iDreamPost
android-app
ios-app

ఆ పాండిచ్చేరి మంత్రికి జగన్ మీద అంత ప్రేమ ఎందుకు?

  • Published Dec 18, 2020 | 1:09 AM Updated Updated Dec 18, 2020 | 1:09 AM
ఆ పాండిచ్చేరి మంత్రికి జగన్ మీద అంత ప్రేమ ఎందుకు?

పాండిచ్చేరి పేరు చెబితే ఎక్కడో అనే అనుకుంటారు గానీ, యానాం అనగానే అందరికీ గుర్తుకొస్తుంది. మన తూర్పు గోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉండే అతి చిన్న మునిసిపాలిటీ. అక్కడ మద్యం, పెట్రోల్ ధరల గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం ఉంటుంది. అదే సమయంలో యానాం వాసులకు లభించే ప్రయోజనాలు కూడా ఎక్కువ మోతాదులో ఉండడంతో పలువురు ఆంద్రా ప్రాంతీయులు కూడా యానాంలో స్థిరపడే ప్రయత్నాలు గతంలో జరిగేవి.

యానాంలో రేషన్ కార్డు కోసం అర్రులు చాసిన దాఖలాలు కనిపించేవి. ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండడం, సంక్షేమ పథకాల ప్రయోజనం కూడా ఆశించి అటువైపు ఎక్కువ మంది వెళ్లేవారు. భౌగోళికంగా తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా కనిపించే యానా జనాభా 55వేల లోపు. ఓటర్లు దాదాపు 30వేల మంది.

ఏపీలో అయితే ఓ కార్పోరేటర్ స్థాయిలో ఉండే యానాం ప్రాంతానికి అప్రతిహాతంగా ప్రాతినిధ్యం వహిస్తూ వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మల్లాడి కృష్ణారావు. 24 ఏళ్ల క్రితం తనకు 32 ఏళ్ల వయసులోనే తొలిసారిగా 1996లో యానాం నుంచి ఆయన విజయం సాధించారు. ఆతర్వాత 2006లో పాండిచ్చేరి ప్రభుత్వంలో మంత్రిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం పాండిచ్చేరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన కీలక శాఖల మంత్రిగా ఉన్నారు. కానీ మనుషులు అటు ఉన్నప్పటికీ ఆయనతో సహా యానాం వాసుల మనసు మాత్రం ఏపీలోనే ఉంటుందని తాజాగా మల్లాడి కృష్ణారావు చేసిన కామెంట్స్ చాటుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో 56 బీసీ కులాల కార్పోరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణస్వీకార కార్యక్రమానికి పాండిచ్చేరి మంత్రి హాజరయ్యారు. కేవలం రావడమే కాకుండా ఉపన్యాసంతో కీలక వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. వచ్చే ఏడాదితో తన పదవికి పాతికేళ్లు నిండుతున్నాయని, ఇక యానాం, పాండిచ్చేరి రాజకీయాల నుంచి తాను తప్పుకుంటానని ప్రకటించారు. అంతేగాకుండా ఎటువంటి పదవీ లేకుండా బీసీ జాతికి చెందిన తాను వైఎస్ కుటుంబం వెంట నడుస్తానని ఆయన చేసిన ప్రకటన కీలకంగా మారింది. మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మల్లాడి కృష్ణారావు కి ఏపీలో కూడా ఆ వర్గీయుల్లో మంచి గుర్తింపు ఉంది. విద్యావంతుడు, సౌమ్యుడిగా పేరుంది. ప్రస్తుతం ఆయన పాతికేళ్ల పాండిచ్చేరి ప్రస్థానం ముగించుకుని ఏపీ రాజకీయాల్లో జగన్ కి తోడుగా ఉంటానని చేసిన ప్రకటన కీలకంగా భావించాల్సి ఉంటుంది.

వాస్తవానికి మల్లాడి కృష్ణారావుకి సుదీర్ఘకాలంగా అంతకుముందు వైఎస్సార్ తోనూ, తాజాగా జగన్ తోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. జగన్ తూగో జిల్లా పర్యటనలో యానాంలో కృష్ణారావు ఇంట ఆతిథ్యానికి వెళ్లిన రోజులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మొన్నటి క్యాబినెట్ కూర్పులో ముమ్మిడివరం ఎమ్మెల్యే, తన రాజకీయ శిష్యుడు పొన్నాడ సతీష్ కోసం ఆయన ప్రయత్నాలు చేశారు. జగన్ తో భేటీ అయ్యారు. పొన్నాడ పేరుని మల్లాడి కృష్ణారావు ప్రతిపాదించారు. అయితే జగన్ మాత్రం డాక్టర్ సీదిరి అప్పలరాజు వైపు ఆ కులం కోటాలో మొగ్గు చూపిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఏపీలో తొలిసారిగా ఓ మత్స్యకార కుటుంబం నుంచి రాజ్యసభ అవకాశం మోపిదేవి వెంకట రమణకు దక్కింది. ఇలాంటి బీసీ వర్గాలకు తగిన గుర్తింపునివ్వడంలో జగన్ చేస్తున్న ప్రయత్నాలకు మల్లాడి ఆకర్షితుడయినట్టు కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల మత్స్యకారుల్లో తనకున్న పరిచయాలు, సంబంధాలను ఉపయోగించుకుని వైఎస్సార్సీపీ కోసం ఆయన ప్రయత్నం చేయడానికి సంసిద్ధులు కావడం ఆసక్తికరమే.