iDreamPost
android-app
ios-app

బాబు వయసుకు పాదయాత్ర అవసరమా? 

  • Published Oct 04, 2021 | 1:23 PM Updated Updated Oct 04, 2021 | 1:23 PM
బాబు వయసుకు పాదయాత్ర అవసరమా? 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి పాదయాత్రకు సిద్ధం అవుతున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సోషల్ మీడియా వార్తల్లో నిజం ఎంతో, అబద్దం ఎంతో చెప్పలేం. ఆ మాటకొస్తే సోషల్ మీడియాను ప్రామాణికంగా కూడా తీసుకోలేం. అలా అని పూర్తిగా కొట్టిపారేయనూ లేం. 

ప్రింటు, మరియు ఎలెక్ట్రానిక్ మీడియా పూర్తిగా వైఫల్యం చెందడంతో ఇప్పుడు సోషల్ మీడియా పాత్ర పెరిగింది. మీడియాకు రాజకీయ, వ్యాపార అవసరాలే ప్రామాణికం అయ్యాయి. వార్తలు ఆమేరకు వండి వార్చడం మొదలయింది. ప్రతి మీడియా, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో, అందునా మరీ ప్రత్యేకించి ఆంధ్ర ప్రదేశ్ లో మీడియా రాజకీయ వ్యాపారం చేస్తోంది.  మీడియాలో వచ్చే ప్రతి వార్తా ఆయా మీడియా రాజకీయ అవసరాల కోసం వండి వార్చేదే కావడంతో మీడియా తన విశ్వసనీయత కోల్పోయింది. 

ఇక అసలు విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేయాలని ఆలోచిస్తున్నట్టు సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. ఈ సోషల్ మీడియా వార్తను ప్రధాన మీడియాకానీ, టీడీపీ కానీ ధృవీకరించనూ లేదు, ఖండించనూ లేదు. టీడీపీ వర్గాలు కూడా  ఈ వార్తపై  స్పందించలేదు. అందువల్ల చంద్రబాబు పాదయాత్ర అనేది ప్రస్తుతానికి ఓ ఊహా జనితమైన కథనం అనే భావించాలి. అయితే, ఒకవేళ చంద్రబాబు నిజంగానే  పాదయాత్రకు సిద్ధం అయితే మాత్రం దాని అవసరం, పరిణామాలు చర్చించుకోవడంలో తప్పులేదు. 

Also Read : అదే జరిగితే ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుంద

వాస్తవానికి ఓ మహా పాదయాత్ర తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అత్యధికంగా 3,648 కిలోమీటర్లు నడిచి రికార్డు సొంతం చేసుకున్నారు. మొత్తం 125 శాసనసభా నియోజకవర్గాలు 430 రోజులపాటు కాలినడకన తిరిగి అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకున్నారు. విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా పంచాయతీ ఎన్నికల్లో, తిరిగి మున్సిపల్ ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. 

ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయ పరంపరను ఎదుర్కోవాలంటే చంద్రబాబుకు పాదయాత్ర తప్పక పోవచ్చు. లేదా అంతకు మించి ఏదైనా ఓ ప్రత్యేక రాజకీయ ఉద్యమం అవసరం. అయితే పాదయాత్రకు చంద్రబాబు వయసు అనుకూలిస్తుందా అన్నదే ప్రధాన ప్రశ్న. ఏడు పదుల వయసులో ఉన్న చంద్రబాబు ఇప్పుడు పాదయాత్ర పేరుతో రాష్ట్రం కలియతిరగడం సాధ్యం కాకపోవచ్చు. ప్రస్తుతం కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు. ఈ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు విస్తృతంగా జనాన్ని కలుసుకోవడం ఆయన వయసు, ఆరోగ్య రీత్యా మంచిది కాదు. 

Also Read : బద్వేల్ ఉప ఎన్నిక టీడీపీ, జ‌న‌సేన ఔట్ : నిజంగా సానుభూతేనా? లేక ఈ కార‌ణాలున్నాయా?

పాదయాత్రలో కలిసే జనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో తెలియదు. అలాగే వారిలో ఎలాంటివారు ఉంటారో చెప్పలేం. ఇటువంటి పరిస్థితుల్లో జనంలోకి వెళ్ళడం ఏడుపదులు దాటిన చంద్రబాబుకు సముచితం కాదు. అలా అని పాదయాత్రలో ప్రజల్ని కలుసుకోకుండా ఉండడం ఆచరణీయం కాదు. ప్రజల్ని కలుసుకోకుండా తనదారిన తాను నడుచుకుంటూ వెళితే ఆశించిన ప్రయోజనం దొరకదు. 

ఇక మరో ముఖ్యమైన విషయం ఏమంటే చంద్రబాబు పాదయాత్ర చేపడితే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి సృష్టించిన రికార్డును అధిగమించాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి 3,468 కిలోమీటర్లు నడిచారు. అందువల్ల చంద్రబాబు ఎట్టిపరిస్థితుల్లోనూ కనీసం మరో రెండు కిలలోమీటర్ల దూరం అయినా నడవాల్సి ఉంటుంది. అంటే 3,470 కిలోమీటర్లు అయినా నడవాల్సి ఉంటుంది. ఇంత దూరం ఈ వయసులో సాధ్యమేనా అనే ప్రశ్న చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా వేసుకోవాలి. 

ఇవన్నీ చూసినప్పుడు అధికారంలోకి రావాలనుకున్న చంద్రబాబు పాదయాత్ర చేయడం అభిలషణీయం, సమర్ధనీయం కూడా కాదు.

Also Read : టీడీపీ నేతలకు కొత్త తలనొప్పి, సీట్ల మార్పు మీద కుస్తీ

అందువల్ల ఆయన చూసుకోవాల్సింది మిగిలిన రెండో మార్గం. అదే రాజకీయ ఉద్యమం. ఏదైనా ఓ అంశం తీసుకుని చంద్రబాబు తన అనుచరగణంతో ఉద్యమం చేపట్టడమే ఇప్పుడు చంద్రబాబుకు ఉన్న సరైన మార్గం. అయితే కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వివిధ పధకాల పేరుతో ప్రజల ఖాతాల్లో నగదు వేస్తున్న ఈ తరుణంలో ఎలాంటి ఉద్యమాన్ని జనం ఆదరించకపోవచ్చు. అటువంటి సంకేతాలు ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ద్వారా వచ్చాయి. అందువల్ల ఇలాంటి ప్రయత్నం కూడా అభిలషణీయమే అయినా ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. 

ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మిగిలిన ఏకైక మార్గం తన పాత మిత్రులతో పొత్తు పెట్టుకుని, తన పార్టీ కేడర్ మనోధైర్యం దెబ్బతినకుండా 2024 వరకూ కాపాడుకోవడమే. ఈ దిశగా చంద్రబాబు తన ప్రయత్నాలను ఇప్పటికే మొదలు పెట్టారు. చంద్రబాబు, ఆయన అనుచరగణం మొత్తం మళ్ళీ జనసేనను అక్కునజేర్చుకుని కలిసి నడవాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ ప్రయత్నాలనైనా చిత్తశుద్ధితో బహిరంగంగా కొనసాగిస్తే కొంతమేర రాజకీయ లబ్దిచేరే అవకాశం ఉంది. లేదంటే చంద్రబాబు రాజకీయ పునరుద్ధాన ఆలోచనలు కట్టిపెట్టి ఆ ఆశలు వదులుకోవాల్సిందే.  అలా కాదని తనదగ్గర ఏదో వ్యూహం ఉందనో, తనకు వ్యవస్థలతో బంధం ఉందనో అడుగులు ముందుకు వేస్తే అన్ని వృధా ప్రయాసే.

Also Read : కాకినాడ మేయర్‌పై రేపే అవిశ్వాసం.. క్యాంపులో కార్పొరేటర్లు