iDreamPost
iDreamPost
నాకు ఈత రాదు కాని, వచ్చుంటే ఈ సముద్రాన్ని ఒక్క చిటికెలో ఈదేసేవాడిని అన్నాడట వెనకటికి ఒకడు! అచ్చం అలాగే ఉంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్టేట్ మెంట్. విజయవాడలో జరుగుతున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఒక్క బీజేపీకే కమిట్‌మెంట్ ఉందని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి రాబోతోందని.. అద్భుతమైన రాజధానిని అమరావతిలో కడతామని చెప్పారు. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనే నైతిక హక్కు సీఎం జగన్‌కు లేదని కూడా సెలవిచ్చారు. రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో బీజేపీకే చిత్తశుద్ధి ఉందన్నారు. మాట తప్పను.. మడమ తిప్పను.. ఇక్కడే క్యాపిటల్ కడతానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు మూడు రాజధానులు కడతానని చెప్పే నైతిక హక్కులేదన్నారు. ఇప్పుడు ఎలా మాట తప్పుతారని తమ పార్టీ ప్రశ్నిస్తోందన్నారు.
ఆది నుంచీ అంతే..
సోము వీర్రాజు రాష్ట్రంలో బీజేపీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇలాంటి ప్రకటనలు చాలా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని, ఆ పాత్రను తాము పోషిస్తామని చెప్పారు. వైఎస్సార్ సీపీ, టీడీపీలకు సమాన దూరం పాటిస్తామని అన్నారు. కానీ ఆచరణకు వచ్చేసరికి టీడీపీకి మరీ దగ్గర అవుతున్నారు. మొన్న జరిగిన బద్వేలు ఉప ఎన్నికలే అందుకు సాక్ష్యం. ఆ ఎన్నికలలో టీడీపీ లీడర్లు, క్యాడర్ బీజేపీ తరఫున పని చేయడమే కాక ఏకంగా పోలింగ్ ఏజెంట్ల అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్ పై బీజేపీకి ప్రత్యేక ప్రేమ ఉందని పోలవరం ప్రాజెక్టుకు, రాష్ట్రాభివృద్ధికి నిధుల మంజూరు విషయంలో కేంద్రంలోని తమ పార్టీ ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పారు. అది ఎంతవరకు వచ్చిందో అందరికీ తెలిసిందే. పోలవరం ఆర్ అండ్ ఆర్ బాధ్యత నుంచి కేంద్రం తప్పుకున్నా సోము నోరు విప్పింది లేదు. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిధులు ఇస్తామన్న హామీ అటకెక్కినా పట్టించుకోలేదు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని అన్యాయంగా కేంద్ర పెద్దలు మాట్లాడుతున్నా తమకు సంబంధం లేదన్నట్టు మిన్నకుండిపోయారు. విభజన చట్టంలోని అంశాల అమలు కాని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో కాని ఉదాసీనంగా వ్యవహరించారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ఇన్ని అంశాల్లో ప్రజల పక్షం వహించకుండా ఇప్పుడు హఠాత్తుగా అధికారంలోకి ఎలా వచ్చేస్తామని సోము భావిస్తున్నారో ఆయనకే తెలియాలి.
గెలిపిస్తే నిర్మించేస్తారన్న మాట!
ఛత్తీస్‌గఢ్‌లో హౌసింగ్‌బోర్డు ఆధ్వర్యంలో రాజధానిని నిర్మించుకున్నారని సోము చెప్పారు. అలాగే, జార్ఖండ్,ఉత్తరాంచల్ లలో రాజధానులు నిర్మించుకున్నా.. ఏపీకి వచ్చేసరికి సరైన దిశ, దశ లేనటువంటి రాజకీయాలతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. అందుకే తమ పార్టీ అధికారంలోకి రాగానే రాజధాని కట్టేస్తామని చెప్పారు. పరిపాలనా సౌలభ్యం కోసం గతంలో భాజపా విభజించిన రాష్ట్రాల్లో రాజధానులు నిర్మించుకున్న అంశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అంటే తమ పార్టీ అధికారంలోకి రావడమే తరువాయి రాజధానిని నిర్మించేస్తాము అన్నట్టు ఆయన ప్రసంగం సాగింది.
బీజేపీకి అంత సీన్ ఉందా?
రాష్ట్రంలో పడుతూ లేస్తూ అన్నట్టుగా ఉన్న బీజేపీ ప్రస్థానాన్ని గమనిస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం సాధ్యమేనా అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. అప్పుడప్పుడూ ఒకటో రెండో ఎంపీ, ఎమ్మెల్యే స్టానాలను గెలవడం మినహా ఈ రాష్ట్రంలో ఆ పార్టీకి చెప్పుకోదగ్గ విజయాలు లేవు. పార్టీ నిర్మాణం లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో నోటా కన్న తక్కువ ఓట్లు వచ్చిన చరిత్ర. మొన్నటికి మొన్న బద్వేలు ఉప ఎన్నికల్లో మొత్తం ప్రతిపక్షాలు అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కుమ్మక్కు అయినా గణనీయమైన ఓట్లను కూడా తెచ్చుకోలేని పరిస్థితి. మరోవైపు అధికార వైఎస్సార్ సీపీ సంక్షేమ పాలనతో ప్రతి ఎన్నికలోను ఓట్ల శాతం పెంచుకుంటూ దూసుకుపోతోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ అధికారంలోకి రావడం, రాజధాని కట్టడం అంటే హాస్యాస్పదంగా ఉంది. అందుకే రాజధాని నిర్మాణం ఆలోచనలు వదలి సోము వీర్రాజు పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తే మంచిది అనే సూచనలు వినిపిస్తున్నాయి.