శాసనసభ లోపల ఉంటేనే స్పీకర్, బైటకు వస్తే కాదన్న తమ్మినేని సీతారాం ధోరణి సరైనది కాదని, యనమల రామకృష్ణుడు తమ్మినేని సీతారాం కు లేఖ రాశారు.ఏకపక్షంగా వ్యవహరించదలుచుకుంటే అది ఆయన విజ్ఞతకే వదిలేస్తామని, ప్రజా ప్రతినిధుల గౌరవాన్ని నిలబెట్టాల్సిన పదవిలో ఉన్న తమ్మినేని అందరి గౌరవం పొందాలని యనమల సూచించారు. నిరాధార,తప్పుడు ఆరోపణలు చేయడం స్పీకర్ స్థానానికే కళంకమని ఆ లేఖలో చెప్పారు. వ్యక్తిగా విమర్శలు చేసినప్పుడు ప్రతివిమర్శ చేసే హక్కు ఎదుటివారికీ ఉంటుందని గుర్తు చేశారు. శాసనసభ బయట ఒక ఎమ్మెల్యేగా, ఒక సామాన్యుడిగా మాట్లాడితే..ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బిజినెస్ రూల్స్ 168, 169 మీకెందుకు వర్తించకూడదని యనమల ప్రశ్నించారు..
మాజీ స్పీకర్ అయిన యనమల ఆ అనుభవంతో స్పీకర్ బాదేతల గురించి చక్కాగా చెప్పారు. అయితే సూక్తులన్నీ చెప్పటానికే కానీ మనం పాటించటానికి కాదు అనే నానుడి యనమల మాటలకు సరిగ్గా సరిపోతుంది.
25 ఆగస్టు 1995 వ తేదీన తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు అసెంబ్లీ స్పీకర్ యనమల రామకృష్ణుడు కు వ్రాసిన లేఖ లో, పార్టీ అభీష్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకు నారా చంద్రబాబు నాయుడు,అశోక గజపతిరాజు,కోటగిరి విద్యాధరరావు, దేవేంద్రగౌడ్, ఏ. మాధవరెడ్డి లను తెలుగు దేశం ప్రాధమిక సభ్యత్వం నుంచి 25 ఆగస్టు 1995 వతేదీ నుంచి బహిష్కరించానని అందువలన తక్షణ చర్యలు తీసుకొనమని కోరుచూ స్పీకర్ కు వ్రాసిన లేఖను బుట్టదాఖలు చేసి వైస్రాయ్ ఎపిసోడ్ సాక్షిగా ఎన్టీఆర్ ను గద్దె దింపడానికి ఆయన చూపిన రాజ్యాంగ నిబద్ధత అనితర సాధ్యం..
తనకు రాజకీయంగా భవిష్యత్తు కల్పించి ఆదరించిన ఎన్టీఆర్ గారిని గద్దె దింపినప్పుడు అసెంబ్లీ సాక్షిగా తన వాదనను వినిపించడానికి అవకాశం ఇవ్వాలని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కోరితే కనీసం స్పందించకుండా ఆయనను కన్నీటి పర్యంతం చేసి అవమానకర రీతిలో అసెంబ్లీ నుండి బయటకు పంపిన ఆయన రాజ్యాంగబద్దత ఎంతటి గొప్పదో చరిత్ర చెబుతోంది..
అసెంబ్లీ బిజినెస్ రూల్స్ ను తప్పుదోవ పట్టించి అప్పటి శాసనసభ్యురాలు రోజాను అసెంబ్లీకి రానివ్వకుండా సస్పెండ్ చేసి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఆయన ఆ శాఖకు తెచ్చిన వన్నె చెప్పుకోదగ్గది..
స్పీకర్ మీద అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీ రూల్ బుక్ ప్రకారంగా కచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కావాల్సిన 15 రోజుల గడువును కూడా మౌఖిక తీర్మాణంతో రెండు రోజులకు కుదించి ఆ రాజ్యాంగబద్ద క్లాజును కూడా మార్చేసిన రాజ్యాంగ నిపుణుడు యణమల గారు.
అప్పుడు స్పీకర్ గా ఉంటూ తనకు ఎన్నికల్లో ఖర్చు చేయడానికి 15 కోట్లు ఖర్చయ్యాయని,ఎన్నికలు చాలా ఖరీదయ్యాయని బాహాటంగానే మీడియా ముఖంగా చెప్పిన కూడా ఏ మాత్రం మారుమాట్లాడకుండా ఉన్న యనమల గారి సమర్ధతకు నిదర్శనం..
23 మంది ఎమ్మెల్యేలు అనైతికంగా పార్టీ మారి, వారికి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు రాజ్యాంగాన్ని పొల్లు పోకుండా పాటించే యనమల గారు వారితో మంత్రివర్గ భేటీలో పాలుపంచుకున్న తీరు నిజంగా ముదావహం…
ఈ విధంగా తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నెన్నో రాజ్యాంగబద్ధంగా న్యాయమైన నిర్ణయాలు,పోరాటాలు చేసిన యనమల గారు నేడు స్పీకర్ గా పనిచేస్తున్న తమ్మినేని సీతారాం గారికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది..