2019లో మన్మథుడు 2 తర్వాత టీవీలో బిగ్ బాస్ షోలో తప్ప పెద్ద స్క్రీన్ పై కనిపించని నాగార్జునను అభిమానులు అతిత్వరలో వెండితెరపై చూడొచ్చు. ఆ మేరకు రూట్ క్లియర్ అయ్యింది. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ని ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా రాబోతోంది. నిజానికిది ఓటిటి లో వస్తుందని జనవరి నుంచే ప్రచారంలో ఉంది. థియేటర్లు యాభై శాతం ఆక్యుపెన్సీతో ఉన్నప్పుడు వర్కౌట్ కాదనే ఉద్దేశంతో నిర్మాతలు తొలుత డిజిటల్ వైపు మొగ్గు చూపిన మాట వాస్తవం. నెట్ ఫ్లిక్స్ తో డీల్ చేసుకున్నారు కూడా.
కానీ గత నెల రోజులకు పైగా బాక్సాఫీస్ వద్ద జరుగుతున్న పరిణామాలు చూశాక వైల్డ్ డాగ్ టీమ్ నిర్ణయాన్ని మార్చుకుంది. ముందు థియేటర్ కు రావాలని డిసైడ్ అయ్యింది. అందులోనూ కింగ్ నాగార్జున ఫాన్స్ డిమాండ్ కూడా అలాగే ఉంది. దీంతో వైల్డ్ డాగ్ ని అన్ని సినిమాల లాగే నేరుగా హాలుకు వెళ్లి చూడొచ్చు. సంక్రాంతి పండక్కు మొదలైన సందడి ఒకటి రెండు సినిమాలకు మినహాయించి అన్నింటికి మంచి రెవిన్యూ తెచ్చి పెట్టింది. ఫ్లాప్ టాక్ వచ్చినవి కూడా మంచి వసూళ్లు రాబట్టుకున్నాయి. మాస్టర్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, జాంబీ రెడ్డి కొన్నవాళ్లు హ్యాపీగా ఉన్నారు. అందుకే వైల్డ్ డాగ్ కూడా ఇదే దారిలో వెళ్తోంది.
అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహించిన వైల్డ్ డాగ్ లో నాగార్జున ఇన్వెస్టిగేటివ్ ఎన్ఐఎ ఆఫీసర్ గా చాలా డిఫరెంట్ రోల్ పోషిస్తున్నారు. ఇందులో కమర్షియల్ ఫార్ములా తరహాలో పాటలు ఉండవు. యాక్షన్ ఎపిసోడ్లు ఉంటాయి కానీ గాల్లో ఎగిరి ఫిజిక్స్ నే ఛాలెంజ్ చేసే మాదిరి ఉండవు. చాలా న్యాచురల్ గా నిజ జీవిత సంఘటనలు ఆధారంగా చేసుకుని ప్లాన్ చేశారు. సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 2నే సీటిమార్, సుల్తాన్ లు ఆల్రెడీ షెడ్యూల్ అయ్యున్నాయి. మరి ఏదైనా మార్పు ఉంటుందేమో వేచి చూడాలి. వైల్డ్ డాగ్ కు సంబంధించి నాగ్ నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ ట్వీట్ రాలేదు