iDreamPost
android-app
ios-app

ఉప్పెన క్లైమాక్స్ షాక్ ఇస్తుందా

  • Published Jan 18, 2021 | 10:21 AM Updated Updated Jan 18, 2021 | 10:21 AM
ఉప్పెన క్లైమాక్స్ షాక్ ఇస్తుందా

మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ డెబ్యూ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన ఏడాదిగా విడుదల కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. దీని మీద భారీ అంచనాలు లేవు కానీ మ్యూజిక్ బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో నిర్మాతలు కంటెంట్ మీద చాలా నమ్మకంగా ఉన్నారు. ఇటీవలే వదిలిన టీజర్ కూడా ఆకట్టుకునేలా సాగింది. హీరోయిన్ కీర్తి శెట్టి ఇప్పటికే మూడు సినిమాల్లో బుక్ కావడాన్ని బట్టి చూస్తే స్లో పాయిజన్ లాగా ఉప్పెన మెల్లగా ఎలాంటి హైప్ బిల్డప్ చేసుకుంటుందో అర్థమవుతోంది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఉప్పెన క్లైమాక్స్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. విలన్ తన కూతురిని ప్రేమించిన కులం తక్కువ హీరోని చంపకుండా ఇచ్చే చాలా తీవ్రమైన శిక్ష ప్రేక్షకులను షాక్ ఇచ్చేలా ఉంటుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అయినా కూడా ప్రేమ ఎంత గొప్పదో చాటేలా ముగింపుని డిజైన్ చేశారని చెబుతున్నారు. అయితే పారలెల్ గా మరో క్లైమాక్స్ ని కూడా షూట్ చేసి ఉంచారట. సెన్సార్ కు వెళ్లబోయే ముందు టీమ్ మరోసారి లోతుగా చర్చించుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ఇందులో సుకుమార్ తో పాటు ఇద్దరు ముగ్గురు దర్శకులు కూడా ఉంటారని వినికిడి .

ఉప్పెనలో అందరి కళ్ళు విజయ్ సేతుపతి మీదే ఉన్నాయి. ఇటీవలే విడుదలైన మాస్టర్ లో విజయ్ కన్నా ఎక్కువ హైలైట్ అయిన ఇతను ఈ సినిమాలో అంతకు రెట్టింపు విలనిజం పండించాడట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే సొంతం చేసుకుంది. థియేట్రికల్ రిలీజ్ అయ్యాక ఎంత గ్యాప్ లో స్ట్రీమ్ చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. థియేటర్లు తెరుచుకుని సంక్రాంతి సినిమాలతో కళకళలాడుతున్న వేళ ఉప్పెనతో పాటు ఇంకా చాలా సినిమాలు వెయిటింగ్ లో ఉన్నాయి. ఆ వంద శాతం పర్మిషన్లు కూడా వచ్చేస్తే అంతకంటే కావాల్సింది ఏముంది.