iDreamPost
iDreamPost
రానున్న వేసవిలో భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో మాస్ మహారాజా రవితేజ ఖిలాడీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. జనవరిలో క్రాక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మంచి ఊపుమీదున్న మార్కెట్ వల్ల దీనికి మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. మే 28 రిలీజ్ ని గతంలోనే ప్రకటించేశారు. అదే రోజు బాలకృష్ణ బోయపాటి శీను కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ కూడా లాక్ అయ్యింది. ఇద్దరూ డ్రాప్ అయ్యే పరిస్థితి ప్రస్తుతానికి కనిపించడం లేదు కానీ కొన్ని అనూహ్య పరిణామాలు మాత్రం కొత్త అనుమానాలు తలెత్తేలా చేస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాల రిలీజుల మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఆ కోవలో ఖిలాడీ చేరే అవకాశం కొట్టిపారేయలేం.
ప్రస్తుతం ఇటలీలో ఉన్న ఖిలాడీ యూనిట్ కి అక్కడ పెరుగుతున్న కరోనా కేసులు టెన్షన్ కలిగిస్తున్నాయి. అక్కడ తిరిగి ఆంక్షలు విధించడంతో పబ్లిక్ గా షూటింగ్ చేసుకునే వెసులుబాటు లేకుండా పోయింది. దీని వల్ల షెడ్యూల్ ని అక్కడి నుంచి షిఫ్ట్ చేయడమా లేక కుదురుకున్నాక మళ్ళీ కొనసాగించడమా అనే చర్చల్లో టీమ్ ఉంది. గతంలో రంగ్ దే కు ఇలాంటి సమస్యే వస్తే దుబాయ్ కి మార్చుకుని అక్కడికి అనుగుణంగా కథలో చిన్న చిన్న మార్పులు చేశారు. దాని వల్ల జరిగిన నష్టమేమి లేదు. అందుకే ఖిలాడీ కూడా అదే రూట్లో వెళ్లే ఛాన్స్ లేకపోలేదు. కాకపోతే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఖిలాడీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఆకర్షణగా నిలుస్తోంది. ఆ మధ్య వదిలిన టీజర్ ఆసక్తిని పెంచింది. ఇందులో డ్యూయల్ షేడ్స్ లో రవితేజ కనిపించనున్నారు. రెండు పాత్రలా లేక డబుల్ యాక్షనా అనేది సస్పెన్సుగా ఉంచుతున్నారు. దీని తర్వాత త్రినాధరావు డైరెక్షన్ లో చేయబోయే యాక్షన్ ఎంటర్ టైనర్ రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తుంది. ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కూడా. నాలుగు డిజాస్టర్ల తర్వాత రవితేజ ఈ స్థాయిలో కంబ్యాక్ అవ్వడం కన్నా అభిమానులు కోరుకునేది ఏముంటుంది. కాకపోతే ఇప్పుడీ ఖిలాడీ తాలూకు న్యూస్ నిజం కాకూడదని కోరుకుంటున్నారు