iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత బద్వేలు ఉప ఎన్నికల్లో అభ్యర్థిని ప్రకటించి కూడా ఉపసంహరించుకుంది. వేర్వేరు కారణాలను చెప్పినప్పటికీ టీడీపీ మాత్రం పోటీని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదనే సంకేతాలు మాత్రం వెళ్లాయి. ఇప్పుడు ఏపీలో మరోసారి ఎన్నికల హడావిడి మొదలయ్యింది. పలు నగరాలు, పట్టణాల్లో పాలకవర్గాలు లేని చోట ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ లోనే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.
రాజమహేంద్రవరం, నెల్లూరు, శ్రీకాకుళం వంటి మునిసిపల్ కార్పోరేషన్లకు వివిధ కారణాలతో ఎన్నికలు జరగలేదు. వాటితో పాటుగా పలు మునిసిపాలిటీలు, నగర పంచాయితీ ఎన్నికలు కూడా పెండింగులో ఉండిపోయాయి. గ్రామాల విలీనం, కోర్టుల వివాదాలు సహా పలు కారణాలతో ఎన్నికలు జరగలేదు. అయితే ఇప్పుడు వాటన్నింటినీ పరిష్కరించి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు సన్నధ్ధం కావడంతో టీడీపీ పరిస్థితి ఏమిటన్నది సందిగ్ధంగా మారింది.
రాజమహేంద్రవరం కార్పోరేషన్ లో ఇప్పటి వరకూ మూడు సార్లు ఎన్నికలు జరిగితే మూడు సార్లు టీడీపీదే విజయం. దాంతో ఈసారి కూడా మరోసారి జయకేతనం ఎగురవేయాలని టీడీపీ ఆశిస్తోంది. నెల్లూరు, శ్రీకాకుళం కూడా గెలుచుకోవాలని స్థానిక టీడీపీ నేతల భావన. కానీ ఆపార్టీ అధిష్టానం మాత్రం ఢోలాయమానంలో ఉంది. సందిగ్ధంలో కనిపిస్తోంది. ఈ ఎన్నికలను ఢీకొట్టడం ఎలా అన్నది టీడీపీ అధినేతలకు అంతుబట్టడం లేదు. ఇప్పటికీ ప్రజల్లో జగన్ పట్ల ప్రజాదరణ తగ్గలేదని అంతర్గతంగా అంగీకరించే సత్యం. పైకి ప్రజా వ్యతిరేకత పెరిగినట్టు కనిపిస్తున్నా ఓట్లు మాత్రం వైఎస్సార్సీపీకే వేస్తున్నారని భావిస్తోంది. ఇలాంటి సమయంలో బరిలో దిగి చేతులు కాల్చుకోవడమా లేక ఇప్పటికే అనుసరిస్తున్నట్టుగా బహిష్కరించడమా అన్నది టీడీపీ తేల్చుకోలేకపోతోంది.
టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పోటీలో ఉండేందుకు పలువురు స్థానిక నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు పిలుపుని బేఖాతరు చేస్తూ పలువురు పోటీ పడిన పరిస్థితి చూశాము. ఇప్పుడు కూడా అలా జరిగితే ఇక టీడీపీ అధినేత మాటకు విలువ ఉండదనే అభిప్రాయం వినిపిస్తోంది. దాంతో ఎన్నికలను బహిష్కరించాలనే నిర్ణయం తీసుకోవడానికి సంశయిస్తున్నారు. కానీ నిజంగా బరిలో దిగితే ఫలితాలు పేలవంగా ఉంటాయనే ఆందోళన మాత్రం వారిని వెంటాడుతోంది. వరుస ఎన్నికల్లో ఓటముల మూలంగా టీడీపీ పరువు పలుచన అవుతోందనే కలవరం కనిపిస్తోంది. దాంతో తెలుగుదేశం నేతల్లో మునిసిపల్ పోరు మరోసారి కలవరం కలిగిస్తుందనడంలో సందేహం లేదు.
Also Read : CBN Delhi Tour Alliance -బాబు ఢిల్లీలో పొత్తుల ప్రస్తావన ఎందుకు తెచ్చినట్లు?