తోట త్రిమూర్తులు వంటి శక్తి వంతమైన నాయకుడు పార్టీని వీడాక రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పూర్తిగా చతికిలపడింది. అయనతో పాటు దాదాపు క్రియాశీలకమైన నాయకులు వెళ్లిపోవడంతో అక్కడ పార్టీని నడిపించే నాథుడు కరువయ్యాడు. ఈ పరిస్థితిని అధిగమించడానికి కొత్తపేట నియోజకవర్గ నాయకుడు, శాసనమండలి మాజీ డెప్యూటి ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం (ఆర్ ఎస్)ను చంద్రబాబు అక్కడ పార్టీ ఇన్ఛార్జిగా నియమించారు.
శెట్టిబలిజ, కాపు సామాజిక వర్గాల ఓట్ల అధారంగా గెలుపు ఓటములు నిర్ణయమయ్యే రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు వారికే సీట్లు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. గత 25 సంవత్సరాలుగా ఇక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు నడుమ జరిగిన ఎన్నికల పోరాటాలే ఇందుకు నిదర్శనం. ప్రధాన పార్టీలు తమ నాయకుడికి టిక్కెట్టు ఇవ్వలేదన్న కోపంతో ఎక్కువ సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిపించిన చరిత్ర ఈ నియోజకవర్గ ఓటర్లది.
Also Read:పోలవరం పనులు జరగటం లేదా?కళ్ళు తెరిచి చూడండి దేవినేని ఉమా గారు..
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
2012లో పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోసం వెతుకులాడ వలసిన పరిస్థితి ఏర్పడింది. తోట త్రిమూర్తులు కాంగ్రెస్ తరఫున, పిల్లి బోస్ వైఎస్సార్ సీపీ నుంచి బరిలో ఉండగా టీడీపీ నుంచి తాళ్లరేవులో పలుసార్లు గెలిచిన చిక్కాల రామచంద్రరావును చంద్రబాబు పోటీకి నిలిపారు. చిక్కాలకు నియోజకవర్గంలో ఏ మాత్రం పట్టులేకపోయినా కాపు సామాజికవర్గంలో పెద్ద నాయకుడు అనే ఉద్దేశంతో బాబు అయనతో ప్రయోగం చేశారు. ఆదికాస్తా వికటించి చిక్కాల ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదురై పక్క నియోజకవర్గం నుంచి ఆర్ఎస్ ను దిగుమతి చేసుకున్నారు. అయితే ఈసారి శెట్టిబలిజ సామాజిక వర్గం నుంచి నేతను తీసుకురావడం గమనార్హం. ఇన్నాళ్ళూ వివిధ పార్టీల్లో కొనసాగిన నియోజకవర్గంలోని దిగ్గజ నాయకులైన పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు, సిట్ట్ంగ్ ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వైఎస్సార్ కాంగ్రెసులో ఉండడంతో టీడీపీకి ఈ దుస్థితి దాపురించింది.
ఆర్ఎస్ నెగ్గుకు రాగలరా?
ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్న ఆర్ఎస్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. కార్యకర్తలను, పార్టీ అభిమానులను కలుస్తున్నారు. కొత్తపేట నుంచి రామచంద్రపురానికి తన మకాం కూడా మార్చి తాను అందరికీ అందుబాటులో ఉంటాననే సందేశాన్ని కార్యకర్తలకు పంపే యత్నం చేశారు. సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీని సమాయత్తం చేసే పనిలో పడ్డారు. అయితే పాతికేళ్లగా పార్టీ ఏదైనా ముఖాముఖీ తలబడిన ప్రముఖ నేతలు ఇద్దరూ ఓకే పార్టీలో ఉండడం, తమ వారసులను రాజకీయ అరంగేట్రం చేయిస్తారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ పరిస్థితిని ఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం. టీడీపీ నుంచి స్థానికేతరుడైన చిక్కాలకు సాధ్యం కానీ విజయం రెడ్డి సుబ్రమణ్యంకు దక్కుతుందా..? చూడాలి.
Also Read : శ్రీకాకుళం టీడీపీకి నాయకుడే లేడా?