1995-96 సమయంలో తెలుగునాట జర్నలిస్టు సర్కిళ్లలో ఓ మాట వినిపించేది. రాష్ట్రంలో పత్రికలకు వేరువేరుగా ఎడిటర్లు ఉన్నారు గానీ అన్నింటికీ చీఫ్ ఎడిటర్ మాత్రం చంద్రబాబునాయుడే అని! ఆ రేంజ్ లో పాత్రికేయాన్ని ఆయన కంట్రోల్ చేశారు కనుకనే దైవాంశ సంభూత స్థాయి ప్రజాకర్షణ కలిగిన ఎన్టీరామారావును వైస్రాయి ఎపిసోడ్ ద్వారా సక్సెస్ ఫుల్ గా గద్దె దింప గలిగారు. ఇన్నాళ్ళూ రాజకీయాల్లో మన గలిగారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే అప్పుడు పత్రికలను కంట్రోల్ చేసిన మాదిరి ఇప్పుడు ప్రతిపక్షాలను అయన తన కనుసన్నల్లో నడుపుతున్నారనే అనుమానం కలగబట్టి. అదేమి చోద్యమో కమ్యూనిస్టులైనా, బీజేపీ వారైనా, కాంగ్రెస్ నేతలైనా, జనసేన నేతలైనా అచ్చంగా ఆయన నిఘంటువునే ఫాలో అవుతున్నారు.
రాధాకృష్ణ కొత్త పలుకుకు చంద్రబాబు చిలక పలుకులకు తేడా లేనట్టే టీడీపీ అజెండాకు మిగిలిన విపక్షాల ఆచరణకు వీసమెత్తు భేదం ఉండడం లేదు. తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను విడనాడాలని, వినాయక చవితి ఉత్సవాలను అడ్డుకుంటే ఉద్యమిస్థామని చెప్పిన మాటలు అచ్చం బాబు స్టయిల్లొనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హిందువులను రాచి రంపాన పెడుతున్నట్టు, వినాయక చవితి ఉత్సవాలను ఎక్కడా జరగడానికి వీల్లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్థున్నట్టు జనాన్ని నమ్మించాలనే ఉద్దేశంతో సోము చేసిన ఈ వ్యాఖ్యలు బాబు మార్క్ రాజకీయానికి జిరాక్స్ కాపీలా ఉన్నాయి. బాబు అండ్ కో కూడా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పూర్తిగా దివాలా తీసినట్టు, పరిపాలన గాడి తప్పిపోయినట్టు, శ్రీమాన్ చంద్రబాబునాయుడు మళ్లీ అధికార పగ్గాలు చేపడితే తప్ప ఈ రాష్ట్రానికి నిష్కృతి లేనట్టు ప్రజలను నమ్మించే విద్యలు ప్రదర్శిస్తుంటాయి. జనం ఇలాంటి గిమ్మిక్కులను ఎప్పటి నుంచో నమ్మడం మానేశారు. పాపం సోము లాంటి విపక్ష నేతలే ఇంకా పాత ఫార్ములాను ఫాలో అవుతున్నారు.
Also Read : సలహాదారుగా రజనీష్.. ఓ మంచి ఎంపిక..!
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై జీఓ ఇస్తే తప్పా?
కోవిడ్ థర్డువేవ్ నివారణ చర్యల్లో భాగంగా కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన మార్గ దర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం జారీచేసిన జీఒపై సోము రాద్దాంతము చేస్తున్నారు. వినాయక చవితిని ఎలా నిర్వహించాలో నిర్దేశించిన కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం, మతం కార్డును తెరపైకి తేవడం సోముకు తగునా? కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో క్రిస్మస్, రంజాన్, మొహరంలను కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తూ నిర్వహించుకొవాలో సూచిస్తూ గతంలో రాష్ట్రంలో జీఓలు ఇచ్చిన విషయం ఆయనకు తెలియదా? ప్రజల ప్రాణాలను పరిరక్షించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకునే చర్యలకు కూడా మతం రంగు పులిమితే జనం నమ్ముతారా? నవ్వి పోతారా?
బాబు కొంప మునిగింది ఇలాగే..
తాను తానా అంటే తందానా అనే మీడియా ఉందనే ధీమాతో, జనం నమ్మేస్తారనే అతి విశ్వాసంతో గత సంవత్సరం బాబు డైరెక్షన్లో విపక్షాలు ఇలాగే మత రాజకీయాలు చేశాయి. రాత్రికి రాత్రి గుళ్లు , దేవతా విగ్రహాలు కూలిపోవడం, అంతర్వేదిలో రథం కాలిపోవడం, అక్కడకు వెళ్లి హై డ్రామా సృష్టించడం అందరూ చూసిందే. ఇవేమీ తిరుపతి ఉప ఎన్నికలో గాని, మునిసిపల్ ఎన్నికల్లో గాని విపక్షాలకు ఓట్లను రాల్చలేదు. తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టారన్న సంగతి మరోసారి రుజువయింది. అయినా మత ప్రాతిపదికగా విద్వేషాలు సృష్టించాలను కోవడం జనం విజ్ఞతను తక్కువ చేసి చూడటం తప్ప వేరేమీ కాదు. ఈ విషయాన్ని గ్రహించనంత కాలం నోటాను మించి ఓట్లు రాబట్టడం కమలం నేతలకు సాధ్యం కాదు.
Also Read : పోలవరం పనులు జరగటం లేదా?కళ్ళు తెరిచి చూడండి దేవినేని ఉమా గారు..