iDreamPost
android-app
ios-app

బీజేపీలో ఆ ముగ్గురి కథ ముగిసిందా?

  • Published Oct 14, 2021 | 10:57 AM Updated Updated Oct 14, 2021 | 10:57 AM
బీజేపీలో ఆ ముగ్గురి కథ ముగిసిందా?

గత ఎన్నికల ముందు వరకు వారు రాజకీయంగా వెలిగిపోయారు. ఇటు రాష్ట్రంలోనూ.. అటు ఢిల్లీలోనూ లాబీయింగ్ చేస్తూ పబ్బం గడుపుకునేవారు. ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోయిన వెంటనే బీజేపీలోకి జంప్ చేశారు. అక్కడా కొన్నాళ్లు వారి రాజకీయాలు బాగానే సాగాయి. వారు పార్టీని బాగా వాడేసుకుంటున్నారని బీజేపీ అగ్రనేతలకు అర్థం అయినట్లుంది. అందుకే పక్కన పెట్టేశారని కమలనాథులు అంతర్గత చర్చల్లో చెప్పుకుంటున్నారు. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి సునీల్ దేవధర్ ఇటీవల ఆ ముగ్గురిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఆ ముగ్గురు నేతలు ఎవరో ఇప్పటికే అర్థం అయిపోయింది కదూ. అవును.. వారే రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్.

పార్టీని పార్కింగ్ ప్లేసులా వాడుకున్నారు

ఇటీవల పార్టీ నేతలతో జరిగిన ఒక సమావేశంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి సునీల్ దేవధర్ మాట్లాడుతూ ముగ్గురు నేతలు పార్టీని పార్కింగ్ ప్లేసులా వాడుకున్నారని.. వారి కార్లకు పంక్చర్ చేసి కదలకుండా చేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి వచ్చి చేరిన ముగ్గురు ఎంపీల గురించే దేవధర్ ఆ వ్యాఖ్యలు చేశారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న సదరు ఎంపీలు దేవధర్ పై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. అయితే దానిపై ఇంతవరకు అటువైపు నుంచి స్పందన లేదు. దాంతో ఆ పార్టీ నాయకత్వం ఆ ముగ్గురినీ పక్కన పెట్టేసినట్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Also Read : Janasena Party: జనసేన ఎన్నికల గుర్తు చేజారినట్టేనా?

చాన్నాళ్లుగా అంటీముట్టనట్లు..

వాస్తవానికి ఈ ముగ్గురు రాజ్యసభ సభ్యులు కొంతకాలంగా పార్టీతో ఆంటీముట్టనట్లుగా ఉంటున్నారు. పార్టీ కూడా వారిని లెక్కలోకి తీసుకోవడంలేదు. సార్వత్రిక ఎన్నికల ముందు వరకు టీడీపీలో ఉండి అధికార దర్పం ప్రదర్శించిన సుజనా, టీజీ, రమేష్ లు ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో కొద్దినెలల్లోనే బీజేపీలో చేరిపోయారు. చంద్రబాబు రాజకీయ వ్యూహంలో భాగంగానే వారు పార్టీ మారారన్న ఆరోపణలు కూడా అప్పట్లో వినిపించాయి. వీరి చేరికను రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. చంద్రబాబుకు బినామీగా పేరున్న సుజనాచౌదరి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అన్నంతగా బిల్డప్ ఇస్తూ రాజధాని అమరావతికి మద్దతుగా మాట్లాడేవారు. అమరావతికే కేంద్రం ఓకే చేసిందని చెప్పేవారు. 

అయితే బీజేపీ అధికార ప్రతినిధి జీవీల్ నరసింహారావు మరికొందరు పార్టీ నేతలు దానికి భిన్నంగా మాట్లాడేవారు. కొన్నాళ్లు అలా హడావుడి చేసిన సుజనా ఈమధ్య చాలా కాలంగా బీజేపీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. మిగతా ఇద్దరి పరిస్థితి కూడా అలాగే ఉంది. వీరు పార్టీని వాడుకోవడం తప్ప వారివల్ల పార్టీకి ఉపయోగంలేదని గుర్తించిన బీజేపీ అధిష్టానం వారిని పక్కన పెట్టేసింది. జూలైలో జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో గానీ, కొద్దిరోజుల క్రితం ప్రకటించిన పార్టీ జాతీయ కార్యవర్గంలో గానీ వీరికి చోటు కల్పించకపోవడం దీనికి నిదర్శనం. పార్టీ కార్యక్రమాలకు కూడా పంపడంలేదని సమాచారం. ఈ నేపథ్యంలో వీరిని ఉద్దేశించి దేవధర్ చేసిన వ్యాఖ్యలు పార్టీ వారిని పక్కన పెట్టేసిందన్న అభిప్రాయాలను బలపరుస్తున్నాయి.

Also Read : Drugs Trafficking – చంద్రబాబు తాను చెప్పిన దానికి కట్టుబడి ఉంటారా, మళ్లీ యూటర్న్ తీసుకుంటారా