iDreamPost
android-app
ios-app

విదేశాల్లో షూటింగులు సాధ్యమేనా

  • Published Aug 17, 2020 | 7:46 AM Updated Updated Aug 17, 2020 | 7:46 AM
విదేశాల్లో షూటింగులు సాధ్యమేనా

సృజనాత్మకతకు హద్దులు లేనప్పుడే దర్శకరచయితలకు పూర్తి స్వేచ్ఛ దొరికి తమ ఆలోచనలను అద్భుతాలుగా తెరమీద చూపిస్తారు. దానికి దేశాల బౌండరీలు ఉండకూడదు. ఇండియానా అమెరికానా లేక దుబాయా అనే లెక్కలు వీటికి అతీతంగా సాగుతాయి. సబ్జెక్టు డిమాండ్ చేసినప్పుడు ఎంత దూరమైనా వెళ్లాల్సిందే తప్పదు. జంధ్యాల గారి కల్ట్ క్లాసిక్ ‘పడమటి సంధ్యారాగం’ని యుఎస్ లో కాకుండా ఇక్కడే జరిగినట్టు చూపడం సాధ్యమేనా. మహేష్ బాబు మహర్షిలో కనెక్ట్ అయిన పాయింటే కథానాయకుడు బయటి నుంచి రావడం. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. స్టార్ హీరోల చిత్రాలలో ఖరీదైన ఫారిన్ లొకేషన్ సాంగ్స్ లేకపోతే అభిమానులు ఎంత వెలితిగా ఫీలవుతారో వేరే చెప్పాలా.

కానీ ఇప్పుడు సీన్ వేరు. అంతర్జాతీయ ప్రయాణాలు మొదలైనప్పటికీ కరోనా భయాలు ఇంకా తొలగిపోలేదు. ఏదో న్యూజిల్యాండ్ లాంటి ఒకటి రెండు కంట్రీస్ మినహా ఎక్కడా వైరస్ పూర్తిగా కనుమరుగు కాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు సినిమాల విషయానికి వస్తే ఇకపై వ్యవహారం అంత ఈజీగా ఉండేలా కనిపించడం లేదు. ప్రభాస్ రాధే శ్యామ్, నితిన్ రంగ్ దే, మహేష్ సర్కారు వారి పాట ఇలా ఎన్నో సినిమాలు కథ ప్రకారమే విదేశాల్లో షూట్ చేసుకోవాల్సి ఉన్నవి. వ్యాక్సిన్ ఇంకా రాని కారణంగా ఎదురు చూస్తున్నాయి. మరోవైపు సెట్ పైకి వెళ్లాల్సిన కొత్త చిత్రాలు కూడా స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఇండియా బయటికి వెళ్లాల్సి ఉంటుంది.

ఇంతకు ముందు క్యాస్ట్ అండ్ క్రూని నిర్మాత బడ్జెట్ కు తగ్గట్టు అవసరమైనంత మేర తీసుకుని వెళ్లే వాళ్ళు. ఇప్పుడు ఇందులో కోత విధించుకొక తప్పదు. మరోవైపు రెండు మూడు బాలీవుడ్ యూనిట్లు ఇప్పటికే తగినంత జాగ్రత్తలతో షూటింగులను చేసుకునేందుకు దూరదేశాలకు వెళ్లిపోయాయి. కానీ టాలీవుడ్లోనే ఇంకా అడుగులు పడలేదు. ఏ దేశం వెళ్లినా అక్కడి నిబంధనలకు తగ్గట్టు రెండు వారాల క్వారెంటైన్ పాటించాలి. అలా చేస్తే నిర్మాతకు 14 రోజుల యూనిట్ సభ్యులందరి అదనపు వ్యయం అక్కడి స్టే రూపంలో పడుతుంది. అది వేలల్లో ఉండదు. లక్షలు దాటేస్తుంది.అందుకే ఈ విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఇప్పటికే కొందరు డైరెక్టర్లు స్క్రిప్ట్ లో మార్పులు చేసుకుని ఇక్కడే షూట్ చేసేలా ప్లానింగ్ లో ఉన్నారు. అలా చేసే అవకాశం లేని వారు మాత్రం ఎప్పుడు ఈ గండం నుంచి బయటపడతామా అని ఎదురుచూస్తున్నారు.