేము స్వాగతం పలుకుతామని ఆయన తెలిపారు.అయితే ఎన్నికలలో పోటీ చేయడానికి నాకు ఎలాంటి రిజర్వేషన్లు లేవని కాదు.కానీ మెరుగైన బీహార్ కోసం మా ప్రతిపాదిత కూటమి సర్వశక్తులు వడ్డీ ఎన్నికలలో పోరాడుతుంది అని సిన్హా వ్యాఖ్యానించాడు.
ఇక తన ప్రతిపాదిత కూటమిపై ఆసక్తి ఉన్న పార్టీల గురించి విలేకరులు ప్రశ్నించగా సిన్హా దానిని బహిర్గతం చేయడానికి ఇది సరైన సమయం కాదని తెలిపాడు.అయితే బీహార్‌కు చెందిన పలువురు నాయకులు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పుకొచ్చారు. పార్టీ పేరు నిర్ణయించలేదని దానిని త్వరలోనే వెల్లడిస్తానని సిన్హా తెలిపాడు.అసెంబ్లీ ఎన్నికలలో మీరు స్వయంగా పోటీ చేస్తారా..? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం సూటిగా చెప్పలేదు. నేను ఆ వంతెన వద్దకు వచ్చినప్పుడు దాటుతాను అని సిన్హా చెప్పడం గమనార్హం.
గత 27 సంవత్సరాలుగా బీహార్ మానవ అభివృద్ధి సూచిక (హెచ్‌డిఐ) లో అట్టడుగున ఉందని సిన్హా తెలిపారు. పేదరిక సూచికలో కూడా రాష్ట్రం అత్యంత పేదరికంలో ఉందని చెప్పారు. రాష్ట్ర వార్షిక తలసరి ఆదాయం 47,541 రూపాయలు కాగా ఇది జాతీయ సగటులో మూడింట ఒక వంతు మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు.
నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సుమారు 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ ఆశించిన అభివృద్ధి జరగలేదని ఆయన ఆరోపించారు.ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అన్ని రంగాలలో నితీశ్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన ధ్వజమెత్తారు. లంచం లేకుండా ఏ పని జరగటం లేదు,రాష్ట్రంలో అవినీతి గరిష్ట స్థాయిలో ఉందని సిన్హా విమర్శించాడు.
మెరుగైన బీహార్ తయారీకి నితీశ్ ప్రభుత్వాన్ని తొలగించడం తొలి మెట్టు అని ఆయన ప్రకటించారు.అసెంబ్లీ ఎన్నికలలో “బెహతార్ బీహార్ బనావో” (మంచి బీహార్‌ను తయారు చేయండి) అనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.ప్రతి వారము రాష్ట్రంలో ఒక్కొక్క రంగంలో జరిగిన వాస్తవ అభివృద్ధిపై ఒక పత్రాన్ని మీడియా ముందు ఉంచుతామని ఆయన వెల్లడించారు.