iDreamPost
iDreamPost
అమరావతి పరిరక్షణ ఉద్యమం అంటూ గడిచిన కొన్ని నెలలుగా ఓ ప్రహసనం నడుస్తోంది. ఆ ఉద్యమం ఎలా సాగుతుందన్నది పక్కన పెడితే పచ్చ మీడియాలో మాత్రం ప్రతినిత్యం కవరేజ్ అనివార్యంగా ఉంటుంది. అమరావతి ప్రాంత రైతుల ఉద్యమంగా దానిని చెబుతున్నప్పటికీ అంతకుమించి మీడియా పెద్దల అవసరంగా కూడా ఇది కనిపిస్తోంది. తమ ఆర్థిక ప్రయోజనాల రీత్యా ఈ వ్యవహారం నడిపేందుకు మీడియా యాజమాన్యాల ఆతృత స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్యమం పేరుతో రాష్ట్ర ప్రజలను ఏమార్చే యత్నం చేస్తున్నట్టు అర్థమవుతోంది. ఆఖరికి నేరుగా పచ్చ మీడియా యాజమాన్యాలే పచ్చ కండువాలేసుకుని ఫోజులిస్తున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. మీడియా యజమానుల అసలు రూపం బట్టబయలవుతోంది.
అమరావతి కోసమంటూ ప్రస్తుతం ఓ పాదయాత్ర సాగుతోంది. పలు ఆంక్షలతో హైకోర్టు అనుమతికి అనుగుణంగా యాత్ర చేస్తున్నారు. అయినా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దానిని అడ్డుకునేందుకు పోలీసులు నోటీసులు కూడా ఇస్తున్నారు. అయితే హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పోలీసులు అడగడమే నేరమన్నట్టుగా ఏబీఎన్ మొదలుకుని మహా టీవీ వరకూ నిత్యం వక్రభాష్యపు వార్తలు అల్లేస్తున్నారు. అంతటితో సరిపెట్టకుండా టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడు నుంచి మహాటీవీ ఎండీ మారెళ్ల వంశీ కృష్ణ వరకూ నేరుగా పచ్చ కండావాలు వేసుకుని సిద్ధమయిపోయారు.
Also Read : Praises To Jagan Rule – దేశానికే ఆదర్శంగా జగన్ పాలన
వాస్తవానికి అమరావతిలోనే గతంలో టీవీ5 మూర్తి వంటి వారు పెద్ద కథే నడిపారు. కండువాలు కప్పుకుని జర్నలిస్టులుగా కన్నా అమరావతి ఆందోళనకారులుగానే వ్యవహరించారు. అదే క్రమంలో ఇప్పుడు నాయుడు, వంశీ వ్యవహారం ఉంది. వంశీ అయితే సహజంగా డ్రమటిక్ వార్తలకు పెట్టింది పేరు కాబట్టి దానికి అనుగుణంగా కొత్త రక్తికట్టించారు. తానే అమరావతి కోసం ఉద్యమిస్తున్నట్టుగా కనిపించే ప్రయత్నం చేశారు. కనీసం తమ సొంత కులస్తుల్లోనయినా గుర్తింపు తగ్గకుండా చూసుకునే యత్నంలో ఆయన ఉన్నట్టు కనిపించింది. అదే సమయంలో నాయుడు సహా మీడియా పెద్దల పాత్రకు అసలు కారణం అమరావతి పేరుతో కొనుగోలు చేసిన భూముల విలువ కాపాడుకోవడమేనని అంతా భావిస్తున్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతి వ్యవహారం ముందుగా తెలుసుకున్న పచ్చ మీడియా పెద్దలంతా భారీగా భూములు కొనుగోలు చేసిన విషయం ఇప్పటికే బయటపడింది. అందులో తక్కువ ధరకే భూములు కొనేసి రాజధాని పేరుతో వాటి విలువ పెంచుకోవాలని ప్రయత్నించిన వారిలో చంద్రబాబు సన్నిహితులుగా కొన్ని మీడియా సంస్థల యజమానులు కూడా ఉన్నారు. కొందరు జర్నలిస్టులు కూడా వివిద రకాల ప్రభుత్వ భూములను తప్పుడు మార్గంలో కాజేసి సీఆర్డీయేకి అమ్మేసినట్టు రికార్డులు సృష్టించి పెద్ద మొత్తంలో కొల్లగొట్టిన అభియోగాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వారంతా తమ భూముల విలువ కాపాడుకునే యత్నంలో అమరావతి పరిరక్షణ అంటూ రోడ్డు మీదకు వస్తున్నట్టు కనిపిస్తోంది. తమ ఆస్తులు పరిరక్షణను కూడా రాష్ట్ర ప్రయోజనాలుగా, రైతుల మేలు కోసమే అన్నట్టుగా చిత్రీకరించి ప్రజలను భ్రమల్లో ముంచాలనే యత్నంలో ఉన్నట్టు రూఢీ అవుతోంది.
Also Read : Amaravati Movement – అమరావతి ఉద్యమం ఎందుకు విఫలమైంది..?
ఇప్పటికే ఏపీ వాసులు అమరావతి వెనుక ఉన్న భ్రమరావతి వ్యవహారం గ్రహించాలి. చంద్రబాబు తో పాటుగా పచ్చ మీడియా యజమానులు ఎంత ప్రయాస పడినా ఫలితం దక్కే అవకాశాలు లేవు. ఉద్యమాలు, యాత్రల మూలంగా ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందని, పోలీసుల దాడులంటూ చిత్రీకరిస్తే సానుభూతి దక్కుతుందని ఆశిస్తే జనాలు దానికి విరుద్ధంగా ఉన్నారు. కాబట్టి మీడియా ముసుగులో అమరావతి భూముల విలువ కోసం పాత్రికేయ వలువలు విడుస్తున్న వారి వ్యవహారం సామాన్యుడికి సైతం తెలిసిపోయిందని గ్రహించడం వారికే మంచిదేమో అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.