iDreamPost
iDreamPost
ఎప్పుడు లేనంత వేగంగా ఓటిటి ప్రపంచంలో కదలికలు ఉంటున్నాయి. లాక్ డౌన్ వల్ల వీటికి ప్రేక్షకులు విపరీతంగా అలవాటు పడటంతో అన్ని సంస్థలు బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా మరీ భారీ ప్రాజెక్టులకు సిద్ధపడుతున్నాయి. స్టార్ హీరోలు డైరెక్టర్లు సైతం ఇది సేఫ్ కావడంతో వాటి మీద పెద్ద కన్నే వేస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఆహా యాప్ కోసం అల్లు అరవింద్ మెగాస్టార్ చిరంజీవితో భారీ వెబ్ సిరీస్ ప్లాన్ చేయబోతున్నారన్న వార్త జోరుగా షికారు చేస్తోంది. సుమారు 45 ఎపిసోడ్ల దాకా సాగే ఈ ప్రాజెక్ట్ లో అభిమానులకే కాదు సాధారణ ప్రేక్షకులను సైతం థ్రిల్ కు గురిచేసే అంశాలు ఎన్నో ఉంటాయట. కాకపోతే ఏ జానర్ ఎలాంటి కాన్సెప్ట్ తో రూపొందవచ్చు అనే దాని గురించి ఎలాంటి లీకులు బయటకి రావడం లేదు. చర్చలు జరుగుతున్నట్టు మాత్రం తెలిసింది.
అయితే చిరు నిజంగా దీని గురించి ఆలోచన చేస్తున్నారా లేక ఇది వట్టి పుకారా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే గతంలో ఈయన చేసిన బుల్లితెర ప్రయత్నం ఆశించినంత గొప్ప ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. మీలో ఎవరు కోటీశ్వరుడు యాంకర్ గా మరీ అద్భుతాలు చేయలేకపోయారు చిరు. నాగార్జునతో వచ్చిన పోలిక కొంతమేర మైనస్ కూడా అయ్యింది. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 విడుదల కావడం బ్లాక్ బస్టర్ కావడం చకచకా జరిగిపోయాయి. వెండితెర వేల్పుగా తన స్థానం చెక్కుచెదరలేదని అర్థమయ్యింది. అలాంటప్పుడు ఇలా వెబ్ సిరీస్ లు చేయడం అంటే కొంతవరకు రిస్కే. ఎందుకంటే ఇప్పటిదాకా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా చిరు స్థాయి స్టార్లు ఎవరూ వెబ్ సిరీస్ లలో నటించలేదు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, విజయ్ లు యాంకర్లుగా చేశారు కానీ వేరే ఆలోచనలు చేయలేదు.
చిరంజీవి ఇమేజ్ కి ఇలా ఎపిసోడ్ల వారీగా జరిగే కథలో కనిపిస్తే ఎంత మేరకు ఫ్యాన్స్ పాజిటివ్ గా తీసుకుంటారనేది చెప్పలేం. జగపతిబాబు, శ్రీకాంత్, వరుణ్ సందేశ్, నవదీప్, అమల, వరలక్ష్మి శరత్ కుమార్ లాంటి ఎందరో చిన్నా మీడియం రేంజ్ ఆర్టిస్టులు ఇందులోకి రావడంలో ఆశ్చర్యం లేదు కానీ ఒకవేళ నిజంగా చిరంజీవి లాంటి స్థాయి ఉన్న హీరో వస్తే మాత్రం అదో సెన్సేషన్ అవుతుంది. కాకపోతే ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో గంటల తరబడి షూటింగ్ చేయాల్సిన వెబ్ సిరీస్ లకు వయసు దృష్ట్యా సీనియర్ హీరోలు అంత ఈజీగా సర్దుకునే అవకాశాలు తక్కువే. లోకల్ ట్యాగ్ ని వాడుకుని ఆహాని గట్టిగా నిలబెట్టాలని చూస్తున్న అల్లు అరవింద్ ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. అందుకే మలయాళం డబ్బింగులుతో మొదలుకుని విడుదల ఆగిపోయిన సినిమాల దాకా అన్నీ వదులుతున్నారు.