iDreamPost
android-app
ios-app

జాతీయ కాంగ్రెస్‌కు ఎంత కష్టం..!

జాతీయ కాంగ్రెస్‌కు ఎంత కష్టం..!

తెలంగాణ ఇచ్చినా ఇక్కడ దిక్కులేదు.. రాష్ట్రం విభజించి ఏపీలో అతీగతీ లేకుండా పోయింది. తెలుగురాష్ట్రాలలో రెంటికీ చెడ్డ రేవడిలా కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మారింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలోనైనా జవసత్వాలు నింపుకుందామని ప్రయత్నించిన రాష్ట్ర నాయకత్వానికి చుక్కెదురైంది. 150 డివిజన్లకుగాను 148 చోట్ల అభ్యర్థులను బరిలో దింపితే పట్టుమని పది స్థానాలు కాదు కదా.. కేవలం రెండింటితో సరిపెట్టుకుంది. ఇంకో ఘోర విషయం ఏంటంటే.. 19 డివిజన్లలో ఆ పార్టీకి కేవలం 500 లోపు మాత్రమే ఓట్లు వచ్చాయి. వాటిలో ఇంకొన్ని డివిజన్లలో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్ల కంటే నోటాకు వచ్చినవే ఎక్కువ ఉన్నాయి. చావుని డివిజన్‌, ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో అయితే కేవలం 180 ఓట్లు మాత్రమే కాంగ్రెస్‌ అభ్యర్థులకు పడ్డాయి. ఫలితాల అనంతరం వీటన్నింటినీ పరిశీలిస్తున్న పార్టీ నాయకత్వానికి ఏంచేయాలో పాలుపోవడం లేదు.

ఎందుకింత ఘోరం..

జాతీయ పార్టీ, ఏళ్ల తరబడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన పార్టీ కాంగ్రెస్‌. ఎంతో మంది ప్రముఖులు ఆ పార్టీ నేతలుగా ఉన్నారు. వైఎస్‌. రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో కాంగ్రెస్‌ శోభ దేశవ్యాప్తంగా వెలుగొందింది. ఓ దశలో ఏపీలో కాంగ్రెస్‌కు వచ్చిన ఖ్యాతి దేశంలోనే పార్టీ ఎదుగుదలకు తోడ్పడింది. అటువంటి పార్టీ ఇప్పుడు తెలుగురాష్ట్రాలలో ఉనికి కోసం అపసోపాలు పడుతోంది. 2016 గ్రేటర్‌ ఎన్నికల్లో కూడా నాచారం, పఠాన్‌చెరువు డివిజన్లలో మాత్రమే కాంగ్రెస్‌ గెలిచింది. దీంతో మేల్కొన్న పార్టీ నాయకత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2 అసెంబ్లీ స్థానాలను సాధించింది. కుత్బుల్లాపూర్‌, ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌, శేరిలింగంపల్లి తదితర నియోజకవర్గాల్లో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్‌ను దక్కించుకుని ఉనికి చాటింది.

ఎంపీ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి, మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్‌ పాగా వేయడం ఖాయమనే ధీమాను కనబరిచింది. మాటల్లో వ్యక్తబరిచిన ధీమాను ఆ పార్టీ నేతలు చేతల్లో చూపించలేకపోయారు. దుబ్బాక ఉప ఎన్నికలో ఆ విషయం స్పష్టమైంది. కనీసం డిపాజిట్‌ కూడా కాంగ్రెస్‌ అభ్యర్థికి రాలేదు. ఇంతలోనే వచ్చిన గ్రేటర్‌ ఎన్నికల్లో కనీస ప్రాతినిధ్యం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కనీసం 20 స్థానాలైనా ఇవ్వండని రేవంత్‌ రెడ్డి సానుభూతి పొందేలా ప్రచారం చేసినా ఓటర్లు 2 స్థానాలతో సరిపెట్టారు. వరుస ఓటములతో పీసీపీ పీఠానికి ఉత్తమ్‌ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్‌ కష్టాల నుంచి ఎప్పటికి గట్టెక్కేనో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.