Idream media
Idream media
భారత్ ధీటుగా బదులివ్వనుందా?
లద్దాఖ్ లోని గాల్వాన్ లోయలో వాస్తవాధీన రేఖ వద్ద ఈ ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటివి కావు. దాదాపు ఆరు వారాలకు పైగానే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ నుంచే సరిహద్దుల్లో చైనా గస్తీ ఎక్కువైంది. ఇది ముందే ఊహించిన భారత్ సైన్యం ఎలాంటి చర్యలను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే పాంగాంగ్ సరస్సు వద్ద ఇరు దేశాల సైనికులు గతంలోనే ఘర్షణ పడ్డారు. కొంత మందికి గాయాలయ్యాయి. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు భారత్, చైనాకు చెందిన ఉన్నతాధికారులు ఈ నెల 6న సమావేశం అయ్యారు. అనంతరం ఇరు దేశాలు దశల వారీగా సైనిక బలగాలను ఉప సంహరించుకుంటాయని ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే ప్రకటించారు.
కానీ చైనా బలగాలు దొంగ చాటుగా సరిహద్దుల్లోనే నక్కాయి. ఈ క్రమంలోనే ఈ నెల 10న మరోమారు భారత్ – చైనాల మధ్య మేజర్ జనరల్ స్థాయి సమావేశం జరిగింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. సైనిక బలగాలను ఉప సంహరించి కోవాలని నిర్ణయించాయి. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హువా చున్ యింగ్ కూడా ప్రకటించారు. శాంతి మంత్రం పటించారు.
కొన్ని చోట్ల మినహా అక్కడక్కడ ఇరు దేశాల సైనికులు వెనక్కి కూడా తగ్గారు. ఈ తరుణంలో తాజా ఘటనతో సరిహద్దుల్లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్ జవానుల మృతి నేపధ్యంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్, మహా దళ పతి జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కారణాలను, ఘటన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా భారత్ సైనికుల మృతితో చైనాపై ఆగ్రహ జ్వాలలు వ్యక్త మవుతున్నాయి.
కేంద్రం కీలక భేటీ
ఇండియా, చైనా ఉద్రిక్తతలపై అఖిలపక్ష భేటీకి కేంద్రం
నిర్ణయించింది. 20 మంది సైనికుల మృతి నేపధ్యంలో సరిహద్దుల్లో ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై ఆ భేటీలో చర్చించనుంది. 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయించారు. ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
దెబ్బకు దెబ్బ : మోడీ
భారత్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుంది.. కానీ
రెచ్చగొడితే ఊరుకోం. తప్పని సరి అయితే దెబ్బకు దెబ్బ సమాధానం చెబుతామని ప్రధాని మోడీ ప్రకటించారు. చైనాను పరోక్షంగా హెచ్చరించారు. అమరవీరుల త్యాగం వృథా కాదని అన్నారు. ఈ నేపథ్యంలో అఖిల పక్ష సమావేశం అనంతరం ప్రధాని ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.