మజిలీ బ్లాక్ బస్టర్ కావడంలో తన భాగమే ఎక్కువగా ఉన్నా ఆ తర్వాత సినిమాలను ఆచి తూచి చేస్తున్న సమంతా ఓ బేబీతో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుని పెళ్లయ్యాక కూడా తన రేంజ్ ఏమిటో ఋజువు చేస్తూనే ఉంది. ఇదిలా ఉండగా జాంబీ రెడ్డి సీక్వెల్ లో సామ్ చేయొచ్చనే వార్త గత కొద్దిరోజులుగా ప్రచారంలో ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా ఓ ఇంటర్వ్యూలో ఆల్రెడీ కథను చెప్పినట్టుగా వివరించాడు. రివెంజ్ అఫ్ డెత్ పేరుతో రెండో పార్ట్ ఉంటుందని జాంబీ రెడ్డి ఎండింగ్ కార్డులో వేశారు. అయితే ఇప్పుడు పరిణామాలు దానికి అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది అంతు చిక్కడం లేదు.
మొదటి రెండు మూడు రోజులు కమర్షియల్ గా బాగానే రాబట్టుకున్న జాంబీ రెడ్డి ఫైనల్ గా హిట్ మార్కును అందుకోలేదనే ఒక అభిప్రాయం ట్రేడ్ లో ఉంది. మరీ ఎక్కువ నష్టం రాకుండా డబ్బులు వచ్చి ఉండొచ్చేమో కానీ అది ఆశించిన స్థాయిలో వెళ్లలేదనేది వాళ్ళ వెర్షన్. అందులో నిజం లేకపోలేదు. రెండో వారంలోకి ప్రవేశించకుండానే జాంబీ రెడ్డి బాగా స్లో అయిపోయింది. చాలా ఏరియాలలో డెఫిషిట్లు కూడా పడ్డాయి. హీరో తేజ సజ్జకు కలిగే ప్రయోజనం పెద్దగా కనిపించడం లేదు. మరి ఇలాంటి ఫలితం చూశాక సమంతా ఎస్ చెబుతుందా అంటే ఏమో మరి ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకుంటుందేమో
సమంతా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన ది ఫ్యామిలీ 2 ఎట్టకేలకు తీవ్ర నిరాశను మిగులుస్తూ ఏకంగా వేసవికి వాయిదా పడింది. అందులోనూ ప్రైమ్ ఇంకా ఖచ్చితమైన డేట్ చెప్పలేదు. మరోవైపు ఆహా ఎంతో అట్టహాసంగా చేసిన సామ్ జామ్ సెలబ్రిటీ టాక్ షోకు రెస్పాన్స్ కూడా పెద్దగా రాలేదు. ఈ నేపథ్యంలో సామ్ కు మరో కిక్కిచ్చే సక్సెస్ కావాలి. ప్రస్తుతం విజయ్ సేతుపతి నయనతార కాంబోలో చేస్తున్న ఓ బై లింగ్వల్ మూవీ మీద చాలా నమ్మకంతో ఉంది. అన్నిటికన్నా ఎక్కువగా సామ్ టైటిల్ రోల్ చేయబోతున్న శాకుంతలం మీద కూడా అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. గుణశేఖర్ దర్శకుడిగా అతిత్వరలో ఇది రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది