iDreamPost
android-app
ios-app

చంద్రబాబు సమస్యలను జమిలి ఎన్నికలు తీరుస్తాయా?

చంద్రబాబు సమస్యలను జమిలి ఎన్నికలు తీరుస్తాయా?

మొన్న జరిగిన ఎన్నికల్లో తను ఓడిపోతానని అసలు ఊహించని చంద్రబాబు దారుణ పరాజయం ఎదురవడంతో షాక్ తిన్నాడు. బొటాబొటిగా ప్రతిపక్ష హోదా దక్కినా ఒకరివెంట మరొకరుగా కొందరు ఎమ్మెల్యేలు, మరికొంతమంది నాయకులు పార్టీ వీడిపోవడం, అమరావతి పోరాటానికి బొత్తిగా ప్రజా స్పందన లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉండగా పులిమీద పుట్రలా వచ్చిన కరోనా ఆయనను పూర్తిగా ఇంటికే పరిమితం చేసింది. పార్టీ శ్రేణులలో జూమ్ యాప్ ద్వారా ఉత్సాహం నింపి పోరాటాలకు కార్యకర్తలను సమాయత్తం చేయాలనుకున్నా వారు కూడా నాయకుడిని ఆదర్శంగా తీసుకుని ఇంటిలోనే దీక్షలు చేస్తుండడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఎప్పుడో ఎక్కడో ప్రధాన మంత్రి నోటివెంట వచ్చిన జమిలి ఎన్నికలు అంశాన్ని అందిపుచ్చుకుని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని, పార్టీ భవిష్యత్తు పట్ల నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తొలిరోజుల్లో ఈవీఎంలను హ్యాక్ చేసి గెలిచారని కొంత కాలం చెప్పుకొచ్చి, ఉచిత పధకాల వలవేసి గెలిచారని కొన్నాళ్ళు ప్రత్యర్థి విజయాన్ని తగ్గించే ప్రయత్నం చేసి, ఇప్పుడు కేవలం అయిదు శాతం ఓట్లు అటూఇటూ అయితే ఈసారి ఎన్నికల్లో తమ పార్టీ ఘనవిజయం సాధించడం తధ్యం అని, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేస్తే వచ్చే సంవత్సరం వచ్చే జమిలి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామని జూమ్ సమావేశాల్లో కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నాడు చంద్రబాబు.

జమిలి ఎన్నికలు వస్తాయా?

ప్రధాన మంత్రి చెప్పినా, ఎన్నికల కమిషన్ చెప్పినా పార్లమెంటుకు, దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు పెట్టడం సాధ్యం కాదని చాలా మంది రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. కొన్ని అసెంబ్లీలకు సంవత్సరం, మరికొన్ని అసెంబ్లీలకు రెండు మూడు సంవత్సరాల పదవీకాలం మిగిలి ఉండగానే, వాటిని రద్దు చేసి ఎన్నికలు పెట్టే ప్రయత్నం కోర్టులో నిలవదు అంటారు. ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే వచ్చే సంవత్సరం ఎన్నికలకు పోతున్న తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల ఎన్నికలు జమిలి ఎన్నికలు వచ్చే వరకూ వాయిదా వేస్తారు కదా అంటారు పరిశీలకులు.

చంద్రబాబుని విజయం నల్లేరు మీద నడకేనా?

ఒకవేళ నరేంద్ర మోడీ అన్ని అడ్డంకులు అధిగమించి వచ్చే సంవత్సరం జమిలి ఎన్నికలు నిర్వహించినా రాష్ట్ర ప్రజలు చంద్రబాబును గెలిపించి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలని ఆత్రుతగా ఉన్నారా? గత ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం, చంద్రబాబు దారుణ పరాజయం వెనక వైసీపీ పట్ల పాజిటివ్ ఓటు మాత్రమే కాకుండా తెలుగుదేశం పట్ల నెగిటివ్ ఓటు కూడా ఉంది. ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రజల్లో తమ పార్టీ పట్ల ఉన్న నెగిటివ్ అభిప్రాయం తొలిగే పనులు తాము ఏం చేశామో చూస్తే ఏమీ లేవనే చెప్పాలి. అలాగే తమపట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చే పనులు అధికారపార్టీ ఏమైనా చేసిందా అంటే అదీ లేదు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నీ వీలయినంత త్వరగా అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా అందరికీ చేరేలా కష్టపడుతున్నారు. గత ప్రభుత్వంలో లాగా అధికారపార్టీ వారికే అన్ని ప్రయోజనాలు అన్న భావన ప్రజల్లో కలగకుండా చేయడం ప్రజలందరినీ ఆకట్టుకుంది.

ఈ పరిస్థితుల్లో వచ్చే సంవత్సరం జమిలి ఎన్నికల్లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వస్తే మరో మూడు సంవత్సరాలు అధికారంలో ఉండవలసిన వైసీపీ మరో అయిదు సంవత్సరాలు అధికారంలో ఉండే పరిస్థితి వస్తుందేమో చంద్రబాబు చూసుకోవాలి. మరో మూడు సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల్లో పోరాడడానికి చంద్రబాబులో ఉండే ఓపిక, మరో అయిదు సంవత్సరాల తర్వాత ఉండక పోవచ్చు. చంద్రబాబు ముందు ఉండి నడిపించకపోతే విజయావకాశాలు ఏమాత్రం ఉంటాయో ఎవరైనా ఊహించగల విషయం. లోకేష్ బాబు తప్ప మరొకరి చేతిలోకి పార్టీ పోవడం చంద్రబాబు సహించలేడని ఇప్పటికే అందరికీ తెలిసిందే. మరో అయిదు సంవత్సరాల తర్వాత లోకేష్ బాబు నాయకత్వంలో ఎన్నికల్లో పోరాటం చేసేకన్నా మరో మూడు సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయకత్వంలో ఎన్నికల పోరాటం చేయడం తెలుగుదేశం పార్టీకి శ్రేయస్కరం ఏమో!!