Idream media
Idream media
ఏపీలోని తిరుపతి ఉప ఎన్నికపై జరుగుతున్న ప్రచారం, చర్చలు, ప్రస్తుతం వైసీపీ హవాతో పాటు ఆ ఎన్నికపై జరుగుతున్న బెటింగ్ లను పరిశీలిస్తే.. ఓ విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. సాధారణంగా ఎన్నికల్లో బెట్టింగ్ లు ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై జరుగుతుంటాయి. తిరుపతిలో మాత్రం గెలుపు ఏ పార్టీదన్న ప్రశ్నే రావడం లేదు. వైసీపీదేనన్న సమాధానం తప్పా. ద్వితీయ స్థానం కోసం మిగతా పార్టీల పోటీ అన్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, 3 లక్షల నుంచి 4 లక్షల మెజారిటీ లక్ష్యంగా వైసీపీ అధినాయకత్వం బరిలోకి దిగింది. అనంతరం జగన్ వేస్తున్న ఒక్కో అడుగు, స్థానికంగా మారుతున్న సమీకరణాలు వైసీపీకి అంతకు మించే మెజార్టీ ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి.
2014 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా గెలిచిన వైసీపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు 47.84 శాతంతో 5 లక్షల 80 వేల 376 ఓట్లు సాధించి విజయం సాధించారు. బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. కారుమంచి జయరామ్ బీజేపీ తరపున పోటీ చేసి 44.76 శాతంతో మొత్తం 5 లక్షల 42 వేల 951 ఓట్లు సాధించారు. రాష్ట్ర విభజన కారణంగా దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ తరపున చింతా మోహన్ పోటీ చేసి కేవలం 33 వేల 333 ఓట్లు సాధించగలిగారు. కొత్తపల్లి సుబ్రహ్మణ్యం (సిపిఎం) 0.92 శాతంతో 11 వేల 168 ఓట్లు సాధించారు. నోటాకు 2.94 శాతంతో 35 వేల 420 ఓట్లు పడ్డాయి.
2019లో జరిగిన సాధారణ ఎన్నికలల్లో తిరుపతి నుంచి వైసీపీ తరపున బల్లి దుర్గా ప్రసాద్ రావు పోటీ చేసి విజయం సాధించారు. దుర్గా ప్రసాద్ రావు 55.03 శాతంతో ఏడు లక్షల 22 వేల 877 ఓట్లు సాధించారు. ఆయన సమీప అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన పనబాక లక్ష్మపై 2 లక్షల 28 వేల 376 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పనబాక లక్ష్మకి 37.65 శాతంతో 4 లక్షల 94 వేల 501 ఓట్లు పడ్డాయి. నోటాకు 1.96 శాతంతో 25 వేల 781 ఓట్లు రాగా.. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన చింతా మోహన్‌కు 1.84 శాతంతో 24 వేల 39 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి శ్రీహరి రావుకు 1.60 శాతంతో 20 వేల 971 ఓట్లు, బీజేపీ అభ్యర్థి బి. శ్రీహరి రావుకు 1.22 శాతంతో 16 వేల 125 ఓట్లు పడ్డాయి. ఇలా 2014లో వెలగపల్లి వరప్రసాద రావు, 2019లో బల్లి దుర్గాప్రసాద్ రావు వైసీపీ తరపున గెలుపొందారు. దుర్గాప్రసాద్ కు సుమారుగా 2. 28 లక్షల మెజార్టీ వచ్చింది.
అప్పటికి, ఇప్పటికి వైసీపీ హవా పెరిగింది. అన్ని ఎన్నికలలోనూ ఆ పార్టీకి అనుకూలంగా వస్తున్న ఫలితాలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. వైసీపీ విజయం ఖాయమని తెలిసినా, అత్యధిక మెజార్టీ లక్ష్యంగా బరిలోకి దిగింది. అత్యధిక మెజార్టీ లక్ష్యంతోనే పకడ్బందీ టీమ్ ను జగన్ ఏర్పాటు చేశారు. 3 లక్షల నుంచి 4 లక్షల మెజార్టీ సాధించాలని ఆదేశించారు. ఇక్కడ మెజారిటీ జగన్ కోరుకున్న దానికంటే 4 లక్షలపైనే వస్తుందని కొందరు భావిస్తున్నారు. మరికొందరు 4 లక్షలు ఏకంగా 5 లక్షల మెజారిటీ ఖాయమని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరికి తోచినట్టు వారు బెట్టింగులు కూడా కడుతుండడం గమనార్హం. వీటిని గమనిస్తే తిరుపతిలో కాబోయే ఎంపీ ఎవరో ఇట్టే చెప్పేయవచ్చు అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. చివరకు విజయం ఎవరిని వరిస్తుందో, ఎంత మెజారిటీ వస్తుందో చూడాలి మరి.