తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్ధార్ విజయ రెడ్డి హత్య ఘటన తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో తెలుగు రాష్ట్రాలలోని ఎమ్మెర్వో కార్యాలయాల్లోని సిబ్బందిలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలు తమ పనులు చేయాలంటూ పెట్రోల్ బాటిళ్లతో అధికారుల వద్దకు వెళుతున్నారు. ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుదేమోనని రెవెన్యూ కార్యాలయాల అధికారులు హడలిపోతున్నారు. తమ జాగ్రత్తలో తాము ఉంటున్నారు.
ఇటీవల కర్నూలు జిల్లాలో తహసీల్ధార్ గుమ్మానికి తాడు అడ్డుగా కట్టి ఎవరైనా అక్కడి నుంచే వినతులు ఇవ్వాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు దరఖాస్తులను కిటికిలో నుంచే తీసుకుంటున్నారు. వివిధ పనులపై కార్యాలయానికి వచ్చిన వారిని లోపలికి అనుమతించడం లేదు. ఒకవేళ బాధితులను లోపలికి పిలిస్తే గేటు వద్ద వారిని వీఆర్ఏలు తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు.