iDreamPost
android-app
ios-app

ఇవిగో వాస్తవాలు : వైసీపీ ఎంపీలు పోరాడారా.. లేదా..?

ఇవిగో వాస్తవాలు : వైసీపీ ఎంపీలు పోరాడారా.. లేదా..?

కేంద్ర బ‌డ్జెట్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు స‌రైన ప్రాధాన్యం ద‌క్క‌లేద‌ని వాస్త‌వం. వైసీపీ ఎంపీల‌కు, ఏపీ ప్ర‌భుత్వానికి ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో కేంద్ర ప్ర‌భుత్వం నెర‌వేర్చలేదు. విచిత్రం ఏంటంటే.. ఇచ్చిన మాట‌ను త‌ప్పిన బీజేపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌కుండా ఏపీ ప్ర‌భుత్వంపైనా, వైసీపీ ఎంపీల‌పైనా తెలుగుదేశం నేత‌లు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రో విచిత్రం ఏంటంటే బ‌డ్జెట్ కేటాయింపుల‌పైనా, విడుద‌ల‌పైనా పూర్తి అవ‌గాహ‌న ఉన్న టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఆర్దికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా వాస్త‌వానికి దూరంగా మాట్లాడుతున్నారు.

పేదరికం, ఆర్ధిక అసమానతల తొలగింపు గురించి కేంద్రం ప్రస్తావించక‌పోవ‌డం వైసీపీ త‌ప్పేన‌ట‌. వైసీపీ నేతలు సొంత ప్రయోజనాల కోసమే కేంద్రమంత్రులు, ప్రధానితో భేటీ అవుతున్నారని దీని ద్వారా అర్థ‌మ‌వుతోంద‌ట‌. ఇందుకు ఏపీ సీఎం జగన్‌, వైసీపీ ఎంపీలే బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ పారిశ్రామిక కారిడార్ల అభివృద్ది గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదని యనమల ఆరోపించారు. ఏపీలో విసిఐసి, బిసిఐసి అభివృద్దికి ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. ఏపీ పునర్విభజన చట్టంలో అంశాలు, ప్రత్యేక హోదా, వెనుకబడిన 7 జిల్లాల అభివృద్దికి నిధులు, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యల పరిష్కారాలపై ఈ బడ్జెట్ లో ప్రస్తావన లేదని, ఈ వైఫల్యానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని యనమల డిమాండ్‌ చేశారు.

ఇక్క‌డ అస‌లు విష‌యం ఏంటంటే.. ఆయ‌న రాష్ట్రా అభివృద్ధికి కేంద్రం త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని చెప్ప‌ద‌లుచుకుంటున్నారో.. అస‌లు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిందే రాష్ట్ర ప్ర‌భుత్వం అనుకుంటున్నారో తెలియ‌ని ప‌రిస్థితి ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి క‌నిపిస్తోంది. ఏపీకి ఇంత అన్యాయం జ‌రిగినా వైసీపీ మౌనం వ‌హిస్తోందంటూ టీడీపీ నేత‌లు ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేస్తూనే ఉన్నారు. మ‌రి వీరికి బ‌డ్జెట్ ను విమ‌ర్శిస్తూ వైసీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్య‌లు విన‌ప‌డ లేదా..? బ‌డ్జెట్ ప్ర‌వేశానికి ముందే ఏపీ డిమాండ్స్ పై వారు కేంద్రానికి ఇచ్చిన లేఖ క‌నిపించ లేదో తెలియ‌డం లేదు.

వైసీపీ పంపిన ప్ర‌తిపాద‌న‌లివే..

విభ‌జ‌న హామీలు నెర‌వేర్చ‌డంతో పాటు ప్ర‌త్యేక హోదా స‌హా పలు అంశాల‌పై కేంద్ర బ‌డ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలంటూ వైసీపీ ఎంపీలు కేంద్రానికి ప‌లుమార్లు విన‌తి ప‌త్రాలు స‌మ‌ర్పించారు. విశాఖ అభివృద్ధి స‌హా.. ప్ర‌త్యేక హోదాపై ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తాజాగా పార్ల‌మెంట్ లో ప్ర‌స్తావించారు. దీంతో పాటు పోలవరం, కొత్త రైల్వే ప్రాజెక్టుల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. పీఎం కిసాన్‌లో కేంద్రం వాటా పెంచాలని, ఆరోగ్యశ్రీకి పోటీగా ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో వ్యాధుల సంఖ్య పెంచాలని, ఏపీకి మెట్రో రైల్‌ ప్రాజెక్టు ప్రకటించాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని దినాల్ని 100 నుంచి 150కి పెంచాలని కేంద్రాన్ని కోరారు. కానీ కేంద్రం సానుకూలంగా వ్య‌వ‌హ‌రించ లేదు. దీంతో తాము చేసిన అభ్యర్ధనలు పట్టించుకోకపోవడంపై తీవ్ర స్థాయిలో నిరాశ వ్యక్తం చేశారు.

వైసీపీ ఎంపీలు. పోలవరం, ప్రత్యేక హోదా, కొత్త రైల్వే ప్రాజెక్టులు వంటి ఎన్నో ప్రతిపాదనలు కేంద్రం ముందు పెట్టినా వాటిని కేంద్రం ఏమాత్రం పట్టించుకోకపోవడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. బడ్జెట్‌లో ఒకే ఒక్క ఆశాజనకమైన అంశం కనిపిస్తోంది. కరోనా వ్యాక్సిన్‌అభివృద్ధి, పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.35,000 కోట్లు ఖర్చు పెడుతోంది. అంతే తప్ప ఈ బడ్జెట్‌ వలన ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు. ఏపీకి అన్యాయంపై టీడీపీ నేత‌లు ముక్కు సూటిగా కేంద్రాన్ని విమ‌ర్శించే సాహ‌సం చేయ‌లేదు. వైసీపీ ఎంపీలు మాత్రం కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌డ‌మే కాదు.. నేడు ఆర్థిక మంత్రిని క‌ల‌వ‌నున్నారు.

నిర్మలతో భేటీ కానున్న వైసీపీ ఎంపీలు!

గత బడ్డెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని, ఈసారి కూడా అదే పరిస్ధితి ఉందని వైసీపీ ఎంపీలు తెలిపారు. ఇది సమాఖ్య స్ఫూర్తిగా విరుద్ధమన్నారు. కేవలం ఎన్నికల రాష్ట్రాలకే, కేంద్రం ప్రయోజనాలు ఉన్నచోటే బడ్జెట్‌ పరిమితం చేయడం సరికాదని వైసీపీ ఎంపీలు తెలిపారు. బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి తమ అభ్యంతరాలు తెలియజేస్తామని వైసీపీ ఎంపీలు తెలిపారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ యోజనలో పెండింగ్‌లో ఉన్న రహదారులను కేటాయించాలని ఆర్ధికమంత్రిని కోరతామని ఎంపీలు వెల్లడించారు.

ఈ డిమాండ్స్ తో భేటీ

– దేశవ్యాప్తంగా నాలుగు వైరాలజీ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. అందులో ఒక వైరాలజీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ సభ్యులంతా కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
– దేశంలో ఏడు టెక్స్‌టైల్స్‌ పార్క్‌లు ఏర్పాటు చేయబోతున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. వాటిలో ఒకటి రాష్ట్రానికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం.
– విస్టాడోమ్‌ రైల్వే బోగీలు ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నం-అరకు మధ్య మరిన్ని విస్టాడోమ్‌ కోచ్‌లు వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
– ధాన్యం ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ సివిల్ సప్లైస్‌ కార్పొరేషన్‌కు కేంద్రం చెల్లించాల్సిన రూ.4,282 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.
– రాష్ట్రంలోని 13 జిల్లాలను త్వరలోనే 26 జిల్లాలుగా ఏర్పాటు చేసే దిశగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ప్రతి జిల్లాలో ఒక కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు విజయసాయి రెడ్డి చెప్పారు.
– వ్యవసాయ రంగానికి సంబంధించి.. పీఎం కిసాన్‌- రైతు భరోసా కింద ప్రతి రైతుకు సీఎం శ్రీ జగన్ గారు రూ.13,500 ఇస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.6,000 మాత్రమే ఇస్తోంది. ఆ మొత్తాన్ని రూ.10,000లకు పెంచాలని విజ్ఞప్తి చేయమ‌ని విజ్ఞ‌ప్తి చేయ‌నున్నారు. పీఎం కిసాన్ కేటాయింపుల్లో ఏమాత్రం మార్పు లేదు. దీన్ని రూ.10,000 పెంచాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
– కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌లో 1350 వ్యాధులు మాత్రమే కవర్ అవుతుంటే.. సీఎం శ్రీ జగన్ గారు రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీలో 2,434 వ్యాధులు కవర్ అవుతాయి. దీనినిబట్టి ఆరోగ్యశ్రీ ఎంతో ఉత్తమమైనదని తెలుస్తోంది. ఆరోగ్యశ్రీలా ఆయుష్మాన్‌ భారత్‌ కూడా అన్ని వ్యాధులు కవర్ చేయాలని కోరారు.
– రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. దానికి సంబంధించి మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కింద బడ్జెట్‌లో రాష్ట్రానికి రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. నవరత్నాల కింద 2020-21 రాష్ట్ర బడ్జెట్‌లో సామాజిక సంక్షేమం కోసం చేసిన కేటాయింపుల్లో 110% పెరుగుదల కనిపిస్తుంటే కేంద్ర బడ్జెట్‌లో సామాజిక సంక్షేమానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం అన్నారు.
– మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద పని దినాలను 100 నుంచి 150 రోజులకు పెంచాలని కోరుతున్నాం. కానీ బడ్జెట్‌లో దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదని చెప్పారు.
ఈ బడ్జెట్‌ చాలా నిరాశజనకంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు ఆశించిన స్థాయిలో ఈ బడ్జెట్‌లేదు.

దీంతో మ‌రోసారి త‌మ డిమాండ్ల‌తో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ను క‌లిసేందుకు వైసీపీ ఎంపీలు సిద్ధ‌మ‌వుతున్నారు. మ‌రోవైపు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా కేంద్ర బడ్జెట్‌లో వివిధ రంగాల్లో చేసిన కేటాయింపుల్లో వీలైనన్ని నిధులను రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ శాఖలతో లైజనింగ్‌ చేసుకుని సకాలంలో నిధులు వచ్చేలా చూడాలని చెప్పారు. ఈ మొత్తం అంశాల‌ను ప‌రిశీలిస్తే ప్ర‌తిప‌క్షం విమ‌ర్శ‌ల‌కే ప‌రిమిత‌మైతే.. అధికార ప‌క్షం త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చుకునే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.