iDreamPost
iDreamPost
థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు కాని మల్టీ ప్లెక్స్ యాజమాన్యాలు మాత్రం తాము భవిషత్తులో ఏర్పాటు చేయబోయే సీటింగ్ ప్లాన్స్, అమలు చేయబోయే నిబంధనలతో ఒక ప్రతిపాదనను ఇప్పటికే ప్రభుత్వ వర్గాలకు అందజేశాయి. వీటి మీద ఇప్పటికిప్పుడు నిర్ణయం వెలువడే అవకాశం లేదు కాని అమలులోకి వచ్చాక పాటించడం ఖాయం. సీట్ల మధ్య గ్యాప్, సింగల్ గా వచ్చిన వాళ్ళకు కార్నర్ సీట్స్ ని కేటాయించడం, వాష్ రూమ్స్ లోనూ జాగ్రత్తలు తీసుకోవడం, శానిటైజేషన్, మెడికల్ కిట్స్, స్క్రీనింగ్ వసతులు లాంటివి చాలానే అందులో పొందుపరిచారు.
ఇంతా చేసి పాత ధరలకే టికెట్లు అమ్మడం నిర్వహణ భారాన్ని విపరీతంగా పెంచేస్తుంది. పోనీ పెంచి అమ్ముదామా అంటే జనం రాకపోయే ప్రమాదం ఉంది. స్టార్ హీరోల సినిమాలకు ఓకే కాని మీడియం రేంజ్ మరియు చిన్న సినిమాలకు ఇది ప్రాణంతకమైన చర్యే. ఇవన్ని సింగల్ స్క్రీన్లలో అంత సులభంగా చేయగలిగేవి కావు. ఇప్పటికే తీవ్ర నష్టాల పాలైన వాళ్ళు ఇంత భారం మోయడం అనుమానమే. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ సినిమా హాళ్ళు ఎప్పుడు మొదలైనా మొదటి రెండు మూడు నెలలు చాలా సవాళ్ళు ఎదురుకోవాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు అద్భుతాలు జరగకపోవచ్చు. అంతో ఇంతో క్రేజ్ ఉన్న సినిమాల నిర్మాతలు కూడా ఆచి తూచి విడుదల తేదీలు నిర్ణయించుకుంటారు. తొందరపడే ఉద్దేశం ఎవరికీ లేదు.
అలాంటప్పుడు తొలిరోజుల్లో వచ్చే చిన్నా చితక చిత్రాలతో అదంతా ఒకరకమైన ప్రయోగ దశలా ఉంటుంది. లాక్ డౌన్ సడలించాక జనం యధావిదిగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. పనుల మీద తిరుగుతున్నారు. ఆఫీసులకు వెళ్తున్నారు. జూన్ నుంచి ఇంకాస్త ఫ్రీడం దొరుకుతుంది. అప్పటికి కరోనా కేసులు గణనీయంగా తగ్గిపోతే ప్రభుత్వాలు అనుకూల నిర్ణయాలు తీసుకుంటాయి. ఇప్పటికైతే దేశవ్యాప్తంగా నెంబర్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఈ నేపధ్యంలో ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయో ఊహించడం కూడా కష్టమే. సినిమా పుట్టినప్పటికీ నుంచి ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితి కావడంతో తలలు పండిన మేధావులు సైతం మౌనంగా ఉండటం తప్ప ఏమి చెప్పలేకపోతున్నారు.