iDreamPost
iDreamPost
యానాం రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రతీసారి ఎన్నికల్లో తనదైన రాజకీయ ఎత్తులతో ప్రత్యర్థులను చిత్తుచేస్తున్న మల్లాడి కృష్ణారావు మరోసారి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు ఆయన దూరంగా ఉంటున్నారు.
1996 నుంచి ఇప్పటి వరకూ ఆయన పోటీ చేసిన ప్రతీసారి గెలుస్తూ వస్తున్నారు. పార్టీలు మారినా ఆయన విజయపరంపరకు అడ్డు లేదు. ఇప్పుడు కూడా యానాంలో మల్లాడి మాటకు తిరుగులేని వాతావరణం ఉంది. కానీ ఆయన అనూహ్యంగా పోటీ నుంచి విరమించుకున్నారు. కొన్ని నెలల క్రితమే ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అదే సమయంలో తనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఆసక్తి ఉందంటూ ప్రకటించారు. సీఎం జగన్ తో పలుమార్లు భేటీ అయ్యారు.
కాంగ్రెస్ ని చీల్చి, అధికారం నుంచి దించేసిన ఎన్డీయే పక్షాలు ఈసారి తమదే అధికారం అనేటంత ధీమాతో ఉన్నాయి. మాజీ సీఎం రంగస్వామి ని సీఎం అభ్యర్థిగా బరిలో దింపి కాంగ్రెస్ ని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. రంగ స్వామి నేతృత్వంలోని ఎన్ ఆర్ కాంగ్రెస్, బీజేపీ, అన్నా డీఎంకే కూటమి బరిలో ఉంది. ఈ నేపథ్యంలో సీఎం అభ్యర్థి రంగస్వామిని యానాం నుంచి బరిలో దింపబోతున్నట్టు మల్లాడి కృష్ణారావు ప్రకటించారు.
Also Read:జగన్ కోసం పదవిని వదులుకుంటానంటున్న పక్క రాష్ట్ర మంత్రి మల్లాడి కృష్ణారావు
ఇప్పటికే యానాం నుంచి ఏడుసార్లు విజయం సాధించిన మల్లాడి అనేక కీలక పదవులు అనుభవించారు. గతంలో రంగస్వామి మంత్రివర్గంలోనూ, ఇటీవల నారాయణ స్వామి మంత్రివర్గంలో కూడ ఆయన పలు శాఖలను నిర్వహించారు. ఇప్పుడు ఏకంగా సీఎం అభ్యర్థినే యానాం నుంచి బరిలో దింపబోతున్నట్టు ఆయన ప్రకటించడంతో యానాం ప్రాధాన్యత పెరుగుతుందనే చెప్పవచ్చు. పాండిచ్చేరి రాజకీయాల్లో అందరి దృష్టి యానాం మీద మళ్లే అవకాశం ఉంది.
మల్లాడి కృష్ణారావు ఇటీవల వరకూ కాంగ్రెస్ లో ఉన్నారు. అదే సమయంలో ఏపీ రాజకీయాల్లోనూ ఆయనకు ఆసక్తి ఉంది. ఈ విషయంలో బీసీ కార్పోరేషన్ చైర్మన్ల పదవీ స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో బహిరంగంగానే వెల్లడించారు. తాను యానాం రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని ప్రకటించారు. అదే సమయంలో జగన్ ని కలిసి ఏపీ రాజకీయాల్లో ముందుకు సాగాలని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. దాంతో పెద్ద చర్చకు ఆస్కారం ఇచ్చింది.
Also Read:చింతమనేని కోట కళ్లేదుటే బద్దలు!
ఇప్పుడు దానికి అనుగుణంగానే యానాం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఆయన విరమించుకున్నారు. పాతికేళ్లుగా ఎమ్మెల్యేగా సాగుతున్న ఆయన ఇకపై హస్తిన సభలో అడుగుపెట్టాలనే లక్ష్యంతో ఉన్నట్టు కనిపిస్తోది. దానికి అనుగుణంగా పావులు కదుపుతూ రాజ్యసభకు అవకాశం కోసం ఆయన ఎదురుచూస్తున్నట్టు చెబుతున్నారు. ఇటు ఏపీలోనూ, అటు పాండిచ్చేరి లేదా తమిళనాడు లో ఎక్కడో ఓ చోట నుంచి అవకాశం దక్కించుకునే దిశలో మల్లాడి కృష్ణారావు వ్యూహాత్మకంగా సాగుతున్నట్టు భావిస్తున్నారు.
ఏపీలో అంత సులువు కాకపోయినా జగన్ అండదండలుంటే వాటిని ఉపయోగించుకుని ఇతర మార్గాల్లో ముందుకు సాగాలనే సంకల్పం మల్లాడిలో కనిపిస్తోది. ఏమయినా ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మల్లాడి దూరంగా ఉండడంతో యానాంలో కొత్త తరానికి తొలిసారిగా కొత్త నేత ఎమ్మెల్యేగా ప్రాతినిద్యం వహించే అవకాశం వచ్చిందనే చెప్పాలి.