iDreamPost
android-app
ios-app

ముత్యాలనాయుడు నిరీక్షణ ఫలించేనా?

  • Published Oct 07, 2021 | 7:14 AM Updated Updated Oct 07, 2021 | 7:14 AM
ముత్యాలనాయుడు నిరీక్షణ ఫలించేనా?

తనను నమ్ముకున్న వారికి, కష్టకాలంలో పార్టీ వెంట ఉన్నవారికి తగిన గుర్తింపు ఇవ్వడంలో సీఎం జగన్ కు ఎవరూ సాటిరారని గత రెండున్నరేళ్లలో పలుమార్లు రుజువైంది. అదే క్రమంలో మంత్రి పదవుల్లోనూ అర్హులైన వారికి అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడే ప్రకటించారు. రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించి మరికొందరికి అవకాశం ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది.

కేబినెట్ మార్పులు త్వరలో జరుగుతాయన్న ప్రచారం వైఎస్సార్సీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో అవకాశం దక్కకపోయినా అధినేతపై నమ్మకంతో ఎదురుచూస్తున్న అనేకమంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అటువంటి వారిలో విశాఖ జిల్లాకు చెందిన మాడుగుల ఎమ్మెల్యే బుడి ముత్యాలనాయుడు ఒకరు. ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా ఉన్న ఆయన ఆవిర్భావం నుంచీ పార్టీలోనే కొనసాగుతూ జగన్ వెంటే నిలిచారు. సామాజిక సమీకరణాలు కలిసి వస్తే ఆయనకు ఈసారి మంత్రి యోగం పడుతుందన్న ప్రచారం జరుగుతోంది.

కష్టకాలంలో పార్టీ వెంటే..

కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన ముత్యాలనాయుడు ఏలేరు రిజర్వాయర్ నీటిని విశాఖ నగరానికి తరలించడానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో చురుగ్గా పాల్గొని కీలక పాత్ర పోషించారు. ఆ ఉద్యమం ద్వారానే విశాఖ గ్రామీణ ప్రాంతాల్లో మంచి గుర్తింపు పొందారు. ఈ ప్రాంత చెరుకు రైతుల సమస్యలపై పోరాటాలు చేసిన ఆయన వైఎస్సార్సీపీ ఏర్పడిన వెంటనే ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నిలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు.

Also Read : గుత్తా కోరిక నెర‌వేరేదెన్న‌డో..?

అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రలోభాలకు లొంగి పాడేరు, అరకు ఎమ్మెల్యేలు గడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావులు ఆ పార్టీలోకి జంప్ చేసినా ముత్యాలనాయుడు మాత్రం పార్టీ వెన్నంటి నిలిచి తన నిబద్ధత నిరూపించుకున్నారు. 2019 ఎన్నికల్లో మళ్లీ మాడుగుల నుంచే పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. పార్టీ కూడా అధికారంలోకి రావడంతో బూడికి మంత్రివర్గంలో విశాఖ జిల్లా నుంచి ప్రాతినిథ్యం లభిస్తుందనుకున్నారు. కానీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు పార్టీలో చేరిక సందర్బంగా ఇచ్చిన మాట ప్రకారం ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది. దాంతో ముత్యాలనాయుడుకు విప్ పదవి ఇచ్చారు.

ఈసారి లభిస్తుందా..

మంత్రి పదవి రాకపోయినా ఏమాత్రం నిరాశ పడకుండా ప్రజాప్రతినిధిగా బూడి నియోజకవర్గంలో నిరంతరం పర్యటిస్తూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూస్తున్నారు. ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించి వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయంలో కీలకపాత్ర పోషించారు. సీఎం జగన్ కు కూడా ముత్యాలనాయుడుపై మంచి అభిమానం ఉంది. ఈ పరిస్థితుల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే విశాఖ జిల్లా నుంచి బూడికి స్థానం లభించవచ్చంటున్నారు.

అయితే అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ కూడా మంత్రి పదవి రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా మొదటి నుంచి పార్టీలో ఉన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంచి వక్త.. ప్రతిపక్షాల ఆరోపణలను గట్టిగా తిప్పికొడుతుంటారు. సీఎం జగన్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. జిల్లాలో ప్రధాన సామాజిక వర్గాలైన కాపు, వెలమల్లో ఒకరికి పదవి ఇవ్వాల్సి ఉంది. మంత్రి ముత్తంశెట్టి కాపు సామాజికవర్గానికి చెందిన వారైనందున ఈ సారి వెలమలకు ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. అదే నిజమైతే బూడి ముత్యాలనాయుడుకు.. లేదు మళ్లీ కాపులకు ఇవ్వాలనుకుంటే అమరనాథ్ కు పదవి దక్కే అవకాశం ఉంది.

Also Read : సునీల్ – మూడు ఎన్నికలు మూడు పార్టీలు , అయినా ఎందుకు గెలవలేకపోయాడు?