iDreamPost
android-app
ios-app

చక్కా జామ్ చక్కగా జరిగేనా?

చక్కా జామ్ చక్కగా జరిగేనా?

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఆందోళనలో భాగంగా నేటి మధ్యాహ్నం దేశవ్యాప్తంగా చక్కా జామ్‌(రాస్తారోకో)కు రైతులు పిలుపునిచ్చారు.చక్కా జామ్‌లో భాగంగా 12 నుంచి 3 గంటల వరకు రైతులు రహదారులను దిగ్బంధనం చేయనున్నారు.

గణతంత్ర దినోత్సవం రోజున రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ జరిగిన దుర్ఘటనల దృష్ట్యా రైతులు చేయబోతున్న ఆందోళనను ప్రభుత్వం ఎలా ఎదుర్కొనబోతుందని ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న..దేశ రాజధాని హస్తినలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో దాదాపు 50వేల మంది పోలీసులు, పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు.

కాగా ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లకు మాత్రం చక్కా జామ్ నుండి మినహాయింపునిస్తున్నట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) ప్రకటించింది. చక్కా జామ్‌ను పూర్తి శాంతియుతంగా నిర్వహిస్తామని అంబులెన్సులు, పాఠశాల బస్సులు వంటి అత్యవసర, తప్పనిసరి సేవలకు ఆటంకం కలిగించబోమని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) రాకేశ్‌ టికాయత్‌ స్పష్టం చేశారు. చక్కా జామ్ ముగియగానే ఒక నిమిషం పాటు హారన్‌ మోగించనున్నట్లు రైతు నేతలు వెల్లడించారు.

దేశవ్యాప్తంగా చక్కా జామ్‌ను విజయవంతం చేయాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.సింఘు, టిక్రీ, గాజీపుర్‌ సరిహద్దుల్లో మరిన్ని బారీకేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు జలఫిరంగులను కూడా సిద్ధంగా ఉంచింది. ముందు జాగ్రత్త చర్యగా ఢిల్లీ మెట్రో స్టేషన్ల ఎంట్రీ ఎగ్జిట్ గేట్లను మూసివేశారు.. రైతులు చేస్తున్న చక్కా జామ్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెల్పగా రైతు ఉద్యమంలో సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించాయని దేశ సమైక్యతకు భంగం కలిగించే కుట్ర చేస్తున్నాయని కొందరు ఆరోపిస్తుండటం గమనార్హం.

అయితే దేశంలో రైతులు చేస్తున్న అందోళన నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్‌ కార్యాలయం స్పందించింది. రైతులతో పాటు ప్రభుత్వం, అధికారులు సంయమనంతో వ్యవహరించాలని, శాంతియుతంగా పౌరులు తమ భావాలను వ్యక్తం చేసే హక్కును పరిరక్షించాలని, మానవ హక్కులను కాపాడుతూ అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలని కోరింది.