iDreamPost
android-app
ios-app

మ‌జ్లిస్ కోట‌లో బీజేపీ పాగావేయ‌గ‌ల‌దా..?

మ‌జ్లిస్ కోట‌లో బీజేపీ పాగావేయ‌గ‌ల‌దా..?

మ‌జ్లిస్ పార్టీకి పాత‌బ‌స్తీ పెట్ట‌ని కోట‌. అక్క‌డ ఆ పార్టీకి ఎదురు లేదు. మున్ముందు కూడా ఉండే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అయితే భార‌తీయ జ‌న‌తా పార్టీ అక్క‌డ ప్రాభ‌వం చాటేందుకు తీవ్రంగా పోరాడుతోంది. ఒక‌ప్పుడు పాత‌బ‌స్తీలో బీజేపీ ప్ర‌భావం ఉండేది. ఆలె న‌రేంద్ర‌, బ‌ద్దం బాల్ రెడ్డి వంటి నేత‌లు ఉన్న‌ప్పుడు ఆ ప్రాంతంలో ఎంఐఎంకు బీజేపీ గ‌ట్టి పోటీ ఇచ్చేది. పార్టీకి బ‌ల‌మైన పునాదులు ప‌డ్డాయి. ఎన్నిక‌లు ఏమైనా కొన్ని ప్రాంతాల్లో మ‌జ్లిస్ కు బీజేపీ అభ్య‌ర్థులు దీటుగానే ఎదుర్కొనేవారు. హైదరాబాద్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌, కార్పొరేషన్‌ ఎన్నికలు జరుగుతున్నాయంటే చాలు ఈ రెండు పార్టీలదే హవా ఉండేది. 1985లో కార్వాన్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌ద్దం బాల్ రెడ్డి, హిమాయ‌త్ న‌గ‌ర్ నుంచి ఆలె న‌రేంద్ర విజ‌యం సాధించారు. 1989లో కూడా పాత‌బ‌స్తీ ప్రాంత‌మైన కార్వాన్ లో కాషాయ జెండానే రెప‌రెప‌లాడింది. ఆ ప్ర‌భావం మ‌రికొన్ని ప్రాంతాల్లో బీజేపీ ప్రాభ‌వం చాటేందుకు దోహ‌ద‌ప‌డింది. వారి త‌ర్వాత ఆ స్థాయిలో పాత‌బ‌స్తీలో పార్టీని అభివృద్ది చేసే వారు క‌రువ‌య్యారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటి పూర్వ వైభ‌వం పొందాల‌ని బీజేపీ భావిస్తోంది.

దుబ్బాక గెలుపుతో…

దుబ్బాక ఉప ఎన్నిక‌లో బీజేపీ గెల‌వ‌డంతో తెలంగాణ మొత్తం ఆ ఉత్సాహంతో పార్టీని విస్త‌రించాల‌ని నేత‌లు వ్యూహాలు ర‌చిస్తున్నారు. ప్ర‌స్తుత జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో కూడా స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇదే క్ర‌మంలో పాత‌బ‌స్తీలో కూడా బ‌ల‌ప‌డాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. పాతబస్తీలో దాదాపు 33 డివిజన్లలో గ‌త ఎన్నిక‌ల్లో రెండు స్థానాల్లో బీజేపీ గెలిచింది. కొన్ని డివిజ‌న్ల‌లో గ‌ట్టి పోటీ ఇచ్చింది. పాతబస్తీలోని కొన్ని డివిజన్లలో గతంలో పోటీ చేసిన అభ్యర్థులనే తిరిగి టికెట్‌ ఇచ్చారు. పురానాపూల్‌, ఉప్పుగూడలో గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు మరో సారి అవకాశం ఇచ్చారు. గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఉప్పుగూడలో కొద్ది ఓట్లతో ఓడిపోయిన అభ్యర్థికే తిరిగి టికెట్‌ కేటాయించారు. గతంలో తక్కువ ఓట్లతో ఓడిపోయిన వారు గట్టి ప్రయత్నం చేస్తే పాతబస్తీలో సీట్ల సంఖ్య పెంచుకోవచ్చునని పార్టీ నేతలు భావిస్తున్నారు. డబీర్‌పురా, జంగ్మెట్‌ డివిజన్లలో పట్టు సాధిస్తామనే దీమాతో నాయకులున్నారు. డివిజన్‌లు సిట్టింగ్‌ స్థానాలు. గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఇక్కడ ఆలె నరేంద్ర భార్య లలితమ్మ పోటీ చేసి గెలిచారు. ఆమెకు అస్వస్థత కారణంగా ఆమె కొడలుకు టికెట్‌ కేటాయించారు. ఘాన్సీ బజార్‌ డివిజన్‌లో సిట్టింగ్‌ అభ్యర్థికే టెకెట్‌ ఇచ్చారు.

వాటినే న‌మ్ముకున్న బీజేపీ

పాతబస్తీ అంటే అక్కడ మజ్లిస్‌ ప్రాబల్యమే ఎక్కువ. హైదరాబాద్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి మిన‌హా మిగితా చోట్ల మజ్లిస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. చార్మినార్‌, యాకుత్‌పురా, చంద్రాయణగుట్ట, మలక్‌పేట, కార్వాన్‌, నాంపల్లిలో గట్టి పట్టు ఉంది. గోషామహల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఇక్కడ మెజార్టీ సీట్లు గెలుస్తామనే దీమాతో ఉన్నారు. చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురాలో తమ పార్టీ బలంగా ఉందని నేతలు పేర్కొంటున్నారు. కార్వాన్‌ నియోజకవర్గంలో అధిక శాతం సీట్లను గెలువాలనే పట్టుదలతో నాయకులున్నారు. మళ్లీ పాతబస్తీలో పార్టీ పునాదిని పటిష్టం చేయాలనే ధ్యేయంతో ఎన్నికలను ఎదుర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వం మైనార్టీ వర్గాలకు ప్రవేశపెట్టిన పథకాలను విస్తృత ప్రచారం చేయాలని నాయకులు నిర్ణయించారు. పాతబస్తీలో మజ్లిస్‌ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కేంద్రం సంక్షేమ పథకాల ప్రచారాన్ని ఇప్పటకే చేసినట్లు నాయకులు పేర్కొంటున్నారు. త్రిబుల్ తలాఖ్‌, విద్యార్థులకు స్కాలర్‌ షిప్పులు, యువత ఉద్యోగ శిక్షణ కార్యక్రమాలను ప్ర‌చార ఆయుధాలుగా మ‌లుచుకోవాల‌ని భావిస్తున్నారు. ఈసారి ఎలాగైనా పాత‌బ‌స్తీలో బీజేపీ ఉనికి చాటాల‌ని వ్యూహాలు ర‌చిస్తున్నారు.